Begin typing your search above and press return to search.

విశాఖ సిగలో మరో కలికితురాయి.. సకల హంగులతో ఫ్లోటింగ్ రెస్టారెంట్!

By:  Tupaki Desk   |   4 Dec 2021 1:57 AM GMT
విశాఖ సిగలో మరో కలికితురాయి.. సకల హంగులతో ఫ్లోటింగ్ రెస్టారెంట్!
X
ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్ లో నెలకు ఒకసారైనా రెస్టారెంట్ కు వెళ్లాలని చాలామంది అనుకుంటారు. ఇక కొందరైతే ఏకంగా వారానికి కనీసం ఒక్కసారైనా వెళ్తారు. రొటీన్ లైఫ్ కు భిన్నంగా ఉండడం కోసం సరదాగా షికారుకు వెళ్లి... ఆపై రెస్టారెంట్లకు వెళ్లి నచ్చిన వంటకాలను టేస్ట్ చేస్తారు.

ఈ నేపథ్యంలో వివిధ స్పెషాలిటీలు ఉన్న రెస్టారెంట్లకు డిమాండ్ కాస్త ఎక్కువే ఉంటుంది. అంటే ట్రైయిన్ రెస్టారెంట్, అన్ లిమిటెడ్ ఫుడ్, ప్లెయిన్ రెస్టారెంట్ వంటివి అన్నమాట. మునుపెన్నడూ లేనివధంగా వైజాగ్ లో ఓ ప్రత్యేకమైన రెస్టారెంట్ త్వరలో అందుబాటులోకి రానుంది. సకల హంగులతో ప్రస్తుతం అది ముస్తాబవుతోంది. ఇంతకీ ఆ స్పెషలిటీ ఏంటంటే ఫ్లోటింగ్ రెస్టారెంట్.

వైజాగ్ ప్రజలు, విశాఖ టూరిస్టుల కోసం ఈ ఫ్లోటింగ్ రెస్టారెంట్ ను ఆంధ్రప్రదేశ్ టూరిజం డిపార్ట్ మెంట్ ఆధ్వర్యంలో తీర్చిదిద్దుతున్నారు. ఓ ప్రైవేటు సంస్థ చొరవ చూపి ఇందుకు శ్రీకారం చుట్టింది. పీపీపీ పద్ధతిలో ఈ ఫ్లోటింగ్ రెస్టారెంట్ ను డిజైన్ చేస్తున్నారు.

ఇంతకీ ఈ వినూత్నమైన ఆలోచన ఎలా వచ్చింది అనుకుంటున్నారా...? విశాఖలో అక్టోబర్ 2020న పెను తుపాను ధాటికి బంగ్లాదేశ్ కు చెందిన ఓ నౌక సముద్రతీరానికి కొట్టుకువచ్చింది.

ఈ నౌక పేరు ఎంవీ మా. అయితే ఈ ఓడను టూరిజం డిపార్ట్ మెంట్ టేకప్ చేసింది. నీటిపై తేలియాడుతున్న ఈ ఓడను అత్యాధునిక హంగులతో ఫ్లోటింగ్ రెస్టారెంట్ గా తయారుచేస్తున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన పనులు చకాచకా జరుగుతున్నాయి.

ఈ నౌక పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావాలంటే మరో సంవత్సరం పాటు వేచి చూడాల్సిందేనని సంస్థ ప్రతినిధులు తెలిపారు. టూరిజం పరంగా విశాఖ ఇప్పటికే చాలా అభివృద్ధి చెందింది.

ఈ తరుణంలో ఫ్లోటింగ్ రెస్టారెంట్ వైజాగ్ సిగలో మరో కలికుతురాయిగా నిలవనుంది. దేశంలో ఎక్కడాలేని విధంగా ఈ తేలియాడే రెస్టారెంట్ లో ఒకేసారి ఐదు వందల మందికి పైగా కస్టమర్లు హ్యాపీగా తినేయవచ్చు. ఈ ఓడలో వీఐపీ అతిథుల కోసం ప్రత్యేకమైన ఏసీ గదులను ఏర్పాటుచేశారు.

సముద్రం పక్కనే ఉండే ఈ రెస్టారెంట్ కు మరో ఆకర్షణగా ఓపెన్ టాప్ రూఫ్ కూడా ఉంది. సాగర తీరాన క్యాండిల్ లైట్ డిన్నర్ చేయాలనుకునేవారికి కేరాఫ్ అడ్రస్ గా నిలవనుంది. పుట్టినరోజులు, పార్టీలు వంటి ప్రత్యేకమైన డేస్ ను సెలబ్రేట్ చేసుకోవాలంటే అందుకోసం స్పెషల్ రూమ్స్ ను ఏర్పాటు చేసినట్లు సంస్థ ప్రతినిధులు వెల్లడించారు.

ఎన్నో ప్రత్యేకతలతో కూడుకున్న వైజాగ్ అంటే టూరిస్టులకు కూడా ఓ స్పెషల్ ఫీలింగ్. ఎత్తైన భవనాలు, సముద్రతీరం... చుట్టూ కొండలు వంటి ప్రకృతి అందాలను తనలో ఇనుమడింపచేసుకున్న విశాఖకు ఇదో స్పెషల్ అట్రాక్షన్ గా మారనుంది. ప్రస్తుతం ముమ్మరంగా జరుగుతున్న ఈ రెస్టారెంట్ పనులు... మరో నాలుగు నెలల్లో తుది దశకు చేరుకోనున్నాయి.

అన్ని వసతులతో పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావాలంటే దాదాపు ఏడాది కాలం పడుతుందని టూరిజం డిపార్ట్ మెంట్ అధికారులు అంచనా వేస్తున్నారు. పిల్లలు, పెద్దలు, యువత ఇలా వయసుతో సంబంధం లేకుండా అందరినీ ఈ ఫ్లోటింగ్ రెస్టారెంట్ ఆకట్టుకుంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ స్పెషల్ రెస్టారెంట్ ఏపీలోనే మొదటిది కాబట్టి... టూరిస్టులు కూడా ఒకసారైనా తేలియాడే ఓడలో కూర్చొని... హ్యాపీగా ఎంజాయ్ చేయాలని అనుకుంటారు.