Begin typing your search above and press return to search.

బిహార్ లో సొంతంగా గెలవకున్నా.. మేజిక్ చేసే సీన్ ఉందట

By:  Tupaki Desk   |   11 Oct 2020 10:36 AM GMT
బిహార్ లో సొంతంగా గెలవకున్నా.. మేజిక్ చేసే సీన్ ఉందట
X
మరికొద్ది రోజుల్లో జరిగే బిహార్ అసెంబ్లీ ఎన్నికలు ఇప్పుడు దేశ ప్రజల్ని విపరీతంగా ఆకర్షిస్తోంది. దేశ వ్యాప్తంగా చోటు చేసుకున్న పరిణామాలతో బిహార్ ప్రజలు ఇచ్చే తీర్పు జాతీయ రాజకీయాల్లో కొన్ని మార్పులకు అవకాశం ఉంటుందని చెబుతున్నారు. గడిచిన కొన్నేళ్లుగా సంకీర్ణ రాజకీయాలతో రాజకీయ లబ్థి పొందటానికి కాంగ్రెస్ చేస్తున్న ప్రయత్నాలు విఫలమవుతూ వచ్చాయి. కానీ.. ఈసారి అందుకు భిన్నమైన పరిస్థితులు ఉన్నట్లుగా కాంగ్రెస్ భావిస్తోంది.

దేశంలోని కొన్ని చిన్న రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్.. బిహార్ లాంటి పెద్ద రాష్ట్రంలో పాగా వేయటం ద్వారా తన బలాన్ని విస్తరించుకోవటంతో పాటు.. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బలంగా మారటానికి సాయంగా ఉంటుందని భావిస్తోంది. అదే సమయంలో.. మోడీ ప్రభ మసకబారుతుందన్నసంకేతాలకు బిహార్ ఎన్నికల ఫలితం తోడైతే.. రాజకీయ సమీకరణాలు మారతాయన్న ఆశను పెట్టుకుంది.

దీనికి తగ్గట్లే.. ఎన్డీయేలోని పరిణామాలు తమకు ప్లస్ అవుతాయని భావిస్తున్నారు. లోక్ జనశక్తి పార్టీ ఈసారి ఒంటరిగా పోటీ చేస్తుండటంతో జేడీయూకు పడే ఓట్లు చీలతాయని భావిస్తున్నారు. దీనికి తోడు గడిచిన రెండు దఫాలుగా అధికారంలో ఉన్న నితీశ్ సర్కారుపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని.. ఈసారి ఎన్నికల్లో తమకు లాభిస్తుందన్న మాట వినిపిస్తోంది.

రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ)తో సీట్ల సర్దుబాటు చేసుకున్న కాంగ్రెస్..ఈసారి తమ కూటమికి అధికారం ఖాయమన్న భావనలో ఉంది. దీనికి తోడు ఆర్జేడీ కూడా కసిగా ఉంది. ఒకప్పుడు బిహార్ లో చక్రం తిప్పిన తమకు.. తమ కుటుంబానికి గడ్డు పరిస్థితులు ఎదురుకావటంతో పాటు.. ఆర్జేడీ అధినేత లాలూ జైల్లో ఉన్న దరిమిలా.. ఆ పార్టీ తన ఉనికి కోసం తీవ్రంగా శ్రమిస్తోంది. ఎన్డీయేలో వచ్చిన చీలిక.. తమ కూటమిలోని ఐక్యత పుణ్యమా అని రాజకీయ ప్రయోజనం చేకూరటం ఖాయమన్న భావన కలుగుతోంది.

ఇదిలా ఉంటే.. ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ అనుకున్నంతగా రాణించకున్నా.. బీజేపీ-జనతాదళ్ కూటమికి మాత్రం దెబ్బేయటంలో సక్సెస్ ఖాయమంటున్నారు. మరేం జరుగుతుందన్నది ఎన్నికల ఫలితాలు స్పష్టం చేస్తాయని చెప్పక తప్పదు.