Begin typing your search above and press return to search.

తప్పుడు పాజిటివ్ రిపోర్టు.. ఎంత పని చేసింది?

By:  Tupaki Desk   |   18 April 2021 6:39 AM GMT
తప్పుడు పాజిటివ్ రిపోర్టు.. ఎంత పని చేసింది?
X
అవును.. ఒక తప్పుడు కరోనా పాజిటివ్ రిపోర్టు.. బంగారం లాంటి జట్టును ప్రపంచ కప్ కు దూరమయ్యేలా చేయటమే కాదు.. అర్థరాత్రి నడి రోడ్డు మీద కొన్ని గంటల పాటు ఉండిపోవాల్సిన దుస్థితి. కాసేపట్లో ఎయిర్ పోర్టుకు చేరి.. ప్రపంచ కప్ టోర్నీలో పాల్గొనేందుకు విమానం ఎక్కాల్సిన వారంతా.. ఎక్కడున్నామో?తమ పరిస్థితి ఏమిటన్నది అర్థం కాక కిందామీదా పడే దుస్థితి. భారత్ కు చెందిన ఒక ఆర్చరీ జట్టును తప్పుడు పాజిటివ్ రిపోర్టు భారీగా దెబ్బేసింది.

సోమవారం నుంచి మధ్య అమెరికాలోని గాటెమాలలో ప్రపంచకప్ తొలి దశ ఆర్చరీ పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ పోటీల కోసం కాంపౌండ్ జట్టుతో పాటు రికర్వ్ జట్టులు పాల్గొననున్నాయి. కాంపౌండ్ జట్టులో మన తెలుగు అమ్మాయి జ్యోతి సురేఖతోపాటు.. మరికొందరు సభ్యులతో కలిసి జట్టు కోచ్ ఢిల్లీ నుంచి అమస్టర్ డామ్ వెళ్లే విమానాన్ని ఎక్కాల్సి ఉంది. ఇందుకోసం వారు సోనెపట్ నుంచి బయలుదేరి ఢిల్లీకి వస్తున్నారు. వారు ప్రయాణిస్తున్న బస్సు.. మరికాసేపట్లో ఎయిర్ పోర్టుకు చేరుతుందన్న సమయానికి.. వారి మీద పిడుగులాంటి వార్త పడింది.

కాంపౌండ్ జట్టు కోచ్ గౌరవ్ శర్మకు పాజిటివ్ గా రిపోర్టు వచ్చిందని.. ఆయనతో కాంటాక్టులో ఉన్న వారంతా రికర్వ్ జట్టును కలిస్తే.. వారికి ఇబ్బంది అన్న ఉద్దేశంతో.. వీరందరిని ఎయిర్ పోర్టుకు వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో.. తీవ్ర నిరాశకు గురైన కాంపౌండ్ జట్టు సభ్యులు అర్థరాత్రి వేళ.. ఇంటికి వెళ్లాల్సి వచ్చింది. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే.. శనివారం ప్రైవేటు ల్యాబ్ లో పరీక్షించుకున్న గౌరవ్ శర్మకు నెగిటివ్ రిపోర్టు వచ్చింది. కానీ.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. తనలో ఎలాంటి పాజిటివ్ లక్షణాలు లేనప్పటికీ.. సాయ్ లో పాజిటివ్ అన్న తప్పుడు రిపోర్టు ఎలా వచ్చిందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. తమ జట్టు కానీ టోర్నీలో పాల్గొంటే పలువురికి పతకాలు ఖాయమని వారు వాపోతుననారు. ఇలాంటి తప్పుడు రిపోర్టుల కారణంగా బంగారంలాంటి భవిష్యత్తు బుగ్గిపాలు కావటం.. అందుకు బాధ్యులైన వారి మీద చర్యలు తీసుకోకుండా ఉండటం న్యాయమే అంటారా?