ఇంటర్ స్టూడెంట్స్ కి ఫ్రీ స్మార్ట్ ఫోన్ !

Tue Aug 11 2020 14:40:33 GMT+0530 (IST)

Free smartphone for inter students!

పంజాబ్ ప్రభుత్వం విద్యార్థులకు తియ్యటి వార్త చెప్పింది. ఆగస్టు 12 నుంచి విద్యార్థులకు ఉచితంగా స్మార్ట్‌ఫోన్‌ల పంపిణీని చేస్తున్నట్లు ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో 12 వ తరగతి చదువుతున్న బాలుర బాలికలందరికీ స్మార్ట్‌ఫోన్‌లు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఈ మేరకు ఒక్కోచోట 15 మందికి మించి ఆహ్వానించకుండా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అందరికీ వాటిని అందజేయనుంది.ఈ పథకాన్ని ప్రారంభించడానికి ప్రభుత్వం 'కృష్ణ జన్మాష్టమి' శుభ సందర్భాన్ని ఎంచుకుందని ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ అన్నారు. అంతేకాదు... ఆగస్టు 12 అంతర్జాతీయ యువత దినోత్సవం కూడా ఈ తేదీని ఎంచుకోవడానికి ఒక కారణంగా ఆయన పేర్కొన్నారు. విద్యార్థుల విలువైన విద్యా సంవత్సరం వృథా కాకుండా  ఆన్ లైన్ క్లాసుల ద్వారా వారి కలను నెరవేర్చేందుకు ఈ కార్యక్రమం చేపట్టినట్టు ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ చెప్పారు.   

ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం 50000 స్మార్ట్‌ఫోన్‌లను పంపిణీ చేయనుంది. మొదటి దశలో సుమారు 1.75 లక్షల ఫోన్లు విద్యార్థులకు పంచుతారు. నిజానికి  2017 లో అధికారంలోకి రాకముందు ఇచ్చిన కాంగ్రెస్ ఎన్నికల హామీ ఇది. రాష్ట్రంలోని యువతకు ఉచిత స్మార్ట్‌ఫోన్‌లు ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. అది ఇన్నాళ్లకు నెరవేర్చింది. అయితే... కోవిడ్ సమయంలో అవి అందుబాటులోకి రావడం విద్యార్థులకు ఎంతో ఉపయోగకరం కానున్నాయి.