Begin typing your search above and press return to search.

వైసీపీ పిలుస్తోంది : కాంగ్రెస్ పెద్దాయన చూపు అటు వైపేనా...?

By:  Tupaki Desk   |   15 May 2022 8:31 AM GMT
వైసీపీ పిలుస్తోంది : కాంగ్రెస్ పెద్దాయన చూపు అటు వైపేనా...?
X
ఆయన పేరు చెబితే చాలు సినీ రాజకీయ సాంస్కృతిక రంగాలకు చెందిన వారంతా మావాడు అంటారు. ఇక సగటు జనాలకు కూడా ఆయన బాగా పరిచయం. విశాఖను తన దత్తత జిల్లాగా చేసుకుని నాలుగు దశాబ్దాలుగా అక్కడే స్థిరపడి రాజకీయం చేస్తున్న ఘనత నెల్లూరుకు చెందిన తిక్కవరపు సుబ్బరామిరెడ్డిది.

ఆయన కేరాఫ్ విశాఖ అని అంతా అంతా చెబుతారు. తన పుట్టిన రోజును విశాఖలోనే కొన్ని దశాబ్దాలుగా జరుపుకుంటూ ఈ ప్రాంతం వారికి ఆయన అచ్చమైన స్థానికుడు అయిపోయారు. ఇక సుబ్బరామిరెడ్డి రెండు మార్లు విశాఖ లోక్ సభ నుంచి కాంగ్రెస్ తరఫున ఎంపీగా గెలిచారు. అలాగే రాజ్యసభ సభ్యుడిగా మూడు సార్లు కాంగ్రెస్ నుంచి గెలిచారు.ఆయన రాజ్యసభ సభ్యత్వం 2020తో ముగిసిపోయింది.

కాంగ్రెస్ లో మళ్లీ చాన్స్ లేదు. దాంతో రెండేళ్ళ క్రితమే ఆయన రాజ్యసభ సీటు కోసం వైసీపీలో చేరాలనుకున్నారు. చివరి నిముషంలో జగన్ని కలవడం వల్ల నాడు కుదరలేదు. ఈసారి మాత్రం అలా కాకూడదు అని టీఎస్సార్ అలా షెడ్యూల్ విడుదల అయిందో లేదో ఇలా విశాఖలో ప్రత్యక్షం అయ్యారు. ఆయనకు విశాఖలో వైసీపీ నాయకుల నుంచి ఘన స్వాగతం లభించింది.

అంతే కాదు ఆయన గత కొన్ని రోజులుగా వైసీపీ వారితోనే టచ్ లో ఉంటూ మంతనాలు జరుపుతున్నారు. దీంతో టీఎస్సార్ వైసీపీలో చేరుతున్నారు అన్న ప్రచారం గట్టిగా జరుగుతోంది. ఒక వైపు కాంగ్రెస్ ఆద్వర్యంలో చింతన్ శిబిర్ రాజస్థాన్ లో జరుగుతోంది. కాంగ్రెస్ లో కీలకమైన నేతగా ఉనన్ టీఎస్సార్ కి ఆ పార్టీ నుంచి ఎటువంటి ఆహ్వానం రాలేదు అని అంటున్నారు. అలాగే టీఎస్సార్ కూడా కాంగ్రెస్ కార్యకలాపాలు ఈ మధ్యన బాగా తగ్గించేశారు అని చెబుతున్నారు.

ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి అసలు బాగులేదు. ఇక దేశంలో కూడా వస్తుందో రాదో తెలియదు. దాంతో నెల్లూరు పెద్దాయన తన విధేయతను మార్చేయాలని అనుకుంటున్నట్లుగా చెబుతున్నారు. ఆయనకు వైఎస్సార్ ఫ్యామిలీతో మంచి పరిచయాలు ఉన్నాయి. రెండేళ్ళ క్రితం సీఎం జగన్ ని ఆయన క్యాంప్ ఆఫీసులో కలవగలిగారు అంటేనే ఆయనకు గుడ్ రిలేషన్స్ ఉన్నాయనే చెబుతారు.

ఇపుడు ఏపీ నుంచి నాలుగు రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతున్న వేళ ఒక దాన్ని ఆశిస్తున్న టీఎస్సార్ వైసీపీ కండువా కప్పుకుని అయినా పెద్దల సభలో అడుగుపెట్టాలని గట్టిగానే తీర్మానించుకున్నారు అని తెలుస్తోంది. అయితే సుబ్బరామిరెడ్డికి టికెట్ ఇవ్వడానికి సామాజిక రాజకీయ సమీకరణలు సరిపోతాయా అన్నదే చర్చ. ఒక వైపు రెడ్డి సామాజికవర్గం నుంచి విజయసాయిరెడ్డికి రెన్యూల్ చేయాలి. అలాగే జగన్ వ్యక్తిగత లాయర్ నిరంజన్ రెడ్డికి చాన్స్ ఇస్తారని అంటున్నారు.

ఈ నేపధ్యంలో టీఎస్సార్ ఇలా వచ్చి అలా ఎంపీ సీటుని ఎగరేసుకుపోతాను అంటే పార్టీలో ఎవరూ ఊరుకోరు. ఇవన్నీ చూసుకుంటే ఆయనకు సీటు డౌటే అంటున్నారు. అయితే ముందు టీఎస్సార్ పార్టీ కండువా కప్పుకుంటే ఇపుడు రాజ్యసభ కాకపోయినా 2024 నాటికి విశాఖ నుంచి వైసీపీ తరఫున ఎంపీగా పోటీకి టికెట్ దక్కే అవకాశం ఉంది అంటున్నారు. విశాఖలో మంచి పలుకుబడి కలిగిన ఈ రెడ్డిగారు వస్తానూ అంటే తీసుకోవడానికి వైసీపీకి నో అబ్జెక్షన్ అని కూడా చెబుతున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.