Begin typing your search above and press return to search.

రిపబ్లిక్ డే షాక్ ఎంతో ముంబయిలో శాంపిల్ చూపిస్తారా?

By:  Tupaki Desk   |   25 Jan 2021 5:15 AM GMT
రిపబ్లిక్ డే షాక్ ఎంతో ముంబయిలో శాంపిల్ చూపిస్తారా?
X
తెగే దాకా ఏ విషయాన్ని లాగకూడదంటారు. విషయాన్ని అదే పనిగా నాన్చటం వల్ల కలిగే ప్రయోజనం కంటే కూడా నష్టమే ఎక్కువన్న మాట తరచూ వినిపిస్తూ ఉంటుంది. ఈ విషయాన్నికేంద్రంలోని మోడీ సర్కారు ఎందుకు గుర్తించటం లేదు. ఎన్డీయే సర్కారు తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాల్ని రైతులు తీవ్రంగా వ్యతిరేకించటం.. వాటిని వెనక్కి తీసుకెళ్లాలన్న ఏకైక ఏజెండాతో ఢిల్లీ శివారులో పెద్ద ఎత్తున నిరసనను.. ఆందోళనను చేపట్టారు రైతులు. రోజులు కాస్తా.. వారాలుగా మారి.. ఇప్పుడు నెలలుగా మారిపోయిన వేళ.. కేంద్రంతో అమీతుమీకి సిద్ధమవుతున్నారు.

ఇందులో భాగంగా భారత గణతంత్ర దినోత్సవమైన జనవరి 26న దేశ రాజధాని ఢిల్లీలో వేలాది ట్రాక్టర్లతో భారీ ర్యాలీని నిర్వహించాలని భావిస్తున్నారు. దీనికి రోడు ముందు.. దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో రైతులు తమ నిరసన స్థాయిని శాంపిల్ గా చూపించనున్నారు. కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావటమే లక్ష్యంగా తాజా ర్యాలీ.. సభ జరుగుతుందని చెబుతున్నారు.

ఇందులో పాల్గొనటం కోసం నాసిక్ నుంచి ముంబయికి భారీ ఎత్తున రైతులు దండుగా కదిలి వస్తున్నారు. మంగళవారం ఢిల్లీలో నిర్వహించే భారీ ర్యాలీకి ముందస్తుగా.. ముంబయిలో శాంపిల్ చూపించనున్నారు. ఇదంతా చూస్తే.. వ్యవసాయ చట్టాల విషయంలో రైతుల డిమాండ్లను పూర్తి చేసే విషయంలో మోడీ సర్కారు అనుసరిస్తున్న విధానం.. ఆయన ప్రభుత్వానికి తీరని నష్టాన్ని కలిగించే ప్రమాదం పొంచి ఉందంటున్నారు. మోడీ లాంటి డైనమిక్ ప్రధాని ఉన్న వేళలోనూ.. ప్రభుత్వం ఇంత మొండిగా వ్యవహరించకుండా ఉంటే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.