Begin typing your search above and press return to search.

ఐదేళ్ల ప్రణాళిక ఫెయిల్ ... కరోనానే కారణం, కిమ్ అసంతృప్తి !

By:  Tupaki Desk   |   17 Jun 2021 12:30 AM GMT
ఐదేళ్ల ప్రణాళిక ఫెయిల్ ... కరోనానే కారణం, కిమ్ అసంతృప్తి !
X
ఈ సంవత్సరం దేశ ఆర్ధిక వ్యవస్థ మెరుగుపడిందని, కానీ కరోనా వైరస్ విజృంభణ కారణంగా , తుఫానుల కారణంగా ప్రజలు ఆహార కొరతను, ఇతర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ తెలిపారు. తాము రూపొందించిన ఐదేళ్ల ప్రణాళిక ఫెయిలయిందని, ఆయన తొలిసారి అధికారికంగా ఇలాంటి ప్రకటన చేస్తూ పలు అవరోధాల కారణంగా తమ పార్టీ అమలు చేయడానికి చేపట్టిన ప్రయత్నాలు ఓ కొలిక్కి రాలేదన్నారు.

ఈ ఏడాది మొదటి ఆరు నెలల కాలంలో ఎకానమీ మెరుగుపడిందని, గత సంవత్సరం ఇదే కాలంలో కన్నా 25 శాతం పారిశ్రామిక ఉత్పత్తి పెరిగిందని ఆయన చెప్పారు. కానీ, ఆహార కొరత తీవ్రంగా ఉంది. గత సంవత్సరం సంభవించిన తుఫాను కారణంగా పంటలు దెబ్బ తిన్నాయి. ఫలితంగా ఆహారోత్పత్తి తగ్గింది అని ఆయన అన్నారు. కరోనా పాండమిక్ అదుపునకు చర్యలు తీసుకున్నామని, ప్రకృతి వైపరీత్యాల ప్రభావాన్ని తగ్గించడానికి పటిష్టమైన కార్యాచరణ ప్రణాళిక అవసరమని కిమ్ చెప్పారు. నిరుడు సంభవించిన ఉత్పాతాల నుంచి గుణపాఠం నేర్చుకోవలసి ఉందన్నారు. తన ఇదివరకటి ఐదేళ్ల ఎకనామిక్ ప్లాన్ ప్రతి రంగంలోనూ విఫలమైందని ఆయన అంగీకరించారు.

ప్రజలకు ఆహారం, గృహ వసతి, బట్టలు మొదలైన సౌకర్యాల కల్పన కోసం తమ పార్టీ ప్రయత్నాలను ముమ్మరం చేస్తుందని ఆయన తెలిపారు. ఆర్ధిక సమస్యలను పరిష్కరించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించడానికి..ఆయా పాలసీల పురోగతిని సమీక్షించడానికి తమ సెంట్రల్ వర్కర్స్ పార్టీ నిర్వహించిన ప్లీనరీ సమావేశానికి కిమ్ అధ్యక్షత వహించారు. అటు తమ ఐదేళ్ల ఆర్ధిక ప్రణాళిక లక్ష్యాలను సాధించడానికి గత ఫిబ్రవరిలో తీసుకున్న చర్యలను అధికార వర్కర్స్ పార్టీ కమిటీ వివరించింది. దేశంలో కరోనా వైరస్ పరిస్థితిని అదుపు చేయడానికి నార్త్ కొరియా తన సమీప దేశాలతో గల సరిహద్దులను మూసివేసింది. దీనితో ఫలితంగా ఆయా దేశాల నుంచి అందాల్సిన సాయం కూడా నిలిచింది.