Begin typing your search above and press return to search.

హైదరాబాద్ శివారులో కోడి పందేలు.. పోలీసుల్ని చూసి చింతమనేని పరార్!

By:  Tupaki Desk   |   7 July 2022 4:13 AM GMT
హైదరాబాద్ శివారులో కోడి పందేలు.. పోలీసుల్ని చూసి చింతమనేని పరార్!
X
బుధవారం రాత్రి వేళలో హైదరాబాద్ మహానగర శివారులో అనూహ్య సంఘటన జరిగింది. భారీ ఎత్తున పందేల నడుమ కోడి పందేల్ని నిర్వహిస్తున్నట్లుగా పోలీసులకు పక్కా సమాచారం అందింది.

దీంతో స్పందించిన వారు గుట్టుగా సాగుతున్న కోడి పందేల మీద దాడి చేశారు. అక్కడే టీడీపీ నేత.. మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఉన్నట్లుగా ప్రచారం సాగుతోంది. పోలీసుల దాడి నేపథ్యంలో.. తప్పించుకొని వెళ్లిపోయినట్లుగా చెబుతున్నారు.

కోడి పందేలు జరుగుతున్న చోట చింతమనేని ప్రభాకర్ తో పాటు.. పెద్ద ఎత్తున సంపన్నులు ఉన్నట్లుగా చెబుతున్నారు. పటాన్ చెర్వు పరిధిలో జరిగిన ఈ దాడిలో 20 మందికి పైనే బెట్టింగ్ రాయుళ్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. పెద్ద ఎత్తున నగదు కూడా స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. పటాన్ చెర్వు పెదకంజర్ల గ్రామంలోని ఒక తోటలో గడిచిన కొద్ది కాలంగా గుట్టుచప్పుడు కాకుండా భారీగా కోడి పందేలు జరుగుతున్నట్లుగా చెబుతున్నారు.

ఘటనా స్థలంలో దాదాపు 100 పందెం కోళ్లను.. రూ.10 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. మొత్తం 70 మంది వరకు బెట్టింగ్ రాయుళ్లు అక్కడ ఉండగా.. వారిలో 49 మంది పరార్ కాగా.. మరో 21 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ పందేల ప్రధాన నిర్వాహకుడు చింతమనేని ప్రభాకర్ గా చెబుతున్నారు. అయితే.. నిర్వాహకుల్లో అక్కినేని సతీశ్.. క్రిష్ణంరాజు.. బర్ల శ్రీను తదితరులు పోలీసుల అదుపులో ఉన్నారు.

ఇక్కడ జరిగే పందేలకు ఏపీ నుంచి పెద్ద ఎత్తున ప్రముఖులు వచ్చి బెట్టింగులు పెడుతుంటారని చెబుతారు. తాజాగా.. ఈ యవ్వారం మీద పోలీసులకు సమాచారం అందటంతో వారు ఆకస్మికంగా దాడి జరపటంతో.

ఈ వ్యవహారం వెలుగు చూసింది. పోలీసుల్ని చూసినంతనే టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్ గోడ దూకి తప్పించుకున్నట్లుగా చెబుతున్నారు. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నట్లుగా చెబుతున్నారు. తరచూ ఏదో రకంగా వార్తల్లో నలిగే చింతమనేని రోటీన్ కు భిన్నమైన వార్తల్లోకి రావటం గమనార్హం.