Begin typing your search above and press return to search.

షర్మిల పార్టీలోకి పొంగులేటి? తాజా భేటి దేనికి సంకేతం

By:  Tupaki Desk   |   24 Jan 2023 6:47 PM GMT
షర్మిల పార్టీలోకి పొంగులేటి? తాజా భేటి  దేనికి సంకేతం
X
బీజేపీ నుంచి ఆఫర్ వస్తే కాలదన్నాడు.. కాంగ్రెస్ వాళ్లు అక్కున చేర్చుకుంటామంటే నో అన్నాడు. పోయి పోయి తెలంగాణలో బలం లేని ఆంధ్రా ఆడకూతురు పార్టీలో పొంగులేటి చేరుతున్నాడు. ఇదెక్కడి ఖర్మరా బాబూ అంటూ ఆయన అనుచరులు సైతం తలపట్టుకుంటున్నారు. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తాజాగా వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలతో భేటి కావడం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.

చాలా రోజులుగా బీఆర్ఎస్ లో అసంతృప్తిగా ఉంటున్న ఆయన పార్టీ మారేందుకు రెడీ అయ్యారు. బీజేపీలో చేరడానికి ప్రయత్నించినా సీట్లపై అధిష్టానం హామీ ఇవ్వకపోవడంతో విరమించుకున్నట్టు సమాచారం. ఇక కాంగ్రెస్ వాళ్లు ఆఫర్ ఇచ్చినా కూడా పొంగులేటి అందులో చేరలేదు.

పొద్దు ముగిసిన తర్వాత ఏ గూటి పక్షి ఆ గూటికి వస్తుందన్నది వాస్తవమని ఇటీవల ఆత్మీయ సమ్మేళనంలో పొంగులేటి వ్యాఖ్యానించారు. దీంతో మళ్లీ ఆయన బీఆర్ఎస్ లోనే యాక్టివ్ అవుతారని అందరూ భావించారు. ఈ క్రమంలోనే తాజాగా షర్మిలతో భేటి కావడంతో వైఎస్ఆర్టీపీలో చేరతారని రాజకీయవర్గాల్లో టాక్ నడుస్తోంది.

ముఖ్యమంత్రి కేసీఆర్ తనకు ఇచ్చిన మాట తప్పారని.. ఇన్నేళ్లు ఆయన మాటకు కట్టుబడి ఉన్నానని పొంగులేటి అన్నారు. గత ఎన్నికల్లో ఇండిపెండెంట్ గానైనా పోటీచేయాలని ఎంతో మంది కోరినా.. తాను నిరాకరించానని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ చెప్పిన మాటలతో పార్టీ నియామాలకు కట్టుబడి ఉన్నాని పేర్కొన్నారు. ఎన్నో కారణాలు చూపుతూ తన ఎంపీ స్థానానికి పోటీచేసే అవకాశం ఇవ్వకుండా మరో పార్టీకి చెందిన వ్యక్తిని పోటీలో నిలిపారని గుర్తు చేశారు. నాలుగేళ్లుగా తనను నమ్ముకున్న వారికి ఏమీ చేయలేకపోయానని వాపోయారు.

చివరగా రాబోయే కురుక్షేత్రంలో తాను ఖచ్చితంగా యుద్ధంలో పాల్గొనబోతున్నానని పొంగులేటి స్పష్టం చేశారు. గత నాలుగేళ్లుగా ఏ పదవిలో లేకపోయినా.. ప్రజలతోనే మమేకమవుతూ వచ్చానని తెలిపారు. జిల్లా ప్రజలు కోరుకున్నట్లు ముందుకెళతానని పేర్కొన్నారు. రాజకీయ నాయకుడు ప్రజల దీవెనలు, అభిమానులు పొందిన నాడే రాజకీయాల్లో రాణిస్తాడని.. ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు కోరుకున్నట్లు ముందుకెళతానని ప్రకటించాడు.

ఈ వ్యాఖ్యల నేపథ్యంలో షర్మిల పార్టీలో చేరి తన వాళ్లందరికీ టికెట్లు ఇప్పించుకొని ఖమ్మం జిల్లా వ్యాప్తంగా గెలవడానికి పొంగులేటి ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.