మూడేళ్ళు అయినా మాస్కుల బిల్లుకే గతి లేదా... వైసీపీ సర్కార్ మీద విమర్శ

Fri Dec 02 2022 21:00:01 GMT+0530 (India Standard Time)

Even after three years there is no money of the mask bill Criticism on the YCP

మాస్క్ అన్నది అలవాటు లేని కాలం నుంచి అది కంపల్సరీ చేసిన యుగం ఒకటి నడచింది. అదే కరోనా యుగం. కలియుగంలో కరోనా అవతరించి తన పవరేంటో చూపించింది. ఆ టైంలో ప్రతీ మనిషికీ వజ్రాయుధం ఏదైనా ఉంది అంటే అవి మూతికి కట్టుకునే మాస్కులే. ముక్కు నోరూ మూసుకుని కరొనా వైరస్ చొరబడకుండా జనాలు వాడేవారు.కరోనా  మూడేళ్ళ  క్రితం దేశంలో ప్రవేశించినపుడు దాన్ని ఎలా ఎదుర్కోవాలో కూడా ఎవరికీ తెలియదు. ఆ సమయంలో మాస్క్ అన్నవి కూడా పెద్దగా జన సామాన్యానికి పరిచయం లేనివి. అందనివి. అటువంటి మాస్కులను తెచ్చి కోట్లాదిమంది జనాలకు అందించడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. దేశంలో కరోనా ఒక వైపు వీర విహారం చేస్తూంటే మాస్కుల తయారీ కూడా వీర లెవెల్ లో సాగింది. అది కుటీర పరిశ్రమ నుంచి భారీ పరిశ్రమగా మారిపోయింది.

అతి పెద్ద వ్యాపారంగా కూడా దేశంలో ఒకనాడు మారింది. ఇక కుటీర వ్యాపారం గురించి చెప్పుకుంటే కుట్టు మిషన్ ఉన్న వారు అంతా తాము ఇరవై నాలుగు గంటలలో ఇరవై గంటలు దాని మీదనే కూర్చుని మాస్కులను తయారు చేసి ప్రభుత్వానికి అంతే వేగంగా అందించారు. అలా ఏపీలో చాలా చోట్ల మాస్కులు విరివిగా లభించడానికి తెర వెనక ఎందరో కష్టం ఉంది.

ఇకపోతే నెల్లూరు జిల్లాకు చెందిన ఒక మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్త అయితే ఇరవై కుట్టు మిషన్లు అప్పు చేసి కొన్నారు. వాటితో పాటు దర్జీలను కూడా జీతానికి పెట్టి వారితో లక్షలాది మాస్కులను తయారు చేసి ప్రభుత్వానికి అందించారు. ఆ విధంగా కరోనా కష్టకాలంలో ప్రభుత్వానికి మాస్కులు దండీగా అందాయి. వాలంటీర్ల ద్వారా వాటిని ఇంటింటికీ పంపిణీ చేసి ప్రభుత్వం కూడా మంచి మార్కులు తెచ్చుకుంది.

జనాలు కూడా కరోనా బారి నుంచి అలా తమను తాము కాపాడుకున్నారు. ఇపుడు కరోనా అన్నది ఎక్కడా లేదు. దాంతో ఆ విషయం అంతా మరచిపోయారు. మళ్లీ మాస్క్ అంటే ఏమిటి అన్న చర్చ వస్తోంది. ఆ సంగతి అలా ఉంచితే మాస్కులను లక్షలాదిగా తయారు చేసిన నెల్లూరుకు చెందిన ఔత్సాహిక మహిళాపారిశ్రామికవేత్త తన గోడుని ఇపుడు సోషల్ మీడియా వేదికగా వెళ్లబోసుకున్నారు.

మాస్కులను లక్షలాదిగా తాను తయారు చేసి ప్రభుత్వానికి ఇచ్చానని దానికి గానూ తనకు డబ్బులు ఒక్క పైసా కూడా ఈ రోజుకీ చెల్లించలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తాను అప్పు చేసి కుట్టు మిషన్లు కొన్నానని వర్కర్లను పెట్టుకుని వారి జీతభత్యాలు కొంత చెల్లించాలని ఇంకా వారికి బకాయి ఉంది. అప్పులు ఉన్నాయని కానీ ప్రభుత్వం నుంచి మాత్రం డబ్బులు రాలేదని ఆమె వాపోయారు.

ఎందరినో అడిగి విసిగి వేసారి ఇపుడు సోషల్ మీడియాలో పోస్టింగ్ పెడుతున్నాను అని ఆమె అంటున్నారు. ముఖ్యమంత్రి జగన్ ఈ విషయంలో స్పందిస్తే తన కష్టం తీరుతుందని అప్పులు కూడా తీరుతాయని ఆమె వేడుకుంటున్నారు. ఇదిలా ఉండగా ఈ పోస్తు ఇపుడు తెగ వైరల్ అవుతోంది.

మూడేళ్ళ క్రితం కుట్టిన మాస్కులకే డబ్బులు చెల్లించలేని వైసీపీ సర్కార్ మూడు రాజధానులు కడుతుందా అంటూ సెటైర్లు నెటిజన్ల నుంచి పడుతున్నాయి. ఏది ఏమైనా మాస్కులు కుట్టి ఇచ్చిన వారు చేసింది వ్యాపారం కాదు సేవ. అలాంటి వారి రుణం తీర్చుకోలేనిదే. వారి బకాయి డబ్బులు సర్కార్ ఎంత వేగంగా ఇస్తే అంత మంచిది అని సూచనలు కూడా నెటిజన్ల నుంచి వస్తున్నాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.