స్టార్లకు షాకిచ్చిన ఐదు రాష్ట్రాల ఎన్నికలు

Mon May 03 2021 09:00:02 GMT+0530 (IST)

Five state elections that shocked the stars

అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. గెలుపు ఎవరిదన్న విషయంలో అంచనాలు ఏ మాత్రం మార్పు లేకున్నా.. విజయం విషయంలో ఓటర్లు కట్టబెట్టిన వైనం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ ఎన్నికల్లో పలువరు రీల్ స్టార్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. కాస్తంత ఛరిష్మా ఉంటే చాలు నెత్తిన పెట్టుకునే తీరకు భిన్నంగా ఇటీవల కాలంలో ఓటర్లు తీర్పు ఇస్తున్న వైనానికి ఏ మాత్రం తీసిపోని రీతిలో తాజా ఫలితాలు ఉండటం గమనార్హం.మలయాళ సినిమాల్లో తిరుగులేని స్టార్ గా గుర్తింపు పొందిన సురేశ్ ప్రభు.. త్రిస్సూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగి ఓడిపోయారు. మొదట్లో అధిక్యత ప్రదర్శించినా.. చివరకు మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. విశ్వ నటుడిగా.. చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకొని సొంతంగా పార్టీ పెట్టిన కమల్ హాసన్ కు ఓటర్లు షాకిచ్చారు. కోయంబత్తూరు సౌత్ నుంచి పోటీ చేసిన ఆయన తన సమీప బీజేపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. కొంతలో కొంత ఊరట ఏమంటే.. స్వల్ప అధిక్యతతో ఓటమిపాలు కావటం.

కోలీవుడ్ లో మాత్రమే కాదు రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసి.. ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ఉన్న ఖుష్బూ.. బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగి ఓటమిపాలయ్యారు. ఎన్నికల ముందు వరకు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆమె.. ఇటీవల ఆమె బీజేపీలో చేరి.. థౌజండ్ లైట్స్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి డీఎంకే అభ్యర్థి చేతిలో ఓటమిపాలయ్యారు.

పశ్చిమబెంగాల్ విషయానికి వస్తే.. బనాకురా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అధికార టీఎంసీ నుంచి పోటీ చేసిన సినీ నటి సయంతిక బెనర్జీ ఓటమిపాలయ్యారు. మమత పార్టీ సంచలన విజయాన్ని సొంతం చేసుకున్నా.. సయంతిక మాత్రం ఓటమి పాలు కావటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. మరోనటుడు యశ్ దాస్ గుప్తా చండీతాల నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఇలా సినీనటులంతా తాము పోటీ చేసిన చోట ఓటమిపాలైతే.. అందుకు భిన్నంగా ఒకేఒక్క నటుడు మాత్రం బంపర్ విజయాన్ని సొంతం చేసుకున్నాడు.

రీల్ స్టార్లకు ఎన్నికల్లో వరుస పెట్టి దెబ్బలు తగిలినవేళ.. కాస్త ఊరట కలిగించే అంశం ఏమైనా ఉందంటే.. తమిళనాడుకు కాబోయే ముఖ్యమంత్రి.. డీఎంకే అధినేత స్టాలిన్ కుమారుడు.. సినీ హీరో ఉదయనిధి. మిగిలిన వారికి భిన్నంగా ఆయన మాత్రం ఘన విజయాన్ని సాధించారు. డీఎంకేకు కంచుకోట లాంటి చేపాక్ నియోజకవర్గం నుంచి ఏకంగా 60వేల భారీ మెజార్టీతో విజయం సాధించారు. సినీ ఇమేజ్ కంటే కూడా.. స్టాలిన్ కొడుకుగానే ఆయన విజయాన్ని పరిగణలోకి తీసుకోవాలి.