Begin typing your search above and press return to search.

బహిరంగ విమర్శలు టీఆర్ఎస్ మీద.. టార్గెట్ మాత్రం బీజేపీ

By:  Tupaki Desk   |   20 July 2021 5:08 AM GMT
బహిరంగ విమర్శలు టీఆర్ఎస్ మీద.. టార్గెట్ మాత్రం బీజేపీ
X
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కమ్ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ఏ మాత్రం తీసిపోని మాటలు.. తెలంగాణ రాష్ట్రంలో అతి కొద్ది మంది నేతలకు మాత్రమే ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ తో పాటు..వ్యూహాలకు ఏ మాత్రం కొదవ లేకుండా వ్యవహరించటం.. అవసరమైతే డబ్బు ఖర్చు చేయటానికి వెనుకాడని మైండ్ సెట్ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ రథసారధి రేవంత్ రెడ్డి సొంతమని చెబుతారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి కోసం ఎంతగానో ప్రయత్నించిన ఆయన.. ఎట్టకేలకు అధిష్ఠానం చేత ఓకే చేయించుకోవటంలో సక్సెస్ అయ్యారు.

పదవిని పార్టీ కట్టబెట్టినంతనే ఏ మాత్రం ఆలస్యం చేయని ఆయన.. పార్టీలో కొత్త ఉత్సాహం పొంగిపొర్లేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అదే సమయంలో.. తెలంగాణ అధికారపక్షంగా పెద్ద ఎత్తున విరుచుకుపడుతున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. కంటికి కనిపించేది ఒకటైతే.. అందుకు ఏ మాత్రం సంబంధం లేని మైండ్ గేమ్ తో ఒకేసారి తన ఇద్దరు ప్రత్యర్థుల్ని ఇరుకున పెట్టేసేలా వ్యవహరిస్తూ హాట్ టాపిక్ గా మారారు రేవంత్ రెడ్డి. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి హోదాలో ప్రజా వ్యతిరేక ప్రభుత్వ విధానాలపై గళం విప్పిన ఆయన.. ఆందోళనలు.. నిరసనలతో అదే పనిగా ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విరుచుకుపడుతున్నారు.

మరోవైపు.. చెల్లాచెదురైన పార్టీని ఒక కొలిక్కి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అందరిని కలుపుకుపోతానని మాటలు చెప్పటమే కానీ చేతల్లో చేసి చూపించని తీరుకు భిన్నంగా వ్యవహరిస్తూ.. పార్టీకి చెందిన సీనియర్ నేతల్ని ఒకరి తర్వాత ఒకరిని కలుస్తూ.. వారి మనసుల్ని దోచుకునే ప్రోగ్రాంను చేపట్టారు. మరోవైపు.. పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన నాయకుల్ని పార్టీలోకి తీసుకొచ్చే పనిని సైతం ఆయన మొదలు పెట్టారు.

గడిచిన కొంతకాలంగా తెలంగాణలో అధికార టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా ఉండే కాంగ్రెస్ స్థానాన్ని బీజేపీ సొంతం చేసుకోవటం తెలిసిందే. దీంతో.. కాంగ్రెస్ లో ఉండలేక.. పలువురు నేతలు బీజేపీ కండువా కప్పుకున్నారు. వెళ్లిపోయిన వారి సంగతి ఇలా ఉంటే.. ఉన్న వారితో పాటు.. మరికొందరు బలమైన నేపథ్యం ఉన్న నేతలు బీజేపీ వైపు చూస్తూ.. లెక్కలు వేసుకుంటున్న వారిని గుర్తించి.. వారిని కలుస్తున్న రేవంత్.. కాంగ్రెస్ లోకి సాదరంగా ఆహ్వానిస్తున్నారు.

ఇదంతా చూస్తున్నప్పుడు రేవంత్ లో పక్కా ప్లానింగ్ కొట్టొచ్చినట్లుగా కనిపించక మానదు. ఏకకాలంలోనే ఓవైపు పార్టీని బలోపేతం చేసుకోవటంతో పాటు.. బలమైన ప్రత్యర్థిని దెబ్బ తీయటం.. మరో ప్రత్యర్థిని అట్టే హడావుడి చేయకుండా బలహీనపరిచేలా వ్యవహరిస్తున్నారు. బయటకు తిట్టేది టీఆర్ఎస్ ను అన్నట్లు కనిపించినప్పటినీ..తరచి చూస్తే మాత్రం రేవంత్ తొలి టార్గెట్ గులాబీ పార్టీ కంటే కూడా కమలం పార్టీనే అని చెబుతున్నారు.

గడిచిన కొంతకాలంగా తెలంగాణలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాం అంటే.. బీజేపీ మాత్రమే కనిపించే పరిస్థితి. ఇప్పుడా మాటను మార్చటమే పనిగా రేవంత్ పెట్టుకున్నట్లుగా ఆయన సన్నిహితులు విశ్లేషిస్తున్నారు. మొత్తంగా చూస్తే.. కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో బలోపేతం చేసేందుకు రేవంత్ చేస్తున్న ప్రయత్నాలు అన్ని ఇన్ని కావు. మరెలాంటి ఫలితం వస్తుందన్నది కాలమే డిసైడ్ చేయాలి.