Begin typing your search above and press return to search.

ప్రజాతీర్పును పరిహాసం చేస్తున్న ఎక్స్ అఫిషియో.. నిజమెంత?

By:  Tupaki Desk   |   25 Nov 2020 8:10 AM GMT
ప్రజాతీర్పును పరిహాసం చేస్తున్న ఎక్స్ అఫిషియో.. నిజమెంత?
X
గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో ఎక్స్ అఫిషియో సభ్యుల వ్యవహారం కొత్త చర్చకు తావిస్తోంది. ప్రజలు ఇచ్చే తీర్పును మార్చే ఈ తీరుపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు అమలు కాకుండా అడ్డుకునే ఈ విధానాన్ని మార్చాలన్న మాట బలంగా వినిపిస్తోంది. ఇంతవరకు లేనిది ఇప్పుడే ఈ అంశంపై చర్చ జరగటానికి కారణం ఏమిటన్నది చూస్తే.. తాజా రాజకీయ పరిణామంగా చెబుతున్నారు.

గ్రేటర్ ఎన్నికల హాట్ హాట్ గా సాగుతున్నాయి. దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం అధికార పార్టీకి ఇబ్బందికరంగా మారితే.. విపక్ష బీజేపీకి కొండంత బలాన్ని ఇచ్చింది. ఈ బలంతో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తన ప్రభావాన్ని చూపాలని తపిస్తోంది. అయితే.. ఎన్నికల్లో తమ సత్తా చాటినా.. గ్రేటర్ పీఠం బీజేపీ వశం కావటం అసంభవం అన్న మాట వినిపిస్తోంది. దీనికి కారణం.. ఎక్స్ అఫీషియో ఓట్లే కారణంగా చూపిస్తున్నారు. దీంతో.. ఈ అంశం ఇప్పుడు రాజకీయ చర్చకు తెర తీసింది.

గ్రేటర్ పరిధిలో మొత్తం డివిజన్లు 150. అంటే.. 76 డివిజన్లు ఏ పార్టీ సొంతం చేసుకుంటే ఆ పార్టీకి మేయర్ పీఠం దక్కాలి. కానీ.. గ్రేటర్ పరిధిలో ప్రస్తుతం ఉన్న 49 ఎక్స్ అఫిషియో సభ్యులు ఉన్నారు. వీరికి కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీలు ముగ్గురు జత కానున్నారు (ఒకవేళ వారు గ్రేటర్ హైదరాబాద్ ను ఎంపిక చేసుకుంటే). అంటే మొత్తం 52 మంది ఎక్స్ అఫీషియలో. వీరిలో అత్యధికులు టీఆర్ఎస్ నేతలు.

అంటే.. గ్రేటర్ మొత్తం ఓట్లు 150+52= 202. అంటే.. 102ఓట్లు ఎవరికైతే వస్తాయో వారికే గ్రేటర్ పీఠం దక్కుతుంది. బీజేపీ మేయర్ పీఠాన్ని సొంతం చేసుకోవాలంటే.. 100 సీట్లు గెలవాలి. వారికి రాజాసింగ్.. కిషన్ రెడ్డిలతో పాటు ఎమ్మెల్సీ రామచంద్రరావు ఓటు ఉంది. అదే టీఆర్ఎస్ పార్టీకి కేవలం 66 స్థానాలు గెలిస్తే సరిపోతుంది. ఒకవేళ.. పాతిక సీట్లు మాత్రమే గెలిచినా.. మజ్లిస్ కి 40 సీట్లు వచ్చినా.. రెండు పార్టీలు కలిసి మేయర్ పీఠాన్ని సొంతం చేసుకునే పరిస్థితి. దీనికి కారణం.. రెండు పార్టీలకు ఉన్న ఎక్స్ అఫీషియో సభ్యులే కారణం.

ఇదంతా చూస్తే.. ప్రజాతీర్పును సైతం మార్చేలా ఉన్న ఎక్స్ అఫిషియో తీరు.. రానున్న రోజుల్లో మార్పులు చేయాల్సిన అవసరం కొట్టొచ్చినట్లుగా కనిపించక మానదు. మిగిలిన చట్టసభలకు లేకుండా కేవలం స్థానిక సభల్లోనే ఉండటం చూస్తే.. ఇదంతా అధికారపక్షానికి దన్నుగా ఉండే ఏర్పాటు అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.