Begin typing your search above and press return to search.

తెలంగాణకు వచ్చి పార్టీ పెట్టకూడదు.. మరి కేసీఆర్ పెట్టొచ్చా?

By:  Tupaki Desk   |   5 Oct 2022 5:41 AM GMT
తెలంగాణకు వచ్చి పార్టీ పెట్టకూడదు.. మరి కేసీఆర్ పెట్టొచ్చా?
X
తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు.. ఆ మాటకు వస్తే.. తాము తప్పించి మరెవరూ పార్టీ పెట్టొద్దన్న రీతిలో తెలంగాణ అధికార పక్షం తరచూ వ్యవహరిస్తుందన్న విషయం తెలిసిందే. ఇక.. తెలంగాణ మూలాలు ఉన్నప్పటికీ.. వారి మీద ఇతర ప్రాంతాలకుచెందిన వారన్న ముద్ర ఉంటే.. అలాంటి వారిని చులకన చేసేలా.. వారి నేపథ్యాన్ని.. వారి ఉనికిని ప్రశ్నిస్తే.. తెలంగాణలో నీకేం పని భయ్? అన్నట్లుగా మాట్లాడే గులాబీ బాస్ కేసీఆర్ కు.. ఇప్పుడు జాతీయ రాజకీయాలు కావాల్సి వచ్చాయి.

తాను..తన ప్రాంతం.. తమకు మాత్రమే తప్పించి.. మరెవరికి అవసరం లేదన్న పరిమితుల్ని విధించుకున్న కేసీఆర్ లాంటి అధినేత.. ఇప్పుడు ఏకంగా జాతీయ పార్టీ పెట్టేస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణలో రాజకీయ పార్టీలు పెట్టే వారందరిని ప్రశ్నించే అలవాటున్న కేసీఆర్ అండ్ కోను.. ఇప్పుడు తెలంగాణ కాకుండా దేశ మంతా పార్టీని విస్తరించాలన్న లక్ష్యం ఇప్పుడు ఆసక్తికరమని చెప్పాలి.

తెలంగాణలో పార్టీ అన్నంతనే ఫైర్ అయ్యే కేసీఆర్.. తన జాతీయ పార్టీకి సంబంధించిన జస్టిఫికేషన్ ఏమని ఇస్తారు? ఇంతకాలం తాను వల్లించిన మాటల హద్దుల్ని ఎలా చెరిపేస్తారు? నోరు తెరిస్తే తెలంగాణ తప్పించి.. మిగిలిన వారు ఎలా పోయినా ఫర్లేదన్న వ్యక్తి.. తెలంగాణను విడిచి పెట్టి.. దేశం మొత్తాన్ని ఒకేలా ఎలా చూస్తారు? చూసే అవకాశం ఎంత. అన్నది ప్రధాన ప్రశ్నగా చెప్పాలి.

కాల మహిమ కాకుంటే.. తెలంగాణ ప్రయోజనాలు తప్పించి.. మరింకేమీ పట్టవని చెప్పే వ్యక్తి.. ఇప్పుడు అందుకు భిన్నంగా యివత్ దేశాన్ని ఒకే యూనిట్ గా ఎలా చూడగలుగుతారు? అన్న ప్రశ్నకు ఇప్పటివరకు కేసీఆర్ కానీ.. ఆయన పార్టీకి చెందిన ప్రముఖులు ఎవరూ కూడా నోరు విప్పింది లేదు.

అవసరంతో అవకాశాన్ని వెతికేయటం తప్పించి.. విషయాల మీద కేసీఆర్ కు ఉన్న అవగాహన ఎంతన్నది కూడా సందేహమే. చక్కటి వాగ్ధాటితో ఎలాంటి ప్రయోజనం లేదని.. అలాంటి వారి పాలనలో అప్పుల తిప్పలు అంతకంతకూ పెరుగుతున్నాయే తప్పించి ఇంకేం లేదన్న విమర్శకు బలం పెరిగిపోతున్న వేళ.. అందుకు భిన్నంగా జాతీయ పార్టీ ప్రకటన చేసేందుకు సిద్ధమవుతున్న కేసీఆర్ మాటల్ని తప్ప పట్టాల్సిందే కదా?
తన బంగారు పుట్టగా తెలంగాణను భావించే వ్యక్తి.. ఇప్పటివరకు చెప్పిన మాటలకు భిన్నంగా తూచ్.. భారతదేశమే తన అడ్డా అనటంలో అర్థముందా? అన్నది అసలు ప్రశ్న.

ప్రాంతాల పరిమితులతో కొట్టుమిట్టాడే అధినేత.. విస్తృత ప్రయోజనాల కోసం ఏమేరకు పని చేస్తారన్నది ప్రశ్నే. మరి.. ఇలాంటి ప్రశ్నలకు కేసీఆర్ ఏమని బదులిస్తారు? ఎంత మంది సందేహాల్ని తీర్చగలరు? అన్నది అసలు క్వశ్చన్.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.