టెన్నీస్ క్లబ్ కాటేజీలు...అక్రమ సొమ్ముతో చిదంబరం లీలలు

Wed Aug 21 2019 17:24:10 GMT+0530 (IST)

Former Central Minister Chidambaram Purchased Tennis Clubs And Cottages With Illegal

కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పి. చిదంబరం మెడకు ఉచ్చు బిగుస్తోంది. చిదంబరానికి ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించడంతో.. ఆయన కనిపిస్తే అదుపులోకి తీసుకోవాలని సీబీఐ ఈడీ అధికారులు ఎదురుచూస్తున్నారు. కాగా అరెస్టు తప్పించుకునేందుకు సుప్రీంకోర్టును ఆశ్రయించిన చిదంబరానికి జలక్ తగిలింది. కోర్టు లిస్టులోకి పిటిషన్ వచ్చేంత వరకు దాని గురించి ఎటువంటి ఉత్తర్వులు ఇవ్వలేమని సుప్రీం పేర్కొంది. దీంతో అరెస్టు నుంచి చిదంబరం తప్పించుకోవడం అసాధ్యంగానే కనిపిస్తోంది. ఇదిలాఉండగా విదేశాల్లో చిదంబరం అవినీతితో భారీ ఎత్తున ఆస్తులు సమీకరించారని ఈడీ వర్గాలు అనధికారికంగా వెల్లడిస్తున్నాయి.చిదంబరం తనయుడు కార్తి చిదంబరం స్పెయిన్ లో ఓ ఖరీదైన టెన్నీస్ క్లబ్ కొనుగోలు చేశాడని యూకేలో ఖరీదైన కాటేజీని సైతం సొంతం చేసుకున్నాడని ఈడీ పేర్కొంది. రూ.54 కోట్ల విలువైన ఆస్తులను ఐఎన్ ఎక్స్ మీడియా కు చెందిన అక్రమ లావాదేవీల ద్వారానే కైవసం చేసుకున్నారని ఈడీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఐఎన్ ఎక్స్ మీడియాకు విదేశాల నుంచి వచ్చిన రూ.307 కోట్ల నిధులకు ఫారిన్ ఇన్వెస్ట్ మెంట్ ప్రమోషన్ బోర్డ్ ఇచ్చిన అనుమతుల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఇందులోనే కార్తీకి రూ.10 లక్షల ముడుపులు ముట్టినట్లు మొదట్లో ఆరోపణలు వస్తున్నాయి. ఆ తర్వాత ఆ మొత్తం రూ.6.5 కోట్లు అని చెప్పింది.

ఇదిలాఉండగా ఐఎన్ ఎక్స్ మీడియా కేసులో ఈడీ అధికారులు చిదంబరం కోసం అన్వేషిస్తున్నారు. బెయిల్ కావాలని ఢిల్లీ కోర్టును ఆశ్రయించినా.. ఆయనకు అక్కడ ఊరట దక్కలేదు. చిదంబరం పెట్టుకున్న అభ్యర్థనను జస్టిస్ ఎన్ వీ రమణ కొట్టిపారేశారు. సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబల్ బృందం న్యాయమూర్తిని ఎంత వేడుకున్నా ఆయన వినలేదు. అర్జెంట్‌గా కేసును స్వీకరించాలని సిబల్ టీమ్ కోర్టును కోరింది. కానీ ఆ అభ్యర్థనను తిరస్కరించారు. చిదంబరానికి ఊరట ఇవ్వాలని ఒకవేళ ఆయన్ను అరెస్టు చేస్తే అప్పుడు ముందస్తు బెయిల్ కోసం పెట్టుకున్న పిటిషన్ వ్యర్థమవుతుందని న్యాయవాది సిబల్ కోర్టుకు తెలిపారు. పిటిషన్ లో లోపాలు ఉన్నట్లు ఇవాళ సుప్రీం గుర్తించింది. తప్పులు లేకుండా మరోసారి పిటిషన్ వేయాలని చిదంబరానికి చెందిన న్యాయవాదుల బృందానికి కోర్టు చెప్పింది. లుకౌట్ నోటీసులు ఇవ్వడం వల్ల చిదంబరం ఇప్పుడు దేశం విడిచి వెళ్లే ప్రసక్తే లేదు.