గ్రేటర్ ఎన్నికలపై మరో అడుగు ముందుకు.. తాజాగా అధికారుల నియామకం

Thu Oct 29 2020 12:00:42 GMT+0530 (IST)

GHMC Elections 2020

చరిత్రలో ఎప్పుడు లేనట్లుగా.. షెడ్యూల్ కంటే కాస్త ముందుగా గ్రేటర్ హైదరాబాద్ మహానగర పాలక సంస్థకు ఎన్నికల్ని నిర్వహించేందుకు వీలుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేసిన విషయం తెలిసిందే. అన్ని అనుకున్నట్లుగా జరిగితే.. నవంబరు చివర.. లేదంటే డిసెంబరు మొదటివారంలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవుతుందన్న అంచనాలు జోరుగా వినిపించాయి. దీనికి తగ్గట్లే.. ఏర్పాటు సాగుతున్నట్లుగా వార్తలు వచ్చాయి.ఇలాంటివేళ.. ఊహించని విధంగా విరుచుకుపడిన భారీ వర్షాలు.. వాటి కారణంగా చోటు చేసుకున్న వరదలు హైదరాబాద్ మహానగర ప్రజల్నే కాదు.. తెలంగాణ ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఒక అంచనా ప్రకారం ప్రభుత్వం ప్రకటించిన వరద బాధితుల పరిహారం రూ.550కోట్లుగా తేలింది. అంటే.. వరద బాధితులు 5.5 లక్షల మంది ఉన్నారా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.

వరద ఎపిసోడ్ లో అధికారులు ఫెయిల్ అయినట్లుగా బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ విమర్శలు ప్రభుత్వ ఇమేజ్ ను దెబ్బ తీసేలా ఉందన్న వాదన వినిపించింది. దీన్ని అధిగమించేందుకు వీలుగా తెలంగాణ సర్కరు వెంటనే స్పందించటమే కాదు.. గతంలో ఎప్పుడు లేని రీతిలో.. వరద కారణంగా ప్రభావితమైన బాధితులకు రూ.10వేల తక్షణ సాయం అందిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు.

ఈ నిర్ణయం నేపథ్యంలో జీహెచ్ఎంసీ ఎన్నికల విషయంలో ప్రభుత్వం ఏం ఆలోచిస్తుంది? తాను ముందు అనుకున్నట్లుగా షెడ్యూల్ కు కాస్త ముందుగానే వెళుతుందా? లేదంటే షెడ్యూల్ ప్రకారం వెళుతుందా? ఇప్పుడున్న పరిస్థితుల్లో కాస్త ఆలస్యంగా వెళుతుందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి వాటికి చెక్ చెప్పేలా ఉంది తాజాగా తీసుకున్న నిర్ణయాన్ని చూస్తే.  రాష్ట్ర ఎన్నికల కమిషన్ తాజాగా తీసుకున్న నిర్ణయాన్ని చూస్తే.. షెడ్యూల్ కు అనుగుణంగా ఎన్నికలు జరిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.

ఎందుకంటే.. ఎన్నికల రిటర్నింగ్.. సహాయ రిటర్నింగ్ అధికారుల్ని నియమిస్తూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. గ్రేటర్ లోని మొత్తం 150 డివిజన్లకు నిర్వహించే ఈ ఎన్నికలకు 61 మంది రిటర్నింగ్ అధికారులు.. 71 మంది సహాయ రిటర్నింగ్ అధికారుల్ని రిజర్వు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వీరిని జీహెచ్ఎంసీ.. హెచ్ఎండీఏ.. తదితర శాఖల నుంచి ఎంపిక చేస్తూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది.