చివరకు ముఖాలపైనా పార్టీ రంగులే!

Sun Dec 05 2021 12:12:00 GMT+0530 (IST)

Eventually the party colors on the faces

రాజకీయ పార్టీలు తమ చిహ్నాన్ని పార్టీ పతాక రంగులను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు నిత్యం ప్రయత్నిస్తూనే ఉంటాయి. ఆ దిశగా అందివచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూనే ఉంటాయి. కానీ కొన్నిసార్లు ఆ రంగుల పిచ్చి ఎక్కువైంది ఇబ్బందులు తప్పవు. ఈ విషయం ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ వైసీపీకి అనుభవమే. 2019 ఎన్నికల్లో అఖండ విజయం తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ.. రాష్ట్రంలోని ప్రభుత్వ భవనాలకు తమ పార్టీ రంగులు వేయించింది. దీనిపై కొంతమంది హై కోర్టును ఆశ్రయించారు. దీంతో ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగులు వేయొద్దని కోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.కోర్టు ఆదేశాలతో ప్రభుత్వ భవనాలకు వైసీపీ రంగులు తొలగించినప్పటికీ అవకాశం వచ్చిన ప్రతి సారి పార్టీ తమ గుర్తులను ప్రదర్శించే ప్రయత్నం చేస్తూనే ఉంది. తాజాగా గుంటూరు జిల్లా పెదకాకాని మండలం వెనిగండ్ల గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అలాంటి సంఘటనే జరిగింది. కానీ ఇక్కడ రంగులు భవనాలకు కాకుండా విద్యార్థుల ముఖాలకు వేశారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ఆ పాఠశాలలో ఓ కార్యక్రమం నిర్వహించారు. అందులో భాగంగా విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనలు చేశారు.

అలా ప్రదర్శనలు చేసిన విద్యార్థులు ముఖాలపై వైసీపీ జెండా గుర్తులైన నీలం తెలుపు ఆకుపచ్చ రంగులున్నాయి. ఇప్పుడా రంగులతో ఉన్న విద్యార్థుల ఫోటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. చివరకు విద్యార్థులను కూడా వదల్లేదు కదా అని విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ కార్యక్రమానికి హోం మంత్రి సుచరిత స్థానిక వైసీపీ ఎమ్మెల్యే కిలారి రోషయ్య హాజరవడం విశేషం. మరి విద్యార్థుల ముఖాలపై ఈ రంగులను ప్రజా ప్రతినిధుల ఆదేశంతోనే వేశారా? లేదా పాఠశాల యాజమాన్యమే ఈ నిర్ణయం తీసుకుందా? అన్నది చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనతో వైసీపీ పార్టీ నాయకులు అవసరమైతే తమ రక్తాన్ని కూడా నీలంగా మార్చుకుంటారనే వ్యాఖ్యలు వ్యంగ్యంగా వినిపిస్తున్నాయి.