Begin typing your search above and press return to search.

గ్రేటర్ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ అట్టర్ ప్లాప్

By:  Tupaki Desk   |   5 Dec 2020 4:03 AM GMT
గ్రేటర్ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ అట్టర్ ప్లాప్
X
గ్రేటర్ ఎన్నికల ఫలితం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. పోలింగ్ కు ముందు.. తర్వాత లెక్కల మీద లెక్కలు వేసిన అంతా బీజేపీకి పాతిక కంటే సీట్లు వచ్చే పరిస్థితి లేదని తేల్చారు. కొందరు 30 నుంచి 35 వరకు వస్తాయని అంచనా వేశారు. అయితే.. అదంతా ఒక అంచనానే తప్పించి.. అలా రావటానికి శాస్త్రీయ కారణాలు ఏమిటన్నది ఎవరూ చెప్పింది లేదు. చివరకు ఎగ్జిట్ పోల్స్ కూడా అదే మాటను చెప్పింది.

తీరా బ్యాలెట్ బాక్సులు ఓపెన్ చేసి చూస్తే.. గ్రేటర్ ఓటర్ తీర్పు అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఇంత భారీగా బీజేపీకి సీట్లు కట్టబెడతారన్న విషయాన్ని ముందుగా పసిగట్టటంలో ఫెయిల్ అయ్యాయి. అదే సమయంలో టీఆర్ఎస్ సీట్ల శాతం ఇంత ఎక్కువగా పడిపోతుందన్నది గుర్తించలేకపోయాయి. ఎగ్జిట్ పోల్స్ చేపట్టిన సంస్థల్లో ఏ ఒక్కటి కూడా టీఆర్ఎస్ కు 55 సీట్లు (ఐదు సీట్లు తేడాతో).. బీజేపీకి వచ్చిన 48సీట్లను (కనీసం ఐదు సీట్ల తేడాతో) అంచనా వేయటంలో ఫెయిల్ అయ్యాయని చెప్పాలి.

మరో కీలకమైన అంశం ఏమంటే.. గ్రేటర్ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ మొత్తం పెద్దగా పేరు లేని సంస్థలు చేసినవే తప్పించి.. హైదరాబాద్ లో భారీ నెట్ వర్క్ ఉన్న ఏ ప్రముఖ మీడియా సంస్థ చేయలేదన్నది మర్చిపోకూడదు. ఆరా సంస్థ టీఆర్ఎస్ కు 78 సీట్లను చెప్పి.. తాము వేసిన అంచనాలో ఏడు అటు కానీ ఇటు కానీ కావొచ్చని వెల్లడించింది. సీపీఎస్ టీం 82-96 వరకు టీఆర్ఎస్ కు సీట్లు వస్తాయని అంచనా వేశారు.

పీపుల్స్ పల్స్ సంస్థ 68-78 డివిజన్లు టీఆర్ఎస్ కు వస్తాయని.. జన్ కీ బాత్ సంస్థ 74 సీట్లు గులాబీ పార్టీకి దక్కే అవకాశం ఉందని పేర్కొన్నాయి. ప్రజా వెలుగు అయితే మరీ దారుణంగా టీఆర్ఎస్ కు 21 డివిజన్లు మాత్రమే వస్తాయని అంచనా వేశాయి. టీఆర్ఎస్ విషయంలో ఎలా అయితే లెక్క తప్పిందో.. బీజేపీ విషయంలోనూ అలాంటి పరిస్థితే నెలకొంది. గ్రేటర్ ఓటర్ గుంభనంగా వ్యవహరించారా? లేదంటే.. వారి మనసుల్ని అంచనా వేయటంలో ఎగ్జిట్ ఫలితాల కోసం ప్రయత్నించిన సంస్థలు లెక్కలు తప్పయా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.