13 ఏళ్ల కన్నకూతురుపై తండ్రి దారుణం: 10 నెలలుగా పదే పదే అత్యాచారం

Sat Aug 06 2022 08:00:01 GMT+0530 (IST)

Father brutalizes 13 year old daughter Repeated rape for 10 months

అమానుషానికే అమానుషం.. అనదగ్గ ఘటన ఇది. ఏ తండ్రీ వినేందుకు.. సైతం ఇష్టపడని దారుణం ఇది! తమిళనాడులోని వెల్లూరులో చోటు చేసుకున్న ఈ ఘటన సభ్యసమాజాన్ని సిగ్గుపడేలో చేస్తోంది. తను కని.. పెంచిన తన ఇంటి మహాలక్ష్మిని అపురూపంగా చూసుకోవాల్సిన గారాల పట్టి పట్ల.. ఆ కన్న తండ్రి.. అమానుషంగా ప్రవర్తించాడు.ముక్కుపచ్చలారని వయసులో ఆ బాలికపై అత్యాచారానికి ఒడిగట్టి.. ఏకంగా గర్భవతిని చేశాడు. ఈ సమాజంలో అంతో ఇంతో మానవత్వం ఉందనుకుంటున్న పరిస్థితిని తలకిందులు చేస్తూ.. ఆ తండ్రి వ్యవహరించిన తీరును ప్రతి ఒక్కరూ ఖండిస్తున్నారు. ప్రస్తుతం ఆ కర్కశ.. కీచక .. తండ్రి కటకటాల పాలయ్యాడు.

విషయం ఇదీ.. తమిళనాడులోని వెల్లూరు జిల్లాలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న బాలిక(13) కడుపునొప్పితో బాధపడుతున్నట్టు తెలిపింది. దీంతో ఆమె బంధువుల.. వెల్లూరు ప్రభుత్వ వైద్య శాలకు బాలికను తరలించారు. అక్కడ పరీక్షలు చేసిన వైద్యులు.. ఆమె గర్భవతి అని తేల్చి చెప్పారు. అంతేకాదు.. ఆ బాలిక మంగళవారం ఓ శిశువుకు జన్మనిచ్చింది. దీంతో వైద్య శాల సిబ్బంది వెల్లూరులోని మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులకు సమాచారం అందించారు. వారు.. స్థానిక మహిళా పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీనిపై స్థానిక పోలీసులు విచారణ చేపట్టారు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఆ బాలికపై కన్నతండ్రి పదే పదే అత్యాచారం చేసినట్టు గుర్తించారు. గడిచిన పది మాసాలుగా ఆ బాలికపై తండ్రి అత్యాచారం చేసినట్టు తెలిసి అధికారులు సైతం ఆశ్చర్య పోయారు. వాస్తవానికి ఈ బాలిక తల్లి దండ్రులు కొన్నాళ్ల కిందటే విడిపోయారు. దీంతో ఈ బాలిక తన సోదరుడితో కలిసి.. అమ్మమ్మ దగ్గర పెరుగుతోంది. అయితే.. తన అమ్మమ్మ ఇంటి నుంచి ప్రతి రోజూ.. ఈ బాలిక.. తన తండ్రికి క్యారేజీ తీసుకుని వెళ్లేది.

ఈ క్రమంలో ఒక రోజు.. ఆ తండ్రి.. తన కన్నకూతురు.. అనే విచక్షణను కూడా మరిచిపోయి.. బాలికపై అత్యాచారం చేశాడు. అంతేకాదు.. పదే పదే అదే పనిచేశాడు. అంతేకాదు.. ఈ విషయం ఎవరికైనా చెబితే.. పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించాడు. దీనిపై విచారణ పూర్తి చేసిన మహిళా పోలీసులు.. సదరు మృగాడిపై పోక్సో చట్టం ఐపీసీల కింద కేసు నమోదు చేశారు. అనంతరం అతనిని అరెస్టు చేసి.. జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు. దీంతో అతనిని జైలుకు పంపుతూ.. మేజిస్ట్రేట్ తీర్పు చెప్పారు.