Begin typing your search above and press return to search.

మరో వైరస్ కు జన్మనిచ్చిన చైనా: భవిష్యత్ లో పొంచి ఉన్న ప్రమాదం

By:  Tupaki Desk   |   6 July 2020 12:30 AM GMT
మరో వైరస్ కు జన్మనిచ్చిన చైనా: భవిష్యత్ లో పొంచి ఉన్న ప్రమాదం
X
ఇప్పటికే ప్రపంచాన్ని వణికిస్తున్న వైరస్ పుట్టుకకు కారణమైన చైనా మరో వైరస్ కు జన్మనిచ్చింది. ప్రస్తుతం మహమ్మారి వైరస్ పై చైనాను ప్రపంచ దేశాలన్నీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఈ సమయంలోనే మరో వైరస్ ను చైనాలో గుర్తించారు. ఆ దేశంలో సరికొత్త వైరస్‌ ఒకదాన్ని శాస్త్రవేత్తలు పందుల్లో గుర్తించారు. దాని పేరు జీ4. ఇప్పటికి ఈ పేరుతో పిలుస్తున్నారు. అయితే మనుషులందరూ ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ వైరస్‌ ప్రస్తుతానికి మనుషులకు సోకే అవకాశం లేదు. భవిష్యత్తులో మాత్రం ఇది మహమ్మారిగా మారే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

పందుల్లో అటు పక్షి సంబంధ - ఇటు క్షీరద సంబంధ వైరస్‌ లు రెండూ ఉంటాయి. ఇలా రెండు రకాల వైరస్‌ లు ఒకే జంతువులో ఉన్నప్పుడు ఒకదాంట్లోని జన్యువులు ఇంకో దాంట్లోకి చేరుతుంటాయి. ఫలితంగా కొత్త రకాల వైరస్‌ లు పుడుతుంటాయి. ఇవి ఏదో ఒక దశలో జంతువుల నుంచి క్షీరదాలైన మనుషులకూ సోకే అవకాశం ఉందని పరిశోధకులు చెబుతున్నారు. చైనా వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని హోంగ్లీసన్‌ అనే శాస్త్రవేత్త ఇటీవల పందులపై జరిపిన పరిశోధనల ద్వారా జీ 4 వైరస్ ఉనికి బహిర్గతమైంది. దీంట్లో కనీసం మూడు ఇన్‌ఫ్లుయెంజా కారక వైరస్‌ ల జన్యు పదార్థం కలిసిపోయి ఉందని తెలిపారు.

యూరప్ - ఆసియా పక్షుల్లోని వైరస్‌ ఒకటి కాగా - ఎగిరే పక్షులు - మనుషులు - పందుల వైరస్‌ లు కలిగి ఉన్న నార్త్‌ అమెరికన్‌ రకం మరొకటని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ.వైరస్ పై 2011- 2018 మధ్యకాలంలో హోంగ్లీసన్‌ పది చైనా ప్రావిన్స్‌ల్లోని జంతు వధశాలల్లో నమూనాలు సేకరించారు. పందుల ముక్కుల్లోని స్రావాల నమూనాలు సేకరించి పరిశోధనలు చేశారు. ఈ క్రమంలోనే శ్వాస సంబంధ సమస్యలున్న వెయ్యి పందుల నమూనాలను కూడా విశ్లేషించారు. వీటిలో జీ 4తోపాటు కనీసం 179 ఇన్‌ ఫ్లుయెంజా కారక వైరస్‌ లు ఉన్నాయని, 2016 తరువాత సేకరించిన నమూనాల్లో ఇవి మరిన్ని ఎక్కువున్నాయని శాస్త్రవేత్త హోంగ్లీసన్‌ వివరించారు. జీ 4 ఇప్పటికే మనుషులకు సోకుతున్నా అది మహమ్మారి స్థాయిలో లేదని తెలిపారు. అయితే ఇది భవిష్యత్తులో మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని హెచ్చరిస్తున్నారు.