Begin typing your search above and press return to search.

షర్మిల బోనంలో ఈ ప్రత్యేకతల్ని గమనించారా?

By:  Tupaki Desk   |   1 Aug 2021 5:30 PM GMT
షర్మిల బోనంలో ఈ ప్రత్యేకతల్ని గమనించారా?
X
అనూహ్య రీతిలో తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన వైఎస్ షర్మిల.. పార్టీని ఏర్పాటు చేయటం.. అధికార పార్టీపై తరచూ నిప్పులు చెరగటం లాంటివి చేస్తున్న సంగతి తెలిసిందే. తాను ఎంతలా విమర్శలు సంధిస్తున్నా.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నుంచి కానీ.. ఆయన కుటుంబం నుంచి కానీ ఒక్క మాట అంటే ఒక్క మాట కూడా రాని పరిస్థితి. ఆమె పార్టీని ఏర్పాటు చేసిన నాటి నుంచి ఆమె స్థానికత పెద్ద చర్చగా మారుతోంది. ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చే క్రమంలో తెలంగాణ కల్చర్ మీదా.. ఇక్కడి ఆచార వ్యవహారాల మీదా.. సంప్రదాయాల మీద తనకున్న పట్టును చెప్పే ప్రయత్నం చేయటం తెలిసిందే.

ఈ రోజు హైదరాబాద్ మహానగరం బోనాల పండుగతో కళకళలాడుతోంది. పలు దేవాలయాలు కిక్కిరిసిపోతున్నాయి. ఓవైపు స్నేహితుల దినోత్సవం..మరోవైపు బోనాలు కావటంతో డబుల్ థమాకా మాదిరి మారింది.గత ఏడాది కరోనా.. లాక్ డౌన్ తో పండుగ అన్నది లేకుండా పోవటం.. ఈసారి కరోనా భయం ఉన్నా.. ముఖానికి మాస్కు పెట్టేసుకొని ఉత్సాహంగా పాల్గొంటున్న వైనం పలుచోట్ల కనిపిస్తోంది.

బోనాల మహోత్సవంలో ఉత్సాహంగా పాల్గొన్నారు షర్మిల. తన చిన్ననాటి స్నేహితురాలు రజని నివాసానికి వెళ్లిన ఆమె వారి కుటుంబ సభ్యులతో కలిసి బోనాల ఉత్సవాల్లో పాల్గొన్నారు. తాను స్వయంగా బోనం ఎత్తుకోవటంతో పాటు.. పలువురికి బోనాలు ఎత్తించారు. అమ్మవారికి బోనం సమర్పించారు. ఇందుకోసం ఆమె.. మొయినాబాద్ మండలంలోని పెద్ద మంగళారం గ్రామానికి వెళ్లారు.

ఈ బోనాలకు ఒక ప్రత్యేకత ఉంది. ఈ రోజు స్నేహితుల దినోత్సవం కావటంతో.. రెండు కలిసి వచ్చేలా తన స్నేహితురాలి ఇంటికి షర్మిల వెళ్లారు. దీంతో.. అమ్మవారి మీద తనకున్న భక్తి శ్రద్దల్ని ప్రదర్శించటంతో పాటు.. స్నేహానికి తాను ఇచ్చే ప్రాధాన్యత ఎంతన్న విషయాన్ని చెప్పారు. ఇదిలా ఉంటే.. బోనాల ఉత్సవం సందర్భంగా ఒక ట్వీట్ చేశారు షర్మిల.

''అచ్చమైన తెలంగాణ సంస్కృతికి స్వచ్ఛమైన రూపం బోనాల పండుగ. భ‌క్తి శ్రద్ధల‌తో ఆడపడుచులు ఎత్తే బోనం నా ప్రజ‌ల‌కు స‌క‌ల శుభాల‌ను తెచ్చిపెట్టాలి. ప్రజ‌లంద‌రికీ బోనాల పండుగ శుభాకాంక్షలు'' అని తన ఖాతాలో ట్వీట్ చేశారు. తన స్నేహితురాలి ఇంటికి వెళ్లి బోనం ఎత్తిన షర్మిల.. ఆమె పార్టీ కార్యాలయంలో మాత్రం.. పార్టీ మహిళా నేత ఇందిరా శోభన్ బోనం ఎత్తటం విశేషం. మొత్తంగా బోనం ఎత్తటం.. ఈ ఉత్సవంలో ఉత్సాహంగా పాలు పంచుకోవటం ద్వారా.. తనను విమర్శించే వారికి తగురీతిలో సమాధానం ఇచ్చారన్న మాట వినిపిస్తోంది.