గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ పై ఎఫ్ఐఆర్

Wed Jan 26 2022 22:00:01 GMT+0530 (IST)

FIR against Google CEO Sundar Pichai

ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ దిగ్గజం సీఈవోపై భారత్ లో ఎఫ్ఐఆర్ నమోదైంది. సుందర్ పిచాయ్ పై ముంబైలో ఎఫ్ఐఆర్ నమోదైంది. బాలీవుడ్ నిర్మాత ఒకరు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. సుందర్ పిచాయ్ తోపాటు మరో ఐదుగురిపై కేసు నమోదైంది.తొలుత నిర్మాత-న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కోర్టు ఆదేశాలతో ఎంఐడీసీ అంధేరి ఈస్ట్ పోలీసులు ఎఫ్ఐఆర్ ను నమోదు చేశారు. దర్యాప్తు మొదలుపెట్టారు. సుందర్ పిచాయ్ పై కేసు నమోదు కావడానికి ఓ బాలీవుడ్ సినిమా గొడవ కారణం. ‘ఏక్ హసీనా థీ ఏక్ దదీవానా థా’ అనే బాలీవుడ్ సినిమా ఇటీవలే యూట్యూబ్ లో అప్ లోడ్ అయ్యింది.

2017లో విడుదలైన మూవీ ఇది. శివ్ దర్శన్ నటాషా ఫెర్నాండేజ్ ఉపేన్ పటేల్ సాన్ మహాజన్ నటించిన సినిమా ఇది. ఫ్లాప్ మూవీగా పేరు తెచ్చుకుంది. ఈ సినిమాను సునీల్ దర్శన్ నిర్మించారు. ఆయనే దర్శకుడు కూడా. ఈ సినిమా యూట్యూబ్ లో అప్ లోడ్ అయ్యింది. మంచి వ్యూస్ సాధించింది.

ఈ సమాచారం తెలిసిన వెంటనే సునీల్ దర్శన్ కోర్టును ఆశ్రయించారు. ఈ సినిమా కాపీ రైట్స్ తన వద్దే ఉన్నాయని.. ఎవరికీ విక్రయించలేదని అన్నారు. అలాంటప్పుడు తన అనుమతి లేకుండా దీన్ని ఎలా అప్ లోడ్ చేస్తారని ప్రశ్నించారు. యూట్యూబ్ పై కొంతకాలంగా న్యాయపోరాటం చేస్తున్నారు. యూట్యూబ్ కు నోటీసులు జారీ చేసినప్పటికీ యూట్యూబ్ మేనేజ్ మెంట్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు.

ఈ సినిమాతో ఎలాంటి సంబంధం లేని  వ్యక్తులు దీన్ని యూట్యూబ్ లో అప్ లోడ్ చేశారని.. బిలియన్ల కొద్దీ వ్యూస్ ను అందుకున్నారని అన్నారు. యూట్యూబ్ తోపాటు దాన్ని అప్ లోడ్ చేసిన వారు ఆదాయాన్ని ఆర్జించారని పేర్కొన్నారు. దీనిపై పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ యూట్యూబ్ నుంచి స్పందన రాకపోవడంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సి వచ్చిందన్నారు.

ఏక్ హసీనా థీ ఏక్ దీవానా థా సినిమాకు సంబంధించి పూర్తి మేథో సంపత్తి హక్కులు సునీల్ దర్శన్ వద్దే ఉన్నాయని ఆయన తరుఫున న్యాయవాది ఆదిత్యా చితాలే తెలిపారు. దీనికి బాధ్యులుగా గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తోపాటు మరో ఐదుగురిని గుర్తించారు. వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటూ కోర్టు ఆదేశించిందని వివరించారు. ఈ సినిమాకు సంబంధించిన హక్కులు ఎవరి వద్ద ఉన్నాయనే విషయంపై యూట్యూబ్ మేనేజ్ మెంట్ సంప్రదింపులు జరపలేదని ఆరోపించారు.