ఫస్ట్ నామినేషన్ శశిధరూర్ దే.... పోటీకి సీరియస్ గానే...?

Sat Sep 24 2022 20:34:41 GMT+0530 (India Standard Time)

First nomination shashi tharoor

కాంగ్రెస్ పార్టీలో చాన్నాళ్ళ తరువాత అధ్యక్ష ఎన్నికలకు తెర లేచింది. ఇప్పటికి ఇరవై అయిదేళ్ళ  ముందు ఎన్నికలు జరిగాయి. అప్పట్లో కాంగ్రెస్ లో ఉన్న శరద్ పవార్ పోటీ చేశారు. ఆయనకు ఏపీలో వైఎస్సార్ సాయం చేశారు. ఇక సీతారాం కేసరి నాడు అధ్యక్షుడు అయ్యారు. ఇక ఇపుడు చూస్తే గాంధీ కుటుంబం కాని వ్యక్తి మరోసారి కాంగ్రెస్ ప్రెసిడెంట్ కాబోతున్నారు.ఎన్నికల్లో  ఎవరైనా పోటీ చేయవచ్చు అని చెబుతున్నా ఆ సాహసానికి కొందరు మాత్రమే సిద్ధమవుతున్నారు. కేంద్ర మాజీ మంత్రి ఎంపీ శశిధరూర్ కాంగ్రెస్ అధ్యక్ష పదవి రేసులో ఉన్నారు. ఆయన ఈ రోజు తన నామినేషన్ పత్రాలను తీసుకున్నారు. దీంతో కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలను ప్రకటించాక ఎన్నికల తతంగం మొదలయ్యాక నామినేషన్ తీసుకున్న తొలి వ్యక్తి గా శశిధరూర్ ఉన్నారు.

ఆయన కాంగ్రెస్ అధినాయకత్వం వైఖరిలో మార్పు రావాలని కోరుకున్న వారే. ఒక విధంగా గ్రూప్ 23 భావాలతో ఆయన కూడా ఏకీభవిస్తూ వస్తున్నారు. కాంగ్రెస్ వారసత్వ పోకడలను పక్కన పెట్టి జవసత్వాలతో ఎదగాలని ప్రజాస్వామిక పోకడలు ఉండాలని ఆయన కోరుకుంటూ వచ్చారు.

దాంతో ఆయన అధ్యక్ష ఎన్నికలు పారదర్శకంగా జరగాలని కూడా కోరారు. ఇక ఆయన తాను పోటీ చేస్తాను అని చాలా రోజుల క్రితమే ప్రకటించారు. ఆ మీదట ఆయన కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని కలవడం ఆమె కూడా ఆయన పోటీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమూ చకచకా జరిగిపోయాయి. ఈ నేపధ్యంలో శశిధరూర్ రంగంలోకి దూకారు.

ఆయన పోటీ సీరియస్ గానే ఉంటుందా లేక పోటీ చేస్తున్నాను అన్న ఫీలింగ్ తోనే ముగిస్తారా అన్నది చూడాలి. ఇదిలా ఉంటే గాంధీల తరఫున రాజస్థాన్  సీఎం అశోక్ గెహ్లాట్ అభ్యర్ధిగా ఉంటారని ఆయనకే వారి మద్దతు అని ప్రచారం ఉంది. మరి కాంగ్రెస్ లో రాహుల్ సోనియా గాంధీల మనసెరిగి క్యాడర్ అయినా లీడర్ అయినా వ్యవరిస్తారు అన్నది తెలిసిందే.

ఈ క్రమంలో రెబెల్ గా  ఉంటూ తన భావాలను ఎప్పటికపుడు మీడియా ముఖంగా బయటపెట్టుకుంటున్నా శశిధరూర్ పోటీ చేస్తున్నారు. ఆయన విజయావకాశాలు ఎలా ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ లో మార్పు ఆయన కోరుకుంటున్నారు. ఏ మార్పు రాదని భావించి గులాం నబీ ఆజాద్ పార్టీకి రాజీనామా చేసి వెళ్ళిపోయారు.

ఇంకో వైపు గాంధీల మద్దతు వారి దన్నూ లేకుండా అధ్యక్షుడు ఎవరూ పార్టీ బండిని ముందుకు లాగలేరని కూడా అందరికీ తెలుసు. దాంతో అశోక్ గెహ్లాట్ కే గెలుపు అవకాశాలు ఉంటాయన్నది నిజం. మరి దాన్ని బ్రేక్ చేసి శశిధరూర్ ఏమైనా సంచలనం క్రియేట్ చేస్తారా అన్నది చూడాలి. లేకపోతే ఏదో పోటీ చేశాను అన్న సరదాను ఆయన తీర్చుకున్నట్లుగానే చూడాల్సి ఉంటుంది అని అంటున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.