రైతుల ఆందోళన .. ఆలోచనలో పడ్డ కేంద్రం సవరణలకు సిద్ధం !

Sat Dec 05 2020 14:14:10 GMT+0530 (IST)

Farmers Protest At delhi Border

కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకు వచ్చిన 3 నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఆందోళన కొనసాగుతోంది. ఈ చట్టాలను అడ్డుపెట్టుకుని కార్పొరేట్ సంస్థలు వ్యవసాయంపై గుత్తాధిపత్యం సాధిస్తాయని అప్పుడు తాము దోపిడికి గురవుతామని రైతుల భయంతో ఆ చట్టాలని వెనక్కి తీసుకోవాలని ఆందోళన చేస్తున్నాయి. ప్రస్తుతం వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేయడంలో ప్రభుత్వం ప్రధాన పాత్ర పోషిస్తోంది. వాస్తవానికి 23 రకాల వ్యవసాయ ఉత్పత్తులను ప్రభుత్వం కొనాల్సి ఉన్నా ప్రస్తుతానికి వరి గోధుములను మాత్రమే ఎక్కువగా కొంటోంది కేంద్ర ప్రభుత్వం.కేంద్రం తో ఇప్పటికే రైతులు రెండుసార్లు చర్చలు జరిపారు. కేంద్రమంత్రులు నరేంద్రసింగ్ తోమర్ పీయూష్ గోయల్  రైతులతో సంప్రదింపులు జరపగా ఆ చర్చలు ఓ  కొలిక్కిరాలేదు. ఆ సమావేశాల్లో కొత్త చట్టాలపై వివరణ ఇచ్చింది. అయితే ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలను రైతులు తిరస్కరించడంతో ఆ సంప్రదింపులు ఫలించలేదు.దీంతో ఈసారి ప్రధానమంత్రి నరేంద్రమోదీ రంగంలోకి దిగినట్లు కన్పిస్తోంది. మరికొద్ది గంటల్లో రైతులతో కేంద్రం మూడో విడత చర్చలు జరపనుండగా.. తాజాగా ప్రధాని మోదీ కీలక భేటీ నిర్వహించారు. ఈ ఉదయం కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ హోంమంత్రి అమిత్ షా వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ తో ప్రధాని సమావేశమయ్యారు. తాజా పరిస్థితులు తదుపరి కార్యాచరణపై చర్చించారు.

ఈ భేటీలో రైతులు వ్యతిరేకిస్తున్న కొత్త వ్యవసాయ చట్టాల్లో సవరణలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సంకేతాలు ఇచ్చింది. ప్రధాని నివాసం లో జరిగిన భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక మరికొద్ది సేపట్లో రైతులతో సమావేశం ఉండటం తో ఈ ప్రతిపాదనను కేంద్రం రైతుల ముందు ఉంచాలని భావిస్తుంది. దిల్లీ సరిహద్దుల్లో రైతులు ఆందోళన చేపట్టిన తర్వాత కేంద్రం చర్చలు జరపడం ఇది మూడోసారి.  దీనిపై రైతులు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.  తమ డిమాండ్లు నెరవేరకపోతే ఈ నెల 8న భారత్ బంద్ చేపట్టాలని రైతులు ఇప్పటికే నిర్ణయించారు.