Begin typing your search above and press return to search.

నిమిషం ఆలస్యమైనా సార్లకు షాకే.. జగన్ మార్కు ఆదేశం

By:  Tupaki Desk   |   16 Aug 2022 6:55 AM GMT
నిమిషం ఆలస్యమైనా సార్లకు షాకే.. జగన్ మార్కు ఆదేశం
X
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎవరినైనా టార్గెట్ చేస్తే ఎలా ఉంటుంది? తనకు ఇబ్బంది కలిగించిన వారి విషయంలో ఆయన ఎలా వ్యవహరిస్తారు? చేతికి ఎముక అన్నది లేనట్లుగా పథకాల మీద పథకాలు ఇస్తూ.. తనకు మించిన పెద్ద మనసు మరెవరికీ ఉండదన్నట్లుగా వ్యవహరించే ఆయనకు.. ఎవరి మీదైనా కోపం వస్తే ఎలా ఉంటుంది? అన్న విషయానికి నిలువెత్తు నిదర్శనం ఉండే ఒక ఉదంతాన్ని చెబుతున్నారు.

తాజాగా ఏపీ ప్రభుత్వ ఉపాధ్యాయులకు సంబంధించి.. వారికి దిమ్మ తిరిగిపోయేలాంటి నిబంధనను అందుబాటులోకి తీసుకొచ్చింది జగన్ సర్కారు. దీని ప్రకారం ప్రభుత్వ ఉపాధ్యాయులు ఎవరైనా సరే.. ఉదయం 9 గంటల తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా సరే.. ఆ రోజును హాఫ్ డే సెలవుగా పరిగణలోకి తీసుకోనున్నట్లుగా ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇందుకోసం యాప్ ఆధారిత అటెండెన్సు ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

నిజానికి ఇలాంటి నిబంధనను తప్పు పట్టాల్సిన అవసరం లేదు. అయితే.. టైమ్ విషయంలోనూ టైమింగ్ విషయంలోనూ ఇంతటి పక్కాగా ఉండాలని ప్రభుత్వం భావిస్తే.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులతో పాటు.. అన్నివిభాగాలకు ఇదే విధానాన్ని ఎందుకు అమలు చేయటం లేదు? అన్నది ప్రశ్న. ఉపాధ్యాయుల్ని మాత్రమే ఎందుకు అన్నది కూడా ప్రశ్నే. నిమిషం ఆలస్యమన్నది ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా పెద్ద విషయంగా పరిగణించి.. ఏకంగా హాఫ్ డే లీవ్ కింద పరిగణలోకి తీసుకుంటామని చెబుతున్న తీరు చూస్తే.. సర్కారీ టీచర్ల మీద తనకున్న కోపాన్ని ఇలా తీర్చుకున్నారన్న మాట వినిపిస్తోంది.

2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తిరుగులేని మెజార్టీతో చారిత్రక విజయాన్ని సొంతం చేసుకున్న ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. అన్ని వర్గాల నుంచి సంపూర్ణ మద్దతు ఉండటం తెలిసిందే. అయితే.. ప్రభుత్వ విధానాలతో రగిలిన ఉపాధ్యాయులు చేపట్టిన నిరసన రెండు తెలుగురాష్ట్రాలతో పాటు.. దేశ ప్రజలను ఆకర్షించింది. భారీ బందోబస్తు.. పెద్ద ఎత్తున పోలీసు ఆంక్షలు చేపట్టి.. ఎక్కడి వారిని అక్కడ అరెస్టు చేసి.. బెజవాడకు రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేయటం.. అందుకు భిన్నంగా ప్రభుత్వానికి కన్నుగప్పి విజయవాడకు లక్షలాదిగా చేరుకోవటం.. ఒక్కసారిగా విజయవాడ రోడ్లు మొత్తం జనసంద్రంగా మారిన తీరుతో అందరూ ఆశ్చర్యపోయే పరిస్థితి.

నిజానికి జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎదురైన తొలి భారీ ఎదురుదెబ్బగా అభివర్ణిస్తారు. అందుకే.. తనకు ఇబ్బంది కలిగించి.. తన ఇమేజ్ ను దారుణంగా డ్యామేజ్ చేసిన వారికి సరైన గుణపాఠం నేర్పాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వ టీచర్ల విషయంలో ఈ కొత్త తరహా నిబంధనను తీసుకొచ్చి.. వారికి చుక్కలు చూపించే ఆలోచన చేసినట్లుగా చెబుతారు.నిమిషం ఆలస్యం కాకుండా ఐదు నిమిషాల ముందు బడికి చేరుకుంటే ఇబ్బంది ఉండదు కదా? అన్న ప్రశ్న చాలామందికి రావొచ్చు.కానీ..

అసలు విషయం ఏమంటే.. గ్రామాల్లోనూ.. మారుమూల ప్రాంతాల్లో స్కూల్ టీచర్లుగా పని చేసేవారు సమీపంలోని పట్టణాల్లో నివసిస్తుంటారు. అలాంటి వారు స్కూల్ కు చేరుకునేసరికి.. కాస్త ఆలస్యమవుతుంది. ఈ ఇబ్బందిని తనకు అనుుకూలంగా మార్చుకొని సీఎం జగన్ టార్గెట్ చేశారంటున్నారు. ఇప్పుడీ ఇబ్బందిని ప్రభుత్వ ఉపాధ్యాయులు అధిగమించాలంటే తమ స్కూల్ ఉదయం 8.30 గంటలకే అనుకుంటే తప్పించి సాధ్యం కాదని చెప్పక తప్పదు.