ప్రముఖుల గెలుపోటములపై ఎగ్జిట్ పోల్ సర్వే రిపోర్ట్!

Tue May 21 2019 10:32:21 GMT+0530 (IST)

Exit Polls Survey Reports on Key Leaders Fate in Lok Sabha Elections

ఎగ్జిట్ పోల్స్ వచ్చేయటం.. గెలుపు ఎవరిదన్న దానిపై ఒక క్లారిటీ రావటం జరిగిపోయింది. ఎగ్జిట్ పోల్స్ అన్ని నిజమవుతాయా? అన్న ప్రశ్నకు సమాధానం వేరుగా ఉన్నా.. అన్ని మీడియా సంస్థల ఎగ్జిట్ పోల్స్ ఒకేలాంటి రిజల్ట్ ను మోడీకి కట్టబెడుతున్న తీరుపై ఇప్పుడు జోరు వాదనలు నడుస్తున్నాయి. తుది ఫలితాలు వెల్లడయ్యే వరకూ ఈ అంశాలపై చర్చలు సాగుతూనే ఉంటాయని చెప్పక తప్పదు.ఇదిలాఉంటే.. సార్వత్రికం బరిలో ఉన్న ప్రముఖుల్లో గెలిచే వారు.. ఓటమి పాలయ్యే వారికి సంబంధించిన వివరాల్ని తాజాగా ప్రముఖ మీడియా సంస్థ ఇండియాటుడే-యాక్సిస్ మై ఇండియా వెల్లడించింది. ఈసారి పలువురు ప్రముఖులకు ఎదురు దెబ్బలు.. ఊహించని విజయాలు ఎదురుకావటం ఖాయమన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేయటం విశేషం.

గెలిచే ప్రముఖులు ఓడే ప్రముఖులు ఎవరన్న దానిపై ఇండియా టుడే పోల్ సర్వే అంచనా చూస్తే..

+  అమేధీలో రాహుల్ కు ఎదురుగాలి. అదే సమయంలో కేరళ వయనాడ్ భారీ మెజార్టీతో గెలుపు ఖాయం.

+  అమేధీలో సంచలన విజయానికి స్మృతికి ఎక్కువ అవకాశాలు.

+  యూపీఏ ఛైర్ పర్సన్ బరిలో ఉన్న రాయబరేలీలో గెలుపు ఆమె ఖాతాలో పడనుంది.

+  రాంపూర్ లో జయప్రదకు షాక్ తగలటం ఖాయమని.. ఎస్పీ నేత వివాదాస్పద ఆజంఖాన్ గెలుపు పక్కా

+  గాంధీనగర్ లో బీజేపీ కురువృద్ధుడు అద్వానీ నుంచి సీటు లాగేసుకొని.. బరిలో నిలిచిన బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా గెలుపు ఖాయమట. 67 శాతం ఓట్లను సొంతం చేసుకొని భారీ మెజార్టీతో గెలవనున్నారట.

+   యూపీలోని మైన్ పురిలో ఎస్పీ వ్యవస్థాపకుడు ములాయం.. బీజేపీ అభ్యర్థి ప్రేమ్ సింగ్  మధ్య హోరాహోరీ పోరు.

+  యూపీలోని సుల్తాన్ పూర్ లో కేంద్ర మంత్రి మేనకా గాంధీ స్వల్ప మెజార్టీతో బయటపడే అవకాశం.

+  పిలిభిత్ లో ఎస్పీ అభ్యర్థి హేమరాజ్ వర్మపై బీజేపీ నేత వరుణ్ గాంధీ విజయం ఖాయమట.

+  భోపాల్ లో కాంగ్రెస్ సీనియర్ దిగ్విజయ్ సింగ్ కు షాక్ తప్పదు. ఆయనపై పోటీ చేసి పలు వివాదాస్పద వ్యాక్యలు చేసిన బీజేపీ అభ్యర్థి   ప్రజ్ఞా సింగ్ గెలుపు ఖాయమట.

+  కర్ణాటక మాండ్యలో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచిన నటి సుమలత గెలుపు ఖాయం. కర్ణాటక ముఖ్యమంత్రి కుమారుడు కమ్ జేడీఎస్- కాంగ్రెస్ ఉమ్మడి అభ్యర్థి నిఖిల్ గౌడ్ ఓటమి పక్కానట.

+  కేరళలోని తిరువనంతపురంలో కాంగ్రెస్ అభ్యర్థి శశిథరూర్ ఎల్డీఎఫ్ అభ్యర్థి దివాకరణ్ పై ఘన విజయం.

+  తమిళనాడులోని శివగంగ నుంచి కాంగ్రెస్ నేత పి.కార్తి చిదంబరం గెలుపు గ్యారెంటీనట.

+  తమిళనాడులోని తూత్తికుడిలో బీజేపీ నేత తమిళసై సౌందరరాజన్ పై డీఎంకే నేత కనిమొళి గెలుపు.

+  ఉత్తర ముంబై కాంగ్రెస్ అభ్యర్థి ఊర్మిళ మతోండ్కర్.. దక్షిణ ముంబై కాంగ్రెస్ అభ్యర్థి మిలింద్ దేవ్ రా కు తప్పని ఓటమి తప్పదు.

+  పూరీ బీజేపీ అభ్యర్థి సంబిత్ పాత్ర.. నాగ్ పూర్ బీజేపీ అభ్యర్థి కమ్ కేంద్రమంత్రి గడ్కారీ.. బారామతి నుంచి ఎన్సీపీ నేత సుప్రియా సూలే విజయం ఖాయం.

+  బిహార్ లోని బెగుసరాయ్ ఎంపీ స్థానానికి పోటీ పడిన కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ ఘన విజయం ఖాయం. ఇదే స్థానం నుంచి పోటీ చేసిన జేఎన్ యూ విద్యార్థి సంఘం నేత.. సీపీఐ అభ్యర్థి కన్హయ్యకుమార్ ఓటమి తథ్యమట.

+   బిహార్ లోని పట్నాసాహిబ్ లో బీజేపీ నేత - కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ గెలుపు.. ఇదే స్థానం నుంచి బరిలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి శత్రుఘ్నసిన్హా ఓటమి తప్పదట.

+  ఈశాన్య ఢిల్లీలో కాంగ్రెస్ నేత షీలాదీక్షిత్ పై బీజేపీ అభ్యర్థి మనోజ్ తివారీ స్వల్ప మెజారిటీతో విజయం.

+  తూర్పు ఢిల్లీలో బీజేపీ అభ్యర్థి గౌతమ్ గంభీర్ కాంగ్రెస్ నేత అర్విందర్ లవ్లీపై గెలుపు ఖాయమట.

+  పంజాబ్ లోని గురుదాస్ పూర్ లో బీజేపీ నేత సన్నీడియోల్ చేతిలో కాంగ్రెస్ నేత సునీల్ కుమార్ జాఖర్ ఓటమి.