అసెంబ్లీలో మాజీ సీఎం పంచె ఊడింది.. తర్వాతేమైందంటే?

Fri Sep 24 2021 11:01:28 GMT+0530 (IST)

Former Chief Minister Siddaramaiah in Assembly

సరదా సంఘటన ఒకటి కర్ణాటక అసెంబ్లీలో చోటు చేసుకుంది. హాట్ హాట్ గా చర్చ జరుగుతున్న వేళ.. అనూహ్యంగా చోటు చేసుకున్న పరిణామం సభలోని సభ్యులందరిని నవ్వుల్లో ముంచెత్తింది. అదే సమయంలో.. దీనంతటికి కారణమైన మాజీ ముఖ్యమంత్రి చిన్నబుచ్చుకోకుండా స్పోర్టివ్ గా తీసుకోవటాన్ని అభినందించాల్సిందే. ఇంతకూ జరిగిందేమంటే.. ప్రస్తుతం కర్ణాటక అసెంబ్లీ సమావేశాలు సాగుతున్నాయి. కొత్త ముఖ్యమంత్రిగా బసవరాజు బొమ్మై ప్రమాణస్వీకారం జరుగుతున్న మొదటి అసెంబ్లీ సమావేశాలు ఇవే. గురువారం నాటి సభలో మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య సీరియస్ గా మాట్లాడుతున్నారు. బీజేపీ ప్రభుత్వ విధానాల్ని ఆయన తీవ్రంగా తప్పు పడుతున్నారు.ఇటీవల సంచలనంగా మారిన మైసూర్ సామూహిక అత్యాచార ఘటనపై సిద్దరామయ్య మాట్లాడుతున్న వేళలో.. ఆయన వద్దకు చప్పున వచ్చిన కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ ఆయన చెవిలో గుసగుసలాడారు. దీంతో.. సభలోని వారంతా ఈ పరిణామానికి ఆశ్చర్యానికి గురై.. ఎందుకిలా? అన్న ఆసక్తితో చూశారు. డీకే శివకుమార్ మాట విన్నంతనే సిద్ధరామయ్య.. అవునా.. అంటూ కుర్చీలో కూర్చున్నారు.

‘నా పంచె ఊడిపోయింది.. అని కర్ణాటక ఆర్ డీపీఆర్ మంత్రి ఈశ్వరప్పకు చెప్పి.. ‘నాకు కొంత టైం ఇవ్వు’ అని అడిగారు. దీంతో.. ఒక్కసారిగా సభలో నవ్వులు విరబూశాయి. అనంతరం పంచె కట్టుకున్న సిద్ధరామయ్య.. కొవిడ్ నుంచి కోలుకున్న తర్వాత తాను బరువు పెరిగానని.. పొట్ట పరిమాణం పెరగటంతో పంచె జారిపోతుందన్నారు.దీంతో ట్రెజరీ వైపు నుంచి సాయానికి ముందుకు వస్తున్న వారిని.. మీరు అవతలి వైపు ఉన్నారు.. కాబట్టి మీ సాయం నేను కోరనంటూ.. తమ ప్రత్యర్థి పార్టీ సభ్యుల సాయాన్ని సున్నితంగా రిజెక్టు చేయటం గమనార్హం.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఈ పంచె విషయం గురించి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రమేశ్ కుమార్ మాట్లాడుతూ.. మా అధ్యక్షుల వారు (డీకే శివకుమార్) పంచె ఊడిపోతున్న విషయాన్ని సిద్ధరామయ్య చెవిలో చెప్పి.. ఆయన్ను.. పార్టీ పరువును కాపాడాలనుకున్నారు. కానీ.. ఆయనేమో ఈ విషయాన్ని సభలో చెప్పేశారంటూ చమత్కరించారు. ఇప్పుడు బీజేపీ వాళ్లు మాపై విరుచుకుపడేందుకు ఎదురుచూస్తున్నారనటంతో సభలో మరోసారి నవ్వులు విరబూసాయి. ఈ పంచె ఎపిసోడ్ తో అప్పటివరకు హాట్ హాట్ గా ఉన్న అసెంబ్లీ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.