ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య

Mon Sep 16 2019 12:53:05 GMT+0530 (IST)

Ex Speaker Kodela Siva Prasada Rao Passes Away

ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు హైదరాబాద్ లోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన ఉరివేసుకోగా ఇంట్లో ఉన్నవారు గుర్తించి ఆసుపత్రికి తరలించారు. బసవతారకం ఆసుపత్రికి తరలించగా అక్కడి చికత్సపొందుతూ చనిపోయారు.రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ కు తొలి స్పీకర్ ఆయన. అయితే - 2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమి పాలై వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఆయనే తొలి టార్గెట్ అయ్యారు. ఆయన - కుమారుడు - కుమార్తెపై వరుస కేసులు నమోదయ్యాయి. గత మూడు నెలల్లో దాదాపు 25 కేసులు నమోదయ్యాయి. చివరికి అసెంబ్లీలో ఫర్నిచర్ ను కూడా ఆయన ఎత్తుకెళ్లారన్న ఆరోపణలు వచ్చాయి. ఫర్నీచర్ కూడా రికవరీ చేశారు. ఈ పరిణామలన్నటి నేపథ్యంలో ఆయనకు ఇటీవల గుండెపోటు కూడా వచ్చింది.

గుండెపోటు అనంతరం ఆయన బసవతారకం ఆసుపత్రిలోనే ఉన్నట్లు చెబుతున్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల నాటి నుంచి జరుగుతున్న వరుస పరిణామాలతో ఆయన తీవ్రంగా కలత చెందారని.. ఆ కలతతోనే ఆత్మహత్య చేసుకున్నారని టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి.

ఎన్నికల సమయంలో ఓ పోలింగ్ కేంద్రానికి వెళ్లిన ఆయన్ను వైసీపీ వర్గాలు తరిమితరిమి కొట్టాయి. అనంతరం వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఆయనపై - కుమారుడు - కుమార్తె పైనా కేసులు పెట్టారు. అసెంబ్లీలోని ఫర్నిచర్ ను ఆయన అక్రమంగా తీసుకెళ్లిపోయారన్న కేసు ఆయన పరువును మరింతగా బజారుకీడ్చింది.

ఈ నేపథ్యంలోనే కోడెల శివప్రసాద్ కుటుంబానికి చెందిన హోండా షోరూంలో అసెంబ్లీ సిబ్బంది తనిఖీలు చేపట్టారు. షోరూంలో అసెంబ్లీ ఫర్నిచర్ ఉందనే సమాచారం మేరకు సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. హైకోర్టు ఆదేశాల మేరకు సీజ్ చేసిన షోరూం తాళాలను రవాణాశాఖ అధికారులు తెరిచి తనిఖీ చేశారు.

ఈ పరిణామాలన్నిటితో శివప్రసాద్ నీరుగారిపోయినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా వైసీపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ప్రతి రోజూ ఏదో ఒకటి జరుగుతుండడంతో ఏ రోజు ఏమవుతుందో... ముందు ముందు ఇంకేమవుతుందో అన్న టెన్షన్‌తో ఆయనకు గుండెపోటు వచ్చిందని చెబుతున్నారు. అనంతరం కూడా ఆయన తీవ్ర ఆవేదనతోనే ఉన్నారని.. ఆ ఆవేదనలోనే ఆత్మహత్య చేసుకున్నారని చెబుతున్నారు.