Begin typing your search above and press return to search.

‘రైతుల చలో ఢిల్లీ’ తీవ్ర ఉద్రిక్తత.. అట్టుడుకుతున్న ఉత్తరాది

By:  Tupaki Desk   |   26 Nov 2020 8:50 AM GMT
‘రైతుల చలో ఢిల్లీ’ తీవ్ర ఉద్రిక్తత.. అట్టుడుకుతున్న ఉత్తరాది
X
కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు చేపట్టిన ‘చలో దిల్లీ’ కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. కరోనా విజృంభణ నేపథ్యంలో ఈ ఆందోళనకు ఢిల్లీ ప్రభుత్వం అనుమతి నిరాకరించినా రైతులు కదం తొక్కారు. దీంతో ఢిల్లీ సరిహద్దుల్లో పంజాబ్, హరియాణా రైతులను సాయుధ బలగాలు అడ్డుకున్నాయి. శంభు నదిపై పాటియాలా-అంబాలా జాతీయ రహదారి వద్ద రైతులను సైన్యం నిలువరించింది.

దీంతో ఆగ్రహించిన అన్నదాతలు భద్రతా సిబ్బంది అడ్డుగా పెట్టిన బారికేడ్లను వంతెనపై నుంచి నదిలోకి విసిరేశారు. పోలీసులపైకి ఇటుకలు, రాళ్లు విసిరి, బలవంతంగా రాజధానిలోకి ప్రవేశించడానికి ప్రయత్నించారు. దీంతో రైతులను చెదరగొట్టేందుకు పోలీసులు బాష్ప వాయువు, వాటర్ క్యానన్లు ప్రయోగించారు. ఢిల్లీ సరిహద్దుల్లోని శంభు నది వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

పంజాబ్ నుంచి వచ్చే రైతులను హరియాణా సరిహద్దుల వద్ద భారీగా సాయుధ బలగాలను మోహరించిన అడ్డుకున్నారు. రైతులు రాకుండా సోనేపట్‌ వద్ద సరిహద్దులను మూసేసి సీఆర్పీఎఫ్‌, బీఎస్‌ఎఫ్‌ సిబ్బందితో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. దీంతో సైన్యాన్ని నెట్టుకుంటూ హరియాణా గుండా ఢిల్లీ వెళ్లేందుకు రైతులు ప్రయత్నిస్తున్నారు. సైన్యం అడ్డుకుంటున్నా వెనక్కు వెళ్లే ప్రసక్తేలేదని భీష్మించుకుని కూర్చున్నారు. అటు రోహ్‌తక్‌-ఝజ్జర్‌ సరిహద్దుల్లోనూ పోలీసులు భారీగా మోహరించారు.

రైతుల ఆందోళనలను అడ్డుకోవడంపై పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ తీవ్రంగా మండిపడ్డారు. శాంతియుతంగా నిరసన తెలిపేందుకు ఢిల్లీ వెళ్తోన్న రైతులను అత్యంత క్రూరంగా సైన్యం సాయంతో అడ్డుకోవడం అప్రజాస్వామ్యమని, రాజ్యాంగ విరుద్ధమని ఆగ్రహం వ్యక్తం చేశారు. హరియాణా సరిహద్దులను పూర్తిగా మూసివేయడంపై విమర్శలు గుప్పించారు. దాదాపు రెండు నెలలుగా రైతులు తమ రాష్ట్రంలో శాతియుతంగా నిరసన తెలియజేస్తూ ఎటువంటి సమస్యలు సృష్టించలేదన్నారు. సైన్యం సాయంతో హరియాణా ప్రభుత్వం ఎందుకు అడ్డుకుంటోంది? ప్రభుత్వ రహదారి గుండా శాంతియుతంగా ప్రయాణించే హక్కు రైతులకు లేదా? అని నిలదీశారు.

అలాగే, కేంద్ర ప్రభుత్వంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ సైతం విమర్శలు గుప్పించారు. ‘కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలు రైతు వ్యతిరేకం. వాటిని వెనక్కి తీసుకోవడానికి బదులు ఆందోళన చేస్తున్న రైతులపై వాటర్ క్యానన్లు ప్రయోగిస్తున్నారు. శాంతియుత ఆందోళనలు చేయడం రాజ్యాంగ హక్కు’ అని కేజ్రీవాల్‌ కేంద్రాన్ని దుయ్యబట్టారు.