Begin typing your search above and press return to search.

అంతా ఫైన్... మ‌ళ్లీ సాగు చ‌ట్టాల ఊసే లేదు

By:  Tupaki Desk   |   12 Feb 2022 8:15 AM GMT
అంతా ఫైన్... మ‌ళ్లీ సాగు చ‌ట్టాల ఊసే లేదు
X
మ‌ళ్లీ రైతు చ‌ట్టాల పేరు ఎత్తేందుకు కూడా కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వం ధైర్యం చేసే ప‌రిస్థితులు క‌నిపించ‌డం లేదు. దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ‌కు కార‌ణ‌మై.. రైతుల ఉద్య‌మానికి దారి తీసి.. చివ‌ర‌కు ప్ర‌ధాని మోడీ క్ష‌మాప‌ణ చెప్పే ప‌రిస్థితికి హేతువు అయిన ఈ రైతు చ‌ట్టాల క‌థ మొత్తానికి ముగిసిన‌ట్లే. మూడు సాగు చ‌ట్టాల‌ను స‌మీప భ‌విష్య‌త్‌లో మ‌ళ్లీ తీసుకు వ‌చ్చే ఉద్దేశ‌మేమీ లేద‌ని కేంద్రం చెప్ప‌డమే అందుకు నిద‌ర్శ‌నం.

దేశ‌వ్యాప్తంగా మెజారిటీ సంఖ్య‌లో రైతులు వ్య‌తిరేకించిన‌ప్ప‌టికీ ప్రధాని మోడీ మూడు వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను తీసుకొచ్చారు. 2020 సెప్టెంబ‌ర్‌లో వాటిని లోక్‌స‌భ‌లో ఆమోదించారు. దీంతో వాటిని ర‌ద్దు చేయాల‌ని ఏడాదికి పైగా రైతులు ఉద్య‌మం చేశారు. ముఖ్యంగా పంజాబ్‌, హ‌రియాణా, ఢిల్లీ రైతులు ఈ ఉద్య‌మంలో కీల‌క పాత్ర పోషించారు.

ఢిల్లీ స‌రిహ‌ద్దు వ‌ద్ద ఎండ‌కు ఎండి, వాన‌కు త‌డిసి, చలిలో వ‌ణుకుతూ పోరాటం సాగించారు. ఈ ఉద్య‌మంలో భాగంగా చెలరేగిన హింస‌లో ఎంతో మంది రైతులు ప్రాణాలు కూడా కోల్పోయారు. దాదాపు 700కు పైగా రైతులు మ‌ర‌ణించిన‌ట్లు తెలిసింది.

కానీ ఇవ‌న్నీ చూశాక కూడా మోడీ ఏం ప‌ట్ట‌న్న‌ట్లే ఉన్నారు. మూడు రైతు చ‌ట్టాల‌పై వెన‌క్కి త‌గ్గేదే లేద‌ని ప‌లుమార్లు బీజేపీ నేత‌లు స్ప‌ష్టం చేశారు. కానీ గ‌తేడాది న‌వంబ‌ర్‌లో ఈ రైతు చ‌ట్టాల‌ను ర‌ద్దు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించి మోడీ ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. రైతుల‌కు ఆయ‌న క్ష‌మాప‌ణ కూడా చెప్పారు. ఓ వైపు మోడీ ప్ర‌భుత్వంపై పెరుగుతున్న వ్య‌తిరేక‌త‌.. అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో మోడీ ఈ నిర్ణ‌యం తీసుకున్నార‌నే అభిప్రాయాలు వినిపించాయి. గ‌తేడాది పార్ల‌మెంట్ శీతాకాల స‌మావేశాల్లో ఈ బిల్లుల ర‌ద్దు ప్ర‌క్రియ పూర్త‌యింది.

కానీ బీజేపీ మ‌ళ్లీ ఈ చ‌ట్టాల‌ను తీసుకువ‌స్తుందా అనే అనుమానాలైతే ఇన్ని రోజులూ ఉన్నాయి. కానీ ఇప్పుడు ఈ మూడు సాగు చ‌ట్టాల‌ను మ‌ళ్లీ తీసుకువ‌చ్చే ఉద్దేశం లేద‌ని కేంద్ర వ్య‌వ‌సాయ మంత్రి న‌రేంద్ర‌సింగ్ తోమ‌ర్ స్ప‌ష్టం చేశారు. రాజ్య‌స‌భ‌లో ప్ర‌తిప‌క్ష నేత మ‌ల్లిఖార్జున ఖ‌ర్గే అడిగిన ప్ర‌శ్న‌కు ఆయ‌న ఈ మేర‌కు స‌మాధాన‌మిచ్చారు.

మ‌రోవైపు క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర‌కు చ‌ట్ట‌బ‌ద్ధ‌త కల్పిస్తూ బిల్లులు తీసుకువ‌చ్చే అవ‌కాశం ఉందా అని అడిగిన ప్ర‌శ్న‌కు కేంద్ర వ్య‌వ‌సాయ మంత్రి స్ప‌ష్ట‌మైన స‌మాధానం ఇవ్వ‌లేదు. రైతు ఉద్య‌మంలో మ‌ర‌ణించిన వారికి ప‌రిహారం అందించే అంశం మాత్రం సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాల ప‌రిధిలోకి వ‌స్తుంద‌ని పేర్కొన్నారు. దీంతో కేంద్రం త‌ప్పించుకునే ప్ర‌య‌త్నం చేస్తుంద‌నే విమ‌ర్శ‌లు మొద‌ల‌య్యాయి.