ఈటెలకు నెగిటివ్.. ఆయన పేషీని కరోనా ఊపేస్తుందట!

Sat Sep 19 2020 10:30:04 GMT+0530 (IST)

Etela Rajendra Tested Negative For The Virus

తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి ఈటెల రాజేందర్ కు సంబంధించిన ఆసక్తికర అంశం ఆయనే స్వయంగా వెల్లడించారు. ఒక ప్రముఖ మీడియా సంస్థతో మాట్లాడిన ఆయన.. తాజాగా తాను కరోనా పరీక్ష చేయించుకున్నానని.. నెగిటివ్ వచ్చిందని పేర్కొన్నారు. కరోనా నేపథ్యంలో ఇప్పటికే ఆయన పలుమార్లు పరీక్ష చేయించుకున్నారు. ఆసక్తి కరమైన విషయం ఏమంటే.. నిత్యం వైద్యులతోనూ.. వైద్య సిబ్బంది తో పాటు.. వైద్య శాఖ కు చెందిన అధికారుల తో భేటీ అవుతున్నా.. ఈటెల దరికి మాత్రం వైరస్ చేరలేదు.ఇదిలా ఉంటే.. మంత్రి ఈటెల పేషీలో తాజాగా కరోనా చుక్కలు చూపిస్తుంది. తాజా గా ఆయన పేషి కి చెందిన పలువురు కరోనా పాజిటివ్ గా తేలింది. ఒకేసారి ఏడుగురికి కరోనా పాజిటివ్ రావటంతో.. మంత్రి పేషీలోని వారు ఒత్తిడి తో ఉక్కిరి బిక్కిరి అవతున్నారు. తాజాగా పాజిటివ్ వచ్చిన ఏడుగురిలో ఇద్దరు డ్రైవర్లు.. మరో ఇద్దరు పీఏలు.. ముగ్గురు గన్ మెన్లకు పాజిటివ్ గా తేలినట్లుగా ఆయన చెప్పారు.

ఒకేసారి పేషీలో ఇంత మందికి కరోనా పాజిటివ్ వచ్చిన నేపథ్యంలో రెండు రోజుల్లో మరోసారి పరీక్షలు చేయించుకోనున్నట్లుగా చెప్పారు. ఒకేసారి ఇంతమందికి పాజిటివ్ గా తేలటంతో బీఆర్కే భవనంలోని సిబ్బంది విస్మయానికి గురవుతున్నారు. తాజాగా ఈటెల పేషీని భారీగా శానిటైజ్ చేశారు. ఏమైనా.. అందరిని ఇట్టే పాకేసే కరోనా కాటు నుంచి మంత్రి ఈటెల ఎప్పటికప్పుడు బయట పడటంపై ఆయన సన్నిహితులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.