Begin typing your search above and press return to search.

జీహెచ్ఎంసీ : ముగిసిన నామినేషన్ల ప్రక్రియ ... మొత్తం ఎన్నంటే ?

By:  Tupaki Desk   |   21 Nov 2020 9:50 AM GMT
జీహెచ్ఎంసీ : ముగిసిన నామినేషన్ల ప్రక్రియ ... మొత్తం ఎన్నంటే ?
X
తెలంగాణ లో ఎన్నికల వేడి సెగలు పుట్టిస్తుంది. ఎన్నికల నోటిఫికేషన్‌ అలా వచ్చిందో లేదో.. హైదరాబాద్‌‌ లో రాజకీయాలు‌ హీటెక్కాయి. గ్రేటర్ ఫైట్ ఆరంభంలోనే టీఆర్ ఎస్ , బీజేపీ మధ్య మాటల యుద్ధం మొదలైంది. వరద సాయం ఆపారని టీఆర్ ఎస్‌.. ఆపాల్సిన అవసరం మాకేంటంటూ బీజేపీ విరుచుకుపడుతున్నాయి.హైదరాబాద్‌ గ్రేటర్ ఎలక్షన్‌ దుబ్బాక ఉపఎన్నికను తలపిస్తోంది. నామినేషన్లు కూడా పూర్తి కావడం తో ఇక బీజేపీ, టీఆరెస్ ఢీ అంటే ఢీ అంటున్నాయి. రెండు పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.

ఇదిలా ఉంటే నిన్న మధ్యాహ్నం 3 గంటల సమయానికి నామినేషన్ల ఘట్టం ముగిసింది. మొత్తం గ్రేటర్ పరిధిలో 1,932 మంది అభ్యర్థులు 2,602 నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ వేయడానికి చివరి రోజైన శుక్రవారం ఒక్కరోజే 1,412 మంది అభ్యర్థులతో 1,937 నామినేషన్లు దాఖలయ్యాయి. శుక్రవారం నామినేషన్లు దాఖలు చేసినవారిలో బీజేపీ నుంచి 571 మంది, సీపీఐ నుంచి 21, సీపీఐ(ఎం) నుండి 22, కాంగ్రెస్ నుండి 372, ఎంఐఎం నుంచి 78, టీఆర్ ఎస్ నుంచి 557 మంది, టీడీపీ నుండి 206, రికగనైజ్డ్, రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీల నుండి 115 మంది, స్వతంత్రులు 650 మంది నామినేషన్లు దాఖలు చేశారు. ఈ క్రమంలో శనివారం నుంచి నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. అతి ఎక్కువగా కూకట్ పల్లిలో 119, తక్కువగా బేగంపేటలో 39 దాఖలయ్యాయి.

మొత్తం వార్డుల్లో అత్యధికంగా గోషామహల్‌ నుంచి 36 నామినేషన్లు దాఖలవగా అత్యల్పంగా టోలిచౌకి నుంచి 3 నామినేషన్లు దాఖలయ్యాయి.

జీహెచ్ ఎం సీ లో మొత్తం వార్డులు: 150
అభ్యర్థులు: 1,932
దాఖలైన నామినేషన్లు: 2,602

పార్టీల వారీగా చూస్తే :
బీజేపీ: 571
టీఆర్‌ఎస్‌: 557
కాంగ్రెస్‌: 372
టీడీపీ: 206
ఎంఐఎం: 78
సీపీఐ/సీపీఐ(ఎం): 22/21