Begin typing your search above and press return to search.

కరోనా ఎఫెక్ట్ : టికెట్ కోసం అభిమానుల సాయం కోరిన మాజీ క్రికెటర్‌ !

By:  Tupaki Desk   |   29 March 2020 12:30 AM GMT
కరోనా ఎఫెక్ట్ : టికెట్ కోసం అభిమానుల సాయం కోరిన మాజీ క్రికెటర్‌ !
X
కరోనా వైరస్ దెబ్బకి ప్రపంచంలోని చాలా దేశాలు లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. ఒక దేశం నుండి మరో దేశానికీ ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండాలి అంటే ఉన్న ఏకైక మార్గం ఇదే కావడంతో ..దాదాపుగా చాలా దేశాలు విమాన సర్వీసెస్ ని ఆపేసాయి. దీనితో అందరికి మంచే జరుగుతున్నా కూడా ..కొంతమంది మాత్రం అనేక ఇబ్బందులని ఎదుర్కొంటున్నారు. తాజాగా ఓ మాజీ క్రికెటర్ కి కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. అసలేమైంది ? అంటే ..

పూర్తి వివరాలు చూస్తే ..న్యూజిలాండ్‌ మాజీ పేసర్‌ ఇయాన్‌ ఓబ్రైన్‌ ప్రస్తుతం ఇంగ్లాండ్ లో స్థిరపడ్డారు. తన తల్లిదండ్రులను కలిసేందుకు అతను స్వస్థలం వచ్చాడు. అయితే కరోనా కారణంగా దాదాపు అన్ని విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఏదోలా వెళ్దామనుకొని అందుబాటులో ఉన్న మూడు ఫ్లయిట్‌లలో అతను బుకింగ్‌ చేశాడు. అయితే ఆ మూడు చివరి నిమిషంలో రద్దు కాగా, డబ్బులు కూడా తిరిగివ్వలేదు. ఇంగ్లండ్‌ లో ఉన్న తన కుటుంబం గురించి అతను తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేశాడు. ‘నా భార్య ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతోంది. ఇప్పుడు ఛాతీకి ఇన్‌ఫెక్షన్‌లాంటిదేమైనా వస్తే కరోనా కారణంగా ఆమె ప్రాణాలకే ప్రమాదం. పైగా ఇద్దరు చిన్నపిల్లలు, 80 ఏళ్ల తల్లి కూడా ఉన్నారు. అక్కడికి వెళ్లి ఆమె బాధను కొంత పంచుకోవాలని భావిస్తుంటే ఇప్పుడు నా కారణంగా అది మరింత పెరిగేటట్లు అనిపిస్తోంది’ అని ఓబ్రైన్‌ ఆవేదన వ్యక్తం చేశాడు..

తాను ఇంగ్లండ్‌ వెళ్లడానికి డబ్బుల్లేక పోయానంటూ అభిమానుల ముందుకొచ్చాడు. దీనితో వెంటనే స్పందించిన అభిమానులు అతను వెళ్లడానికి కావాల్సిన మొత్తాన్ని సమకూర్చారు. అతను తన ఇంటికి వెళ్లేందుకు కావాల్సిన 2,250 పౌండ్లు (సుమారు రూ. 2.07 లక్షలు) జమ కావడంతో అతను కన్నీళ్ల పర్యంతమవుతూ అందరికి ధన్యవాదాలు తెలిపాడు. మీరంతా నిజంగా చాలా మంచివారు. ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. నిద్ర లేవగానే ఏడుపు ఆపుకో లేకపోయాను అని ఓబ్రైన్‌ వీడియో లో చెప్పాడు. న్యూజిలాండ్‌ తరఫున 22 టెస్టులు, 10 వన్డేలు ఒబ్రైన్‌ ఆడాడు. ఇక దేశవాళీ క్రికెట్‌లో 58 లిస్ట్‌-ఎ మ్యాచ్‌లు ఆడగా, ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లు పరంగా చూస్తే 91 మ్యాచ్‌లు ఆడాడు.