Begin typing your search above and press return to search.

దారుణం : ఒకే చితిపై నాలుగు మృతదేహాల దహనం .. ఎక్కడంటే ?

By:  Tupaki Desk   |   30 July 2020 11:10 AM GMT
దారుణం : ఒకే చితిపై నాలుగు మృతదేహాల దహనం .. ఎక్కడంటే ?
X
కరోనా వైరస్ కారణంగా ..మన జీవితంలో చూడనటువంటి ఎన్నో దారుణాలని చూడాల్సి వస్తుంది. కరోనా మహమ్మారి కారణంగా ఎన్నో దారుణ ఘటనలు చోటుచేసుకున్నాయి. ఓ మనిషి మన కళ్ళముందే ప్రాణాలతో పోరాడుతున్నా కూడా దైర్యంగా వెళ్లి సాయం చేయలేని పరిస్థితిలో జీవిస్తున్నాం. రోజురోజకు దేశవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసులతో జనాల్లో మరింత ఆందోళన పెరిగిపోయింది. దీంతో రోజుకోక దారుణ ఘటన చూడాల్సి వస్తోంది. తాజాగా వరంగల్ లో అత్యంత ఘోరమైన ఘటన చోటుచేసుకుంది. కరోనా వల్ల ప్రాణాలను కోల్పోయిన నలుగురు వ్యక్తుల మృతదేహాలను ఒకే చితిపై దహనం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.

మూడు చితుల్లో 9 మృతదేహాలకు పైనే కాల్చివేస్తున్నారు. ప్రభుత్వం చెప్తున్న కరోనా మృతుల సంఖ్యకు.. కాలుతున్న చితిమంటలకు ఏమాత్రం పొంతన లేదని ప్రసారమాధ్యమాల్లో ప్రచారం అవుతుంది. ఈ ఘటన వరంగల్ పోతన శ్మశాన వాటికలో చోటు చేసుకుంది. కరోనా సోకి చనిపోయిన మృతదేహాలని తీసుకుపోవడానికి కుటుంబ సభ్యులు కూడా నిరాకరిస్తుండటంతో ప్రభుత్వం వారి అంత్యక్రియలు నిర్వర్తిస్తుంది. మూడు చితులపై తొమ్మిది కంటే ఎక్కువ శవాలను తగలబెడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై పెద్ద స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే , అర్థరాత్రి సమయంలో రోజుకు పదుల సంఖ్యలో మృతదేహాలను కాలుస్తున్నారని స్థానికులు ఆరోపణలు చేస్తున్నారు.

ఈ ఘటన పై గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ పమేలా సత్పతి స్పందించారు. సిబ్బంది కొరత, కట్టెల కొరత వల్లే ఒకే చితిపై ఎక్కువ శవాలను దహనం చేయాల్సి వస్తోందని చెప్పారు. ఆలస్యమైతే మృతదేహాలు డీకంపోజ్ అయిపోతాయని, అందుకే సామూహిక దహనాలు చేస్తున్నామని తెలిపారు. తెలంగాణలో ఇప్పటికే కరోనా వైరస్ విషయంలో ప్రభుత్వంపై అనేక విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. ప్రభుత్వం పలుసార్లు కోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగా , తెలంగాణలో ఇప్పటివరకు నమోదు అయిన కరోనా కేసుల సంఖ్య 60,717 కు చేరగా మరణాల సంఖ్య 505 కు చేరింది.