Begin typing your search above and press return to search.

ఫైర్ బ్రాండ్ డేంజరస్ గేమ్

By:  Tupaki Desk   |   29 Nov 2021 8:30 AM GMT
ఫైర్ బ్రాండ్ డేంజరస్ గేమ్
X
జాతీయస్ధాయిలో కాంగ్రెస్ ను దెబ్బకొట్టి ఆ స్ధానంలోకి తాను రావాలని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ డిసైడ్ అయినట్లే ఉంది. జాతీయస్ధాయిలో కాంగ్రెస్ పట్టు పెంచుకోలేకపోతుండటం, రాష్ట్రాల్లో కూడా ఇబ్బందులు పడుతుండటం కారణాన్ని చూపించి జాతీయస్ధాయిలో ఎన్డీయేయేతర కూటమికి తాను నాయకత్వం వహించాలని మమత అనుకున్నట్లున్నారు.

మమత తాజా నిర్ణయానికి బహుశా మమత తాజా ఆలోచనలకు రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (పీకే) ప్రోద్బలం కూడా కారణమై ఉండవచ్చు. తాజాగా కాంగ్రెస్ లోని సీనియర్లలో వీలైనంతమందిని తన పార్టీలోకి చేర్చుకునేందుకు మమత వ్యూహం రచించారు. ఇందులో భాగంగానే ఢిల్లీ, గోవా, మణిపూర్ లాంటి రాష్ట్రాల్లో సీనియర్లను, ఎంఎల్ఏలను చేర్చేసుకుంటున్నారు. మొన్ననే మణిపూర్ కాంగ్రెస్ లోని 17 మంది ఎంఎల్ఏల్లో 12 మంది తృణమూల్లో చేరిన విషయం అందరికీ తెలిసిందే.

నిజానికి మమత ఇపుడు మొదలుపెట్టిన గేమ్ చాలా డేంజరస్ అనే చెప్పాలి. ఎందుకంటే ఎన్డీయేని దెబ్బ కొట్టాలంటే కచ్చితంగా ప్రతిపక్షాలు ఐకమత్యంగానే ఉండాలి. అసెంబ్లీ ఎన్నికలు+పార్లమెంటు ఎన్నికల్లో ఎన్డీయేని వ్యతిరేకిస్తున్న పార్టీల్లో ఎంత సర్దుబాటు జరిగితే అంతమంచింది. అయితే వివిధ రాష్ట్రాల్లో కాంగ్రెస్ తో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా జతకట్టడానికి ప్రాంతీయపార్టీల్లో చాలావరకు ఇష్టపడటంలేదు. అందుకని కనీసం లోక్ సభ ఎన్నికల్లో అయినా సఖ్యతగా ఉండాల్సిన అవసరం ఉంది.

మొన్నటి ఎన్నికల్లో బీజేపీని గట్టిదెబ్బ కొట్టి మూడోసారి సీఎం అయిన తర్వాత మమత ఆలోచనల్లో మార్పు స్పష్టమైంది. జాతీయ రాజకీయాల్లో బాగా దూకుడుపెంచారు. ఒకవైపు మోడిని తీవ్రంగా వ్యతిరేకిస్తునే మరోవైపు కాంగ్రెస్ ను దెబ్బకొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ ను దెబ్బకొట్టడమంటే ప్రతిపక్షాలను బలహీనం చేయటమే అని మమత గుర్తించటంలేదు.

ఎందుకంటే ఎన్డీయేతర పార్టీల్లో ప్రధానంగా కాంగ్రెస్ ను మమత ఎంత బలహీనం చేస్తే అది బీజేపీకి అంత మేలు చేస్తుందనటంలో సందేహమే లేదు. గడచిన ఏడేళ్ళల్లో ఎన్డీయేకి వ్యతిరేకంగా కాంగ్రెస్ చేసిందేమీ లేదు కాబట్టే ఆ బాధ్యతను తాను తీసుకుంటానని మమత చెబుతున్నారు. అయితే ఎన్డీయేయేతర పార్టీలను ఏకతాటిపైకి తీసుకొచ్చేది కాంగ్రెస్ మాత్రమే అని మమత మరిచిపోయారు. ఎందుకంటే మమత టెంపర్మెంట్ తెలిసిన ఏ పార్టీ కూడా ఎక్కువరోజులు ఆమెతో కలిసుండలేరు. ఏదేమైనా ఇపుడు మమత ఆడుతున్నది మాత్రం డేంజరస్ గేమ్ అని తొందరలోనే తెలుస్తుంది.