Begin typing your search above and press return to search.

గుడివాడలో కొడాలితో ఢీ కొడతానంటున్న లేడీ ఫైర్ బ్రాండ్

By:  Tupaki Desk   |   6 Feb 2023 9:00 PM GMT
గుడివాడలో కొడాలితో ఢీ కొడతానంటున్న లేడీ ఫైర్ బ్రాండ్
X
ఏపీలో హాటెస్ట్ సీట్లలో గుడివాడను ఒకటిగా చెప్పాలి. ఇక్కడ మాజీ మంత్రి కొడాలి నాని సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. నాని 2004లో తొలిసారి తెలుగుదేశం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నిక అయ్యారు. ఆయన 2009లో అదే పార్టీ నుంచి గెలిచారు. ఇక వైసీపీ నుంచి 2014, 2019లలో గెలిచారు. ఇలా రెండు ప్రాంతీయ పార్టీల నుంచి చెరి రెండు సార్లు గెలిచి సమం చేశారు. అంతే కాదు తాను ఏ రాజకీయ పార్టీలో అయినా గెలవగలను అని కూడా రుజువు చేశారు.

ఇక 2024లో నాని మరో సారి పోటీకి వైసీపీ తరఫున దిగడం ఖాయం. నాని మీద ఎవరు పోటీ చేస్తారు అన్నది తెలుగుదేశంలో ఇప్పటిదాకా తేలకపోయినా ఒక బలమైన ఎన్నారైని దించాలని ఆలోచిస్తున్నారు. అంగబలం అర్ధబలం దండీగా ఉన్న వారినే పోటీ చేయించాలన్నది తెలుగుదేశం పార్టీ ఆలోచనగా ఉంది.

ఇదిలా ఉంటే నాని విషయంలో తెలుగుదేశం జనసేన కూడా టార్గెట్ చేస్తున్నాయి. చంద్రబాబు పవన్ కళ్యాణ్ అయితే పర్సనల్ గా కూడా తీసుకుని ఆయన్ని ఈసారి అసెంబ్లీకి రానీయకూడదని కూడా డిసైడ్ అయ్యాయని అంటున్నారు. అదే విధంగా కొడాలి నాని విషయంలో తెలంగాణా నుంచి కూడా పోటీకి సై అంటున్న వారు ఉన్నారు.

అలా లేడీ ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి వచ్చే ఎన్నికల్లో ఖమ్మం అసెంబ్లీ సీటు నుంచి తాను పోటీ చేస్తాను అని చెబుతున్నారు. అదే విధంగా రెండవ సీటుగా ఏపీలోని గుడివాడ నుంచి కూడా పోటీకి తయారు అని ప్రకటించేశారు. గుడివాడ నుంచి పోటీ చేయాలని తనకు పెద్ద ఎత్తున వినతులు వస్తున్నాయని అంటున్నారు. ఈ విషయంలో ఆలోచించుకుని నిర్ణయిస్తామని చెప్పారు.

ఇక ఏపీ రాజకీయాల మీద రేణుకా చౌదరి చాలా కాలంగా దృష్టి పెడుతూ వస్తున్నారు. ఆమె జగన్ మీద అప్పట్లో చేసిన హాట్ కామెంట్స్ వైరల్ గా మారాయి. రేణుకా చౌదరి కామెంట్స్ కి కొడాలి నాని ఘాటైన రిప్లై ఇచ్చారు. ఆమె సొంత రాష్ట్రంలో చూసుకోవాలని సలహా ఇచ్చారు. ఇక అమరావతి రైతుల పాదయాత్ర అమరావతి టూ అరసవల్లి కి కొబ్బరి కాయ కొట్టి మరీ రేణుకా చౌదరి ఘంగంగా ప్రారంభోత్సవం చేశారు. ఏపీకి రాజధాని అమరావతి మాత్రమే అని ఆమె నాడు గట్టిగా చెప్పారు.

ఇలా రేణుకా చౌదరి ఏపీ రాజకీయాల్లో కూడా వీలైనపుడల్లా వేలు పెడుతున్నారు. ఇపుడు ఆమె గుడివాడ నుంచి పోటీ అంటున్నారు. ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి చూస్తే పెద్దగా ఏమీ ఎత్తిగిల్లలేదు. అయితే ఏపీలో విపక్ష కూటమిలో కాంగ్రెస్ చేరుతుందని అంటున్నారు. అలా కాంగ్రెస్ చేరితే అన్ని పార్టీల మద్దతు ఇస్తే గుడివాడలో రేణుకా చౌదరి పోటీ చేసి కొడాలి నానిని ఢీ కొడతారు అని అంటున్నారు.

వచ్చే ఎన్నికలు ఏపీలో చాలా వేడిగా వాడిగా జరుగుతాయి కాబట్టి ఇలాంటి చిత్రాలు చాలానే చూడవచ్చు అని అంటున్నారు. అందులో భాగమే రేణుకా చౌదరి ఏపీ నుంచి పోటీ అంటున్నారు. ఇక్కడ మరో విషయం కూడా ఉంది. తెలంగాణా ఎన్నికలు ముందు జరుగుతాయి. అక్కడ కాంగ్రెస్ పరిస్థితి ఏ మాత్రం మెరుగుపడినా ఏపీలో కూడా ఆ పార్టీ ఎంతో కొంత పుంజుకుంటుందని లెక్కలేస్తున్నారు. ఇక తెలంగాణా నుంచి గట్టి కాంగ్రెస్ నాయకులు ఈసారి ఏపీలో ప్రచారం చేస్తారని అంటున్నారు. అలా రేణుకా చౌదరి ఏపీ మీద ఫోకస్ పెడతారు అని అంటున్నారు. మొత్తానికి కొడాలి నాని మీద చాలా మంది గురి పెట్టి ఉంచారని అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.