పవన్ కల్యాణ్ కు అది చాలా అవమానం.. ఎలానో చెప్పిన మాజీ ఎంపీ

Fri Sep 24 2021 11:02:37 GMT+0530 (IST)

Former MP Vundavalli Arun Kumar About Pawan

జనసేన అధినేత పవన్ కల్యాణ్ గురించి ఆసక్తికర విషయాల్ని వెల్లడించారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. రాజకీయ నేతగా సుపరిచితుడైన ఆయన.. ఇటీవల కాలంలో ఏ రాజకీయ పార్టీకి ప్రాతినిధ్యం వహించకుండా ఉండటం.. తన దారిన తాను ఉంటూ.. రాజకీయ విశ్లేషణలు చేస్తున్నారు. విషయం ఏదైనా చర్చించే సత్తా ఉన్న ఆయన.. కుండబద్ధలు కొట్టినట్లుగా మాట్లాడటం మొదట్నించి అలవాటే. తాజాగా ఒక యూ ట్యూబ్ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఆసక్తికర విషయాల్ని వెల్లడించారు.జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రస్తావన వచ్చినప్పుడు.. ఒక పార్టీ అధినేతగా రెండు చోట్ల పోటీ చేసి.. ఆ రెండు చోట్ల ఓడిపోవటం.. అది ఆయనకు చాలా పెద్ద అవమానమని.. అందులో నుంచి త్వరగా బయటపడటం.. మూడో రోజుకే.. తాను ఓటమిని అధిగమించానని బయటకొచ్చి చెప్పటం సామాన్యమైన విషయాదన్నారు ఉండవల్లి. ‘‘అంత అవమానాన్ని అతను చాలా త్వరగా దిగమింగుకొని బయటకు వచ్చి మళ్లీ మీడియా ముందు మాట్లాడారు. ఈ చర్యతో ఆయనో మెసేజ్ అందరికి ఇచ్చారు.. తాను ఎక్కడికి వెళ్లటం లేదని. అలా రావటం చూసినప్పుడు.. అతను రాబోయే రోజుల్లో ఒక ఫోర్సు అవుతారన్న భావన కలిగింది’’ అని చెప్పారు.

సంస్థాగతంగా పార్టీని బలోపేతం కావాల్సిన అవసరం లేదా? అన్న ప్రశ్నకు బదులిస్తూ.. ‘వస్తాడు. డబ్బులు కావాలి కదా?ఆయనే చెప్పారు కదా. డైరెక్టుగా చెప్పాడు కదా.. డబ్బుల కోసం యాక్టింగ్ చేస్తున్నానని. రెండుమూడు సినిమాలు చేస్తే డబ్బులు వస్తాయి కదా? అని పేర్కొన్నారు.

అభిమానులు సినిమాల వరకేనని.. తాను తొలిసారి పవన్ ను కలిసిన సందర్భంలో సినిమాలు ఆపేస్తానని చెప్పినప్పుడు.. ఆ తప్పు చేయొద్దని చెప్పానన్నారు. సినిమాలే బేస్ అని.. సినిమాలు మానొద్దని తాను చెప్పానని.. కానీ పవన్ మాత్రం మానేస్తానని చెప్పారన్నారు. ‘ఆయన ఆ రోజున నెగ్గుతాం మేము. పవర్లోకి వస్తామని చెప్పిన రోజునే చెప్పాను.. యాక్టింగ్ మానొద్దని. సినిమాలు ఉంటేనే అభిమానులు ఉంటారు తప్ప.. సినిమాలు మానేస్తే అభిమానులు ఎక్కడ ఉంటారు?’ అని వ్యాఖ్యానించారు.

సినిమా అభిమానుల్ని ఓట్లుగా బదిలీ చేసుకోవటంలో ఎక్కడ ఫెయిల్ అయ్యారన్న ప్రశ్నకు బదులిస్తూ.. ‘ఆయన ఓటు మారలేదు. ఆయన ఎన్నికల ప్రచారమే యాంటీ ప్రతిపక్షంగా సాగింది. అధికార పక్షం మీద విమర్శలు చేయాల్సింది పోయి.. జగన్ మీద విమర్శలు చేశారు. అది తప్పు. రూలింగ్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడాలి కానీ అపోజిషన్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడకూడదు కదా? ఈయనకు.. చంద్రబాబు ప్యాకేజీ అని జనాలకు జగన్ పార్టీ ప్రచారం చేయటం.. ఆ విషయంలో జగన్ ను నమ్మారు. తూర్పుగోదావరి జిల్లాలో చాలా తక్కువ ఓట్లు వచ్చాయి. ప్రజారాజ్యం పార్టీ సమయంలో తూర్పుగోదావరి జిల్లాలో రెండో స్థానంలో నిలిచింది. తెలుగుదేశం థర్డ్ ప్లేస్. ఇక్కడేమీ రాలేదు’ అని చెప్పారు.

బుచ్చయ్య చౌదరితో తాను మాట్లాడినప్పుడు రైట్ టైంలో టీడీపీ.. జనసేన కలుస్తాయని.. బీజేపీ నుంచి బయటకు వస్తారని చెప్పారని.. అది జరుగుతుందా? అని ఇంటర్వ్యూ చేసే జర్నలిస్టు ప్రశ్నించగా.. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమేనని.. రాజకీయాల్లో నాకు అవసరం అనుకుంటే ఎవరి కాళ్లు అయినా పట్టుకుంటాం.. ఎవరి పీక అయినా నొక్కుతాం’ అంటూ బదులిచ్చారు ఉండవల్లి.