దేశవ్యాప్తంగా రైతుఉద్యమం.. దక్షిణాదిలో తికాయత్ యాత్ర!

Sun Feb 28 2021 21:00:01 GMT+0530 (IST)

Farmers' movement across the country Tikayath Yatra in the South!

నరేంద్ర మోడీ ప్రభుత్వం తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని గడిచిన 95 రోజులుగా ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన కొనసాగిస్తున్నారు రైతులు. అయినప్పటికీ.. కేంద్ర ప్రభుత్వం తన పంతం వదిలిపెట్టట్లేదు. ఇప్పటికే ఎంతో మంది రైతులు ప్రాణాలు కోల్పోయారు. అయినప్పటికీ.. దిగిరావట్లేదు. ఇటు రైతులు సైతం.. పట్టుసడలించట్లేదు. చట్టాలను రద్దు చేసే వరకూ ఉద్యమాన్ని విరమించబోమని తేల్చి చెబుతున్నారు.అంతేకాదు.. ఇప్పుడు రైతు ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా చేయాలని  సంఘాల నేతలు తమ ఉద్యమాన్ని మరింత విస్తృతం చేయబోతోన్నారు. ఇందులో భాగంగా దక్షిణాదిలో పర్యటించాలని నిర్ణయించారు. ఈ క్రమంలో భారతీయ కిసాన్ యూనియన్ నాయకుడు రాకేష్ తికాయత్ మార్చి 1నుంచి తన పర్యటన ప్రారంభించనున్నారు. తెలంగాణ కర్ణాటక మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఉత్తరాఖండ్‌లలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ఆయన వెంట ధర్మేంద్ర మలిక్ యుద్ధ్‌వీర్ సింగ్ వంటి నేతలు ఉండనున్నట్టు తెలుస్తోంది.

ఈ మేరకు తెలంగాణలో మార్చి 6వ తేదీన తికాయత్ యాత్ర ఉంటుందని బీకేయూ మీడియా ఇన్‌ఛార్జ్ ధర్మేంద్ర మాలిక్ తెలిపారు. ఈ పర్యటన సందర్భంగా తికాయత్ 'కిసాన్ మహా పంచాయత్' నిర్వహిస్తారని ఆయన తెలిపారు. రాజస్థాన్‌లో రెండు మధ్యప్రదేశ్‌లో మూడు కిసాన్ మహా పంచాయత్‌లను నిర్వహిస్తామని చెప్పారు.

కాగా.. వచ్చేనెల 22వ తేదీన కర్ణాటకలో ఈ సభ నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ధారించినట్లు ధర్మేంద్ర చెప్పారు. ఆయా రాష్ట్రాల రైతులు తమ ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని కోరుతామన్నారు. బీజేపీయేతర రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహకారాన్ని ఈ సందర్భంగా తాము కోరుతామని చెప్పారు. వారిని కలవడానికి అపాయింట్‌మెంట్ కోసం ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ఈ ఉద్యమాన్ని మిగిలిన రాష్ట్రాల్లోనూ కొనసాగిస్తామన్నారు. అయితే.. దక్షిణాదిన తమిళనాడు కేరళలో రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించబోతోన్నందున అక్కడ పర్యటించట్లేదని చెప్పారు. మరి వీరి పర్యటన నేపథ్యంలో రైతు ఉద్యమం ఏ మలుపు తీసుకుంటుందో చూడాలి.