ఆశ్చర్యం.. అనూహ్యం.. సీబీఐ మాజీ జేడీ.. పాలిటిక్స్ టు సినిమాల్లోకి..

Fri Sep 30 2022 07:00:01 GMT+0530 (India Standard Time)

Former CBI JD Lakshminarayana CBI to movies

డాక్టర్ కాబోయి యాక్టర్ అయిన వారు ఎందరో.. ప్రజా సేవ కోసం పాలిటిక్స్ లోకి వచ్చేవారు కొందరు. అయితే ప్రజలకు సేవా చేసేందుకు ఐపీఎస్ గా ఎంపికై అత్యున్నత హోదాల్లో పనిచేసిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ.. రిటైర్ మెంట్ తీసుకొని ప్రజా సేవ కోసం వచ్చారు. మొదట కొత్త పార్టీ పెట్టి.. అనంతరం జనసేనలో కలిసిపోయారు. జనసేన నుంచి బయటకొచ్చి ప్రస్తుతం ఇండిపెండెంట్ గా రాజకీయం చేస్తున్నారు.తెలుగు రాష్ట్రాల్లో మంచి పాపులారిటీ గల జేడీ లక్ష్మీనారాయణ ఇప్పుడు పాలిటిక్స్ నుంచి సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఇదే హాట్ టాపిక్ గా మారింది. ‘భీమదేవరపల్లి బ్రాంచి’ అనే సినిమాతో జేడీ లక్ష్మీనారాయణ  తెలుగు ప్రేక్షకులను పలకరించబోతున్నారు. ఏబీ సినిమాస్ నిహాల్ ప్రొడక్షన్స్ పతాకాలపై బత్తిని కీర్తిలత గౌడ్ రాజా నరేందర్ చెట్లపెల్లి నిర్మిస్తున్న సినిమా ఇదీ. ఈ సినిమాకు రమేశ్ చెప్పాల దర్శకత్వం వహించారు. ఈ మూవీలో సీబీఐ మాజీ డైరెక్టర్ లక్ష్మీ నారాయణ నటించారు. ఆయనతోపాటు రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా కీలక పాత్ర పోషించారు. ఇద్దరికీ ఇది తొలి సినిమానే కావడం విశేషం.

ఈ ఇద్దరు మేధావులు సినిమాలో నటించడానికి ఓ కారణం ఉంది. ఇదో సందేశాత్మక చిత్రం కావడం విశేషం. అందుకే సమాజానికి మంచి సందేశం పంపాలని జేడీ ప్రొ.నాగేశ్వర్ ఇద్దరూ నటించారు. ఇక ఈ సినిమాలో రాంగోపాల్ వర్మను నటించమని అడిగినా నో చెప్పాడు.

ఇటీవల జరిగిన ఒక సంఘటన రాష్ట్రవ్యాప్తంగా అందరినీ కలిచివేసింది. దాని ప్రేరణతోనే ఈ సినిమాను నీరోలిజం ఉట్టిపడేలా ‘స్లైస్ ఆఫ్ లైఫ్’ జానర్ లో ఈ సినిమా నిర్మించారు. కథలో సహజత్వం కోసమే ప్రొఫెసర్ నాగేశ్వర్ సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ సహా థియేటర్ ఆర్టిస్టులను నటింపచేశారు. వాస్తవికత కళ్లముందుంచే ఈ చిత్ర ప్రతి ఒక్కరిని కదలిస్తుందని తెలిపారు.

సందేశాత్మక చిత్రం కావడంతో ఈ సినిమాలో నటించేందుకు ఒప్పుకున్నామని.. అంతే తప్ప సినిమాల్లో నటించాలన్న ఆసక్తి లేదని జేడీ లక్ష్మీనారాయణ తెలిపారు. ఈ సినిమా సమాజానికి మార్గనిర్ధేశం చేస్తుందని వివరించాడు. మొత్తంగా సీబీఐ మాజీ జేడీ.. పాలిటిక్స్ టు సినిమాల్లోకి కూడా ఎంట్రీ ఇస్తున్నాడు. ఇంకా ఏ ఏ రంగాల్లోకి వస్తాడో వేచిచూడాలి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.