ఐసీఎంఆర్ పేరిట ఫేక్ న్యూస్ హల్‌చల్ .. అందులో ఏముందంటే ?

Fri May 07 2021 14:00:01 GMT+0530 (IST)

Fake news in the name of ICMR

ఐసీఎంఆర్  ...  ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్. అసలు కరోనా వైరస్ మహమ్మారి వెలుగులోకి రాకముందు వరకు ఇలాంటి ఓ సంస్థ ఉంది అని మెడికల్ స్టూడెంట్స్ వైద్యులకు కొంతమంది నిపుణులకు తప్ప పెద్దగా ఎవరికీ తెలియదు. కానీ కరోనా వైరస్ ఇండియా లో వెలుగులోకి వచ్చిన తర్వాత  ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకున్నారు. అలాగే కరోనా సమయంలో  ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ కి ఎంతో ప్రాధాన్యత పెరిగింది కూడా. కరోనా విజృంభణ సమయంలో  ఆ సంస్థ ఇచ్చే మార్గదర్శకాలను పాటించడం మొదలుపెట్టారు. దేశంలో కొవిడ్‌పై పోరులో ఈ సంస్థ ఇచ్చే సూచనలు మార్గదర్శకాలు ఎంతో కీలకంగా మారాయి. వాట్సాప్ మేధావుల పుణ్యమా అని కరోనాసమయంలో  ఏది నిజమో ఏది అబద్ధమో తెలియని అయోమయంలో కొట్టుమిట్టాడుతున్న జనాలు కరోనాకు సంబంధించి ఏ విషయంలోనైనా ఐసీఎంఆర్ చెప్పినట్లు నడుచుకునే ప్రయత్నం చేస్తున్నారు.ఇంతవరకు బాగానే ఉంది . కానీ దీన్ని కొందరు ఆసరాగా చేసుకుని  ఐసీఎంఆర్ లోగో వేసి ఫేక్  న్యూస్ ప్రచారం చేసే వారు ఎక్కువైపోయారు. తాజాగా ఐసీఎంఆర్ పేరుతో ఒక నోట్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. కరోనా వైరస్ మహమ్మారి సెకండ్ వేవ్ విజృంభిస్తున్న వేళ జనాలను మరింత గందరగోళానికి భయానికి గురి చేసేలా ఉంది ఆ నోట్. సెకండ్ వేవ్ ఎఫెక్ట్ కారణంగా వచ్చే  రెండేళ్ల పాటు ప్రయాణాలేవీ పెట్టుకోవద్దని అలాగే మరో  ఆరు నెలల పాటు థియేటర్లు మాల్స్ వైపు చూడొద్దని అలాగే  ఏడాది పాటు బయటి తిండి ముట్టుకోవద్దని శాఖాహారం మాత్రమే తినాలని మాంసాహారం ముట్టుకోవద్దని హ్యాండ్ కర్చీఫ్ వాడొద్దని ఆ నోట్ లో ఈ తరహా సూచనలున్నాయి. ఇందులో కొన్ని మరీ అతిగా అనిపిస్తుండటం తో ప్రజలు కొంతమేర అయోమయానికి గురవుతున్నారు. జనాలను తప్పుదోవ పట్టించేలా ఉన్న ఈ నోట్ గురించి ఐసీఎంఆర్ దృష్టికి రావడంతో ట్విట్టర్లో ఆ సంస్థ స్పందించింది. ఆ నోట్ ను తమ ట్విట్టర్ పేజీలో షేర్ చేస్తూ ఇది ఫేక్ అని దీన్ని పట్టించుకోవద్దని స్పష్టం చేసింది. కానీ ఇది ఫేక్ అని తెలియక   ప్రముఖులు సైతం ఈ నోట్‌ను షేర్ చేసి సర్క్యులేట్ చేశారు. ప్రస్తుతం ఇది వాట్సాప్ గ్రూప్స్ లో తెగ వైరల్ అవుతుంది. కాబట్టి మీరు కరోనా పై వచ్చే ఫేక్ న్యూస్ లని నమ్మకుండా ఐసీఎంఆర్ ఇచ్చే నిజమైన సూచనలు పాటించి కరోనా ను జయించండి.