తన తండ్రికీ ఇదే ఎదురైంది: మీరా కుమార్ కామెంట్స్ వైరల్!

Wed Aug 17 2022 14:00:01 GMT+0530 (India Standard Time)

Former Speaker Meira Kumar comments go viral

దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయినా.. ఆజాదీ కా అమృత్ మహోత్సవాలు జరుపుకుంటున్నా దేశంలో ఇంకా అసమానతలు వీడటం లేదు. తాజాగా తాగునీటి కుండను తాకాడని టీచర్ తీవ్రంగా కొట్టడంతో ఓ దళిత బాలుడు మృతిచెందిన ఘటన రాజస్థాన్‌లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. దీన్ని నిరసిస్తూ ఏకంగా బారాబాత్రూ ఎమ్మెల్యే పానాచందు మేఘావల్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయగా మున్సిపల్ కౌన్సిలర్లు కూడా ఇదే బాట పట్టారు.రాజస్థాన్‌లోని జాలోర్ జిల్లాలో జూలై 20న ఓ 9 ఏళ్ల దళిత విద్యార్థి పాఠశాలలో తాగునీటి కుండను తాకాడన్న కారణంగా టీచర్ చితకబాదారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆ బాలుడు చికిత్స పొందుతూ ఆగస్టు 13న ప్రాణాలు వదిలాడు. దీంతో ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.

తాజాగా ఈ దారుణ సంఘటనపై తొలి దళిత లోక్‌సభ స్పీకర్ తొలి మహిళా స్పీకర్ మీరా కుమార్ కూడా స్పందించారు. వందేళ్ల క్రితం తన తండ్రి మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్‌రామ్‌కు సైతం ఇలాంటి పరిస్థితే ఎదురయిందని నాటి చేదు ఘటనను గుర్తు చేసుకున్నారు.

తాగునీటి కుండలో మంచి నీరు తాగాడని తన తండ్రి బాబూ జగ్జీవన్ రామ్‌ను సైతం కొట్టారని.. అయితే ఆయన ప్రాణాలతో బయటపడ్డాడని మీరా కుమార్ తాజాగా ట్వీట్ చేశారు. రాజస్థాన్ దళిత బాలుడి ఉదంతం తనను కలచివేసిందన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయినా.. కుల వ్యవస్థ ఇంకా మనకు ప్రధాన శత్రువుగానే ఉంది అంటూ మీరా కుమార్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదే విషయంపై మీరా కుమార్ ఒక మీడియా చానెల్‌తోనూ మాట్లాడారు. దళితుడైన తన తండ్రి బాబూ జగ్జీవన్ రామ్‌ను తలుచుకుని బాధపడ్డారు. ఆయన కూడా ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశ ఉప ప్రధానమంత్రిగా పనిచేసినప్పటికీ ఇప్పటికీ ఆయనను దళిత నేతగానే సంభోదించడం బాధాకరమన్నారు. తనకు కూడా ఇలాంటి పరిస్థితులై ఎదురయ్యాయని మీరా కుమార్ వాపోయారు.

లండన్‌లో తాను అద్దె ఇల్లు కోసం వెతికినప్పుడు చాలా మంది కుల ప్రస్తావన తీసుకొచ్చారని మీరా కుమార్ ఆ చేదు ఘటనను గుర్తు చేసుకున్నారు. తన కులం చూసి ఇల్లు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు.