ట్రంప్ పర్యటన కోసం కొండముచ్చుల్ని తెప్పించారు!

Sun Feb 23 2020 22:35:53 GMT+0530 (IST)

Five Langurs Deployed to Keep Away Monkeys During Donald Trump Tour

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆశ్చర్యకర చర్యలు చేపడుతోంది. మొన్న గుజరాత్ లోని అహ్మదాబాద్ లో మురికివాడలకు ముసుగేస్తూ గోడ కట్టడం ఎంత చర్చనీయాంశమైందో తెలిసిందే. ఇప్పుడు ఢిల్లీలో తాజ్ మహల్ సందర్శన సందర్భంగా ట్రంప్ అండ్ కోకు ఇబ్బంది రాకుండా కొండముచ్చుల్ని రంగంలోకి దించుతుండటం విశేషం. కొండముచ్చులతో ఇబ్బంది ఉంటుంది కానీ.. ఇబ్బందుల్ని తొలగించడానికి కొండముచ్చుల్ని రప్పించడం ఏంటని సందేహాలు కలగడం సహజం. కానీ ఇక్కడే ఉంది మతలబు. తాజ్ మహల్ దగ్గర కోతుల బెడద తగ్గించడం కోసమే ఈ కొండముచ్చుల ఏర్పాటన్నమాట.కొన్ని నెలలుగా తాజ్ మహల్ ప్రాంగణంలో కోతుల బెడద ఎక్కువైపోయింది. తాజ్ మహల్ ను చూడటానికి వచ్చిన వారి చేతుల్లోని వస్తువులను కోతులు లాక్కెళుతున్నాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ పర్యటనకు కోతుల వల్ల ఇబ్బంది తలెత్తే అవకాశం ఉందని భావించిన అధికారులు ఐదు కొండముచ్చులను తాజ్ మహాల్ సమీపంలోకి తీసుకొచ్చి పెట్టారు. కొండముచ్చులను చూసి కోతులు భయపడతాయి. అవి ఉన్న సమీపానికి కోతులు రాలేవు. అందుకే అధికారులు కొండముచ్చులను రంగంలోకి దించారు. అంటే సెక్యూరిటీ సిబ్బంది మాత్రమే కాదు.. కొండముచ్చులు కూడా అమెరికా అధ్యక్షుడికి రక్షణగా నిలవబోతున్నాయన్నమాట. ట్రంప్ పర్యటన విషయానికొస్తే.. ఆయన సోమవారం ఇండియాకు రానున్నారు. ఆ రోజు ముందు గుజరాత్ లో పర్యటించి ఆ తర్వాత ఢిల్లీకి వస్తారు.పర్యటన రెండు రోజుల పాటు సాగుతుంది.