ఆయన చుట్టూనే అంతా : చినబాబు వేరే లెవెల్...?

Sat May 28 2022 22:00:11 GMT+0530 (IST)

Everyone is Around Lokesh

ఈసారి టీడీపీ మహానాడులో కనిపించే చాలా సన్నివేశాలు ఆసక్తిని కలిగించాయి. మహానాడుకు ఎక్కువ  మంది సీనియర్ నేతలతో పాటు పెద్ద ఎత్తున జూనియర్ నేతలు కూడా వచ్చారు. మాట్లాడే అవకాశం అయితే జూనియర్ నేతలకు ఎక్కువగా దక్కింది. యువగళాలు ఈసారి మహానాడు వేదిక మీద కనిపించాయి వినిపించాయి.ఇక టీడీపీలో అగ్ర నాయకుడు చంద్రబాబు అన్నది అందరికీ తెలిసిందే. పార్టీలో ఎవరు చేరాలన్నా కూడా చంద్రబాబునే కలుస్తారు. ఆయనతోనే అన్నీ మాట్లాడుతారు. కానీ ఈసారి మాత్రం భిన్నంగా లోకేష్ చుట్టూ అంతా ప్రదక్షిణం చేస్తున్నారు. పార్టీలో సీనియర్లకు టికెట్లు తగ్గుతాయని ఓడిపోయిన వారిని పనిచేయని వారిని తప్పిస్తామని లోకేష్ మహనాడు తొలిరోజునే మీడియా ముందు బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చేశారు.

నిజానికి లోకేష్ ఆ స్టేట్మెంట్ ఇవ్వడం వెనక కూడా వ్యూహం ఉంది. టీడీపీలో ఏం జరిగినా కర్త కర్మ క్రియ తాను అని చెప్పుకోవడానికే. ఆ ఒక్క స్టేట్మెంట్ తో టీడీపీలో మొత్తం సీని మారిపోయింది. వేదిక మీద నేతలు బాబు పక్కన ఉంటూనే ఎందుకైనా మంచిదని లోకేష్ బాబును కూడా కలసి వస్తున్నారు. అలా చూస్తుకుంటే శ్రీకాకుళం నుంచి అనంతపురం దాకా తలలు పండిన నేతలు అంతా ఈసారి లోకేష్ బాబుతో మాట్లాడేందుకే ఆసక్తి చూపించడం విశేషం.

ఇక నేతల స్పీచులలో కూడా చంద్రబాబు కంటే కూడా లోకేష్ బాబు మీదకే ఫోకస్ పెట్టి ఆయనను పొగడడానికే ఎక్కువ టైమ్ కేటాయించడం జరిగింది. సీనియర్ నేతల విషయానికి వస్తే శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి ప్రత్యేకంగా లోకేష్ బాబు తో భేటీ అయి తాను నియోజకవర్గానికి చేస్తున్న కృషిని చెప్పుకున్నారు.

వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇస్తే కచ్చితంగా పోటీ చేయాలని ఆమె భావిస్తున్నారు. దాంతో చినబాబు మనసులో ఉద్దేశ్యం తెలుసుకోవడానికే భేటీ అయ్యారు అని అంటున్నారు. అయితే లోకేష్ మాత్రం గుండా ఫ్యామిలీకి ప్రాధాన్యత ఉంటుందని చెప్పి అప్పటికి ఏ విషయం చెప్పకుండానే వదిలేశారు. ఇలాగే చాలా మంది సీనియర్లు తమ వారసులను లోకేష్ వద్దకు పంపిస్తూ తమ భవిష్యత్తు మీద భరోసాను తెచ్చుకునే ప్రయత్నం  చేశారు. మాజీ మంత్రులు కళా వెంకటరావు అయ్యన్నపాత్రుడు వంటి వారు అయితే లోకేష్ తోనే అన్నట్లుగా వ్యవహరించారు.

ఇక లోకేష్ కూడా మహానాడు స్పీచులో  సినీ పంచులతో మామ బాలయ్య డైలాగులతో రెచ్చిపోయారు. జింక ముందు ఫ్లూట్ ఊదు సింహం ముందు కాదు అంటూ లోకేష్ బాలయ్య మార్క్  డైలాగులు చెబుతూంటే జగన్ మీద పంచు డైలాగులు వేస్తూంటే అటు చంద్రబాబు ఇటు బాలయ్య కూడా ఫుల్ ఎంజాయ్ చేశారు. మొత్తానికి లోకేష్ ఎలివేషన్ కోసమా మహానాడు అన్నట్లుగానే కధ సాగింది. మరి అంతా తానే అన్నట్లుగా తిరిగిన చినబాబు రానున్న రెండేళ్లలో ఎలాంటి దూకుడు చేస్తారో చూడాలి.