గాజుగ్లాస్ లో నా కమలం అంటున్న కన్నా..26న చేరడం ఖాయం....?

Tue Jan 24 2023 05:00:02 GMT+0530 (India Standard Time)

Former Minister Kanna Lakshminarayana joins janasena

గుంటూరు జిల్లాలో సీనియర్ మోస్ట్ బీజేపీ లీడర్ ఆ పార్టీ మాజీ ప్రెసిడెంట్ అయిన కన్నా లక్ష్మీ నారాయణ తన రాజకీయ జీవితంలో కీలకమైన నిర్ణయాన్ని తీసుకోబోతున్నారు. దానికి ఆయన డేట్ ని ఫిక్స్ చేసుకున్నారు. ఈ నెల 26న ఆయన జనసేనలో చేరేందుకు రెడీ అవుతున్నారు. ఈ డేట్ కి చాలా ప్రాధాన్యత ఉంది. అదెలా అంటే ఈ నెల 24 25 తేదీలలో ఏపీ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాలలో పొత్తుల మీద చర్చిస్తారు అని అంటున్నారు.ఎటూ పొత్తులకు నో అనే బీజేపీ అంటుందని ఇప్పటికే కొన్ని సంకేతాలు వెలువడుతున్నాయి. దాంతో తొంబై తొమ్మిది శాతం పొత్తు ఆశలను వదిలేసుకున్న  కన్నా   26న జనసేన శిబిరానికి సై అంటున్నారు. ఒకవేళ అద్భుతం జరిగి పొత్తులకు బీజేపీ జై కొడితే మాత్రం ఆయన సైలెంట్ అవుతారు అని అంటున్నారు. మొత్తానికి జనవరి 26న గణతంత్ర వేడుకల సందర్భాన్ని కన్నా తన రాజకీయ భవితవ్యానికి నాందిగా మార్చుకోబోతున్నారు అని అంటున్నారు.

కన్నా బీజేపీలో ఉన్నా చాలా కాలంగా అసంతృప్తిగా ఉన్నారు. ఆయనను బీజేపీ ఏపీ ప్రెసిడెంట్ పదవి నుంచి తొలగించినప్పటి నుంచి ఆయన అన్యమనస్కంగానే ఉన్నారు. ఇక ఆయన ప్లేస్ లో ప్రెసిడెంట్ అయిన సోము వీర్రాజుతో ఆయనకు మొదటి నుంచి పడడంలేదు. ఇద్దరి మధ్య గ్యాప్ చాలా ఉంది. తాను ప్రెసిడెంట్ గా ఉన్నపుడు నియమించిన జిల్లా ప్రెసిడెంట్లు ఇతర పదవుల్లో ఉన్న వారిని సోము వీర్రాజు పనిగట్టుకుని మరీ తొలగిస్తున్నారు అని కన్నా గుస్సా అవుతున్నారు.

ఇక ఈ మధ్యనే ఆయన ఒక ఘాటైన కామెంట్ కూడా చేశారు. సోము వీర్రాజు వైఖరి వల్లనే జనసేన పొత్తు నుంచి దూరం అవుతోందని విమర్శించి ఆయన సోముకు మరింత దూరం అయ్యారు. దీని మీద హై కమాండ్ నుంచి కూడా ఆయనకు అక్షింతలు వేయించడం ద్వారా సోము సక్సెస్ అయినా కన్నా మాత్రం పెట్టే బేడా నాడే సర్దుకున్నారు అని అంటున్నారు. ఈ క్రమంలో జనసేన లీడర్ అయిన నాదెండ్ల మనోహర్ తో కన్నా లక్ష్మీనారాయణ సమావేశం కావడంతో ఆయన రూటు మారింది అని సోము వర్గం అంచనా కట్టింది. అయితే హై కమాండ్ ఫోన్ తో కొన్నాళ్ళు ఆగిన కన్నా ఇపుడు ఇక లాభం లేదని జెండా ఎత్తేస్తున్నారు అని అంటున్నారు.

ఆయనకు జనసేన లో గుంటూరు పశ్చిమ సీటు ఇస్తారని ప్రచారం సాగుతోంది. జనసేన గుంటూరు జిల్లాలో సత్తెనపల్లి తెనాలి గుంటూరు పశ్చిమ సీట్లు కోరుతోంది. తెనాలి నుంచి నాదెండ్ల మనోహర్ పోటీ చేస్తారు సత్తెనపల్లి నుంచి ఎర్రం వెంకటేశ్వరరెడ్డి బరిలోకి దిగబోతున్నారు. మొత్తానికి అన్నీ ఆలోచించిన మీదటనే కన్నా బీజేపీకి పెద్ద నమస్కారం అంటున్నారు అని తెలుస్తోంది.

ఆయన కోపం ఎలా ఉంది అంటే గాజుగ్లాస్ లో నా కమలం అంటూ ఏకంగా జంప్ అయ్యేటంతగా అని అంటున్నారు. మొత్తానికి కన్నా వంటి కీలక నేత బీజేపీని వీడిపోతే అది ఆ పార్టీకి నష్టం చేకూరుస్తుంది అని అంటున్నారు. అదే టైం లో గుంటూరు జిల్లాలో పశ్చిమ తూర్పు పెదకూరపాడు సత్తెనపల్లి తాడికొండ మంగళగిరి నియోజకవర్గాలలో గట్టి పట్టు అనుచర బలం కలిగి ఉన్న కన్నా చేరికతో జనసేన పటిష్టం అవుతుంది అని అంటున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.