మేడ్చల్‌లో కేఎల్లార్ భవిష్యత్తు ఏమిటి..?

Sun Dec 05 2021 14:00:01 GMT+0530 (IST)

Future Of That T Congress senior

కేఎల్లార్‌గా సుపరిచితుడైన కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత మొన్నటి వరకు. ఇప్పుడు ఏ పార్టీలో చేరకుండా ఖాళీగా ఉన్నారు. టీపీసీసీ ప్రెసిడెంట్‌గా రేవంత్ నియామకానికి ముందు కేఎల్లార్ కాంగ్రెస్‌లోనే ఉన్నారు. ఎప్పుడైతే రేవంత్ అధ్యక్షుడు అయ్యాడో ఆయన నియామకాన్ని వ్యతిరేకిస్తూ కేఎల్లార్ పార్టీకి రాజీనామా చేశారు. కొన్నాళ్లు రాజకీయ విశ్రాంతి తీసుకుంటానని ప్రకటించారు. ఇప్పడా విరామ సమయం కూడా ముగుస్తోంది. త్వరలో ఆయన ఏదో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. తిరిగి కాంగ్రెస్‌లోకి వెళతారా? ఇతర పార్టీలో చేరతారా అనే విషయంలో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.దిగ్గజాలను ఢీకొని..!
కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి ఒకప్పుడు చేవెళ్లలో సీనియర్ నేత. తెలుగుదేశం పార్టీ నుంచి తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. దివంగత ఇంద్రారెడ్డి కుటుంబానికి రాజకీయంగా బద్ధ శత్రువుగా మారారు. నియోజకవర్గ పునర్విభజనకు ముందు రెండుసార్లు వాళ్ల కుటుంబంపై పోటీచేసి ఓడిపోయారు. తదనంతర రాజకీయాల పరిణామాల నేపథ్యంలో కేఎల్లార్ కూడా కాంగ్రెస్‌లో చేరారు.

ఒకే ఒరలో రెండు కత్తులు ఇమడలేదు..
అందరూ ఊహించినట్లుగానే కేఎల్లార్ రాకను సబితా ఇంద్రారెడ్డి వ్యతిరేకించారు. దీంతో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సబితకు నచ్చజెప్పి కేఎల్లార్‌ను పార్టీలోకి ఆహ్వానించారు. సబితకు ఇబ్బంది రాకుండా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోనే ఉన్న మేడ్చల్ నుంచి కేఎల్లార్‌కు టికెట్ కేటాయించారు. 2009లో మేడ్చల్ నుంచి గెలిచిన లక్ష్మారెడ్డి అప్పటి నుంచి మొన్నటి వరకు కాంగ్రెస్ కు పెద్ద దిక్కుగా మారారు. 2014 2018 ఎన్నికల్లో ఓడిపోయినా పార్టీని అంటిపెట్టుకొనే ఉన్నారు.

రేవంత్ ఎంట్రీతో మారిన సీన్...!
రేవంత్ కాంగ్రెస్‌లో చేరడం కేఎల్లార్‌కు ఇబ్బందిగా మారింది. మల్కాజిగిరి పార్లమెంటు స్థానం నుంచి అధిష్ఠానం రేవంత్‌కు టికెట్ కేటాయించినపుడు కేఎల్లార్ కూడా సహకరించారు. కానీ రేవంత్ రెడ్డి ద్వితీయ శ్రేణి కార్యకర్తలను ప్రోత్సహించారు. తన వెన్నంటి నడిచిన సింగిరెడ్డి హరివర్ధన్‌రెడ్డి తోటకూర జంగయ్య యాదవ్‌ల ఎదుగుదలకు సహకారం అందిస్తూ వచ్చారు. దీంతో కేఎల్లార్ మనస్తాపం చెందారు. ఘట్‌కేసర్‌లో జరిగిన ఒక కార్యక్రమంతో నొచ్చుకున్నారు కూడా. ఇక రేవంత్ పార్టీ అధ్యక్షుడు కూడా కావడంతో వచ్చే ఎన్నికల్లో తనకు టికెట్ రాదని గ్రహించి పార్టీకి రాజీనామా చేశారు. ఇక వచ్చే ఎన్నికల్లో కేఎల్లార్ భవిష్యత్తు ఏమిటో.. తను ఏ పార్టీలో చేరతారో.. ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారో వేచి చూడాలి.