పడిపోయిన చైనా రాకెట్.. ఊపిరిపీల్చుకున్న ప్రపంచం!

Sun May 09 2021 10:14:58 GMT+0530 (IST)

Fallen China Rocket .. Breathtaking World!

అంతరిక్షంలోకి చైనా ప్రయోగించిన ‘లాంగ్ మార్చ్ 5బీ’ రాకెట్ విఫలమైందని.. భూమిపై వచ్చి పడబోతోందని వారం రోజులుగా వార్తలు ప్రసారం అవుతున్న సంగతి తెలిసిందే. మన దేశ రాజధాని ఢిల్లీపై పడొచ్చనే ఆందోళన కూడా వ్యక్తమైంది. ఇలాంటి పరిస్థితుల్లో.. ఆ రాకెట్ సముద్రంలో కూలిపోయినట్టు సమాచారం. హిందూ మహాసముద్రంలోని మాల్దీవుల సమీపంలో పడిపోయినట్టు చైనా అధికారికంగా ప్రకటించిందని వార్తలు వస్తున్నాయి.‘‘చైనా రాకెట్ లాంగ్ మార్చ్ 5బీ శకలాలు భూమి వాతావరనంలోకి వచ్చాయి. అవి తూర్పు రేఖాంశానికి 72.47 డిగ్రీలు ఉత్తర అక్షాంశానికి 2.65 డిగ్రీల వద్ద కూలాయి. చైనా రాజధాని బీజింగ్ సమయం ప్రకారం ఉదయం 10.24 గంటలకు కూలాయి. కూలిన శకలాల్లో చాలా వరకు కాలిపోయాయి’’ అని చైనా మానవ స్పేస్ ఇంజనీరింగ్ ఆఫీస్ తెలిపినట్టు సమాచారం. ఈ మేరకు ట్వీట్ కూడా చేసినట్టు తెలుస్తోంది.

ఏప్రిల్ 29న చైనా స్పేస్ స్టేషన్ తియాన్హే నుంచి బయల్దేరిన రాకెట్ ఆ తర్వాత విఫలమైంది. దీంతో.. భూమిపైకి దూసుకురావడం మొదలు పెట్టింది. అయితే.. అది ఎక్కడ పడుతుందోనని ప్రపంచం మొత్తం వారం రోజులుగా ఆందోళనకు గురైంది. ఆ రాకెట్ 22.5 మెట్రిక్ టన్నుల బరువు ఉండడంతో జనావాసాల్లో పడితే భారీగా ప్రాణ నష్టం సంభవిస్తుందనే భయపడ్డారు. చివరకు సముద్రంలో కూలిపోయిందని తెలియడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.