Begin typing your search above and press return to search.

మాజీ హోం మంత్రి టార్గెట్ : టీడీపీ ట్రంప్ కార్డ్ ఆయనే...?

By:  Tupaki Desk   |   16 May 2022 9:50 AM GMT
మాజీ హోం మంత్రి టార్గెట్ :  టీడీపీ ట్రంప్ కార్డ్ ఆయనే...?
X
ఈ మధ్యనే మంత్రివర్గ విస్తరణలో పదవి కోల్పోయిన మేకతోటి సుచరితకు వచ్చే ఎన్నికల్లో బలమైన ప్రత్యర్ధి రెడీ అవుతున్నారు. ఆమె 2009 ఎన్నికల్లో తొలిసారి కాంగ్రెస్ టికెట్ మీద గెలిచారు. ఆమె వైఎస్సార్ అండంతో రాజకీయాల్లోకి వచ్చారు. ఇక జగన్ పార్టీ పెట్టగానే అటు వైపు నడిచారు. ఇక 2014లో వైసీపీ టికెట్ మీద పోటీ చేసిన సుచరిత ఓడిపోయారు. ఆమెను ఓడించిన వారు టీడీపీ అభ్యర్ధిగా ఉన్న రావెల్ కిషోర్ బాబు. ఆయన మాజీ రైల్వే అధికారి. దళిత మేధావిగా గుర్తింపు ఉంది. ఫస్ట్ టైమ్ పాలిటిక్స్ లోకి వస్తూనే టీడీపీ తరఫున టికెట్ దక్కించుకుని ఎమ్మెల్యే అయ్యారు. ఆ వెంటనే మంత్రి అయ్యారు.

అయితే కేవలం మూడేళ్ళ వ్యవధిలోనే మంత్రి పదవి పోవడంతో ఆయన మనస్థాపం చెంది టీడీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరారు. ఇక ఆయన 2019 ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున పోటీ చేసి 26 వేలకు పైగా ఓట్లను తెచ్చుకోవడం విశేషం.

ఇదిలా ఉంటే ఎన్నికలు పూర్తి అయిన తరువాత బీజేపీలోకి వెళ్ళిన రావెల తాజాగా ఆ పార్టీకి రాజీనామా చేసారు. ఆయన టీడీపీలో చేరుతారు అని అంటున్నారు. ఈ మేరకు గ్రీన్ సిగ్నల్ రావడంతోనే ఆయన బీజేపీకి రాం రాం అనేశారు అంటున్నారు.

ఇక రావెల టీడీపీ తరఫున 2024 ఎన్నికల్లో ప్రత్తిపాడు నుంచి పోటీ చేసి ముచ్చటగా మూడవసారి మేకతోటి సుచరిత మీద పోటీ చేస్తారు అన్న మాట. ఇక సుచరిత ఇప్పటికి రెండు సార్లు గెలిచినా వైసీపీకి కొంత ఇబ్బందికరమైన వాతావరణం అక్కడ ఉంది. దానికి తోడు మంత్రి పదవి పోవడంతో ఆమె అనుచరులు కూడా డీలా పడ్డారు. దాంతో వచ్చే ఎన్నికల్లో ఆమె గెలుపు అవకాశాలు ఎలా ఉంటాయో అన్న చర్చ ఉంది.

రావెల టీడీపీ అభ్యర్ధి అయితే మాత్రం గట్టి పోటీ ఉంటుంది. పైగా విజయావకాశాలు కూడా ఉంటాయని అంటున్నారు. జనసేన మద్దతు ఉంటే కనుక కచ్చితంగా ఈ సీటు రావెల ఖాతాలోకి వెళ్తుంది అని కూడా విశ్లేషిస్తున్నారు.

ఇంకో వైపు చూస్తే రావెల కనుక టీడీపీలోకి వస్తే బలమైన క్యాడర్ ఉన్నా లీడర్ లేని టీడీపీకి పెద్ద దిక్కుగా మారుతారు అని అంటున్నారు. మొత్తానికి చూస్తే రావెల టీడీపీలోకి రీ ఎంట్రీ అంతా మాజీ హోం మంత్రిని టార్గెట్ చేయడానికే అంటున్నారు. టీడీపీ అధినాయకత్వం ఇలా స్కెచ్ వేసి మరీ విభజన ఏపీ ఫస్ట్ హోం మంత్రి ని ఓడించాలని చూస్తోంది అంటున్నారు.