Begin typing your search above and press return to search.

రాజకీయాల్లో గొర్రెల మంద మీద తోడేళ్లు పడటం మామూలేగా రాజేందర్?

By:  Tupaki Desk   |   16 May 2021 4:30 AM GMT
రాజకీయాల్లో గొర్రెల మంద మీద తోడేళ్లు పడటం మామూలేగా రాజేందర్?
X
రాజకీయాలు ఎంత కఠినంగా.. క్రూరంగా ఉంటాయో సీనియర్ నేత ఈటల రాజేందర్ కు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అధినేతతో లెక్కలు తేడా వచ్చిన తర్వాత పరిస్థితులు మరెంత బ్యాడ్ అవుతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సుదీర్ఘకాలం పాటు.. తన మాటను వ్యతిరేకించే వారి విషయంలో పెద్ద సారు తీరు ఎంత కఠినంగా ఉంటుందో ఈటల లాంటి వారికి తెలియనిది కాదు. అయినప్పటికి.. అదే విషయాన్ని ప్రస్తావిస్తున్న రాజేందర్ తీరు విస్మయానికి గురి చేయక మానదు.

మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేసిన తర్వాత నుంచి తన ఉనికిని ప్రశ్నార్థకం చేయాలన్న పట్టుదలతో పావులు కదుపుతున్న సంగతి తెలిసిందే. తనకు మద్దతుగా నిలిచే వారిపై పెద్ద ఎత్తున ఒత్తిళ్లు.. బెదిరింపులు మామూలే. ఇవన్నీ ఊహించిన అంశాలే. కానీ.. ఇవన్నీ జరుగుతుంటే మాత్రం తట్టుకోలేకపోతున్నారు ఈటల రాజేందర్. తాజాగా ఆయన మీడియాకు తన ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.

గొర్రెల మంద మీద తోడేళ్ల మాదిరి.. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న హుజూరాబాద్ నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులపై బెదిరింపులకు పాల్పడుతున్నట్లుగా ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమ వేళలో ఏ మాత్రం సంబంధం లేని వారు ఇప్పుడు చెలరేగిపోతున్న వైనంపై ఈటల వేదన చెందుతున్నారు. సర్పంచ్ లు.. ఎంపీటీసీ సభ్యుల్ని ఉద్యమంతో ఏ మాత్రం సంబంధం లేని మంత్రి.. ముఖ్యమంత్రి నియమించిన కొందరు ఇన్ చార్జులు ఫోన్ చేసి డబ్బులు ఆశ చూపుతూ డెవలప్ మెంట్ పనులకు బిల్లులు రావని బెదిరిస్తున్నట్లుగా పేర్కొన్నారు.

తాజాగా జరుగుతున్న దాడిని గొర్రెల మందపై తోడేళ్ల గుంపు జరుపుతున్న దాడిగా ఈటల అభివర్ణిస్తున్నారు. అయినా.. అంత పెద్ద సారుతో పెట్టుకున్న తర్వాత.. ఆ మాత్రం సవాళ్లు ఎదురుకాకుండా.. నిమ్మళంగా అయితే ఉండదు కదా? అందుకు తగ్గట్లే మానసికంగా.. ఆర్థికంగా సిద్ధం కావాల్సింది పోయి.. అదే పనిగా బలహీన పరుస్తున్నారంటూ ఆవేదన చెందితే ప్రయోజనం ఏమీ ఉండదు. ప్రస్తుతం నెలకొన్న కరోనా వేళ.. వెకిలిచేష్టలు ఆపాలని.. లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. సమైక్య రాష్ట్రంలో ఇలాంటివే ప్రయత్నాలు చేసి.. భంగపడినట్లుగా గుర్తు చేయటం వరకు ఈటల బాగానే ఉన్నా.. అప్పటికి ఇప్పటికి తన పరిస్థితిలో వచ్చిన తేడాను ఈటల మాష్టారు గుర్తిస్తే మంచిదన్నది మర్చిపోకూడదు. లేదంటే.. తోడేళ్ల గుంపు గొర్రెల మందను అట్టే కాలం ఉండనివ్వవమన్న వాస్తవాన్ని గుర్తించాలి.