Begin typing your search above and press return to search.

కేసీఆర్ పాచిక పార‌ట్లేదా?

By:  Tupaki Desk   |   18 May 2021 2:30 PM GMT
కేసీఆర్ పాచిక పార‌ట్లేదా?
X
తెలంగాణ రాష్ట్ర స‌మితి అధినేత‌గా కేసీఆర్ వ్యూహాల గురించి తెలియ‌ని వారు ఎవ‌రూలేరు. ఉద్య‌మ చ‌రిత్ర‌ను ప‌రిశీలిస్తే.. ఆయ‌న వ్యూహాల ప‌దును ఏంట‌న్న‌ది తెలుస్తుంది. అలాంటి కేసీఆర్ ఎత్తుగ‌డ‌లు హుజూరాబాద్ లో ప‌నిచేయ‌ట్లేదా? పూర్తిస్థాయిలో సఫలం కావట్లేదా? అన్న ప్ర‌శ్న‌ల‌కు అవును అన్న స‌మాధాన‌మే వినిపిస్తోంది.

ఈట‌ల‌ను బ‌ర్త‌ర‌ఫ్ చేయ‌డంతో హుజూరాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలోని టీఆర్ఎస్ నుంచి పెద్ద ఎత్తున వ్య‌తిరేక‌త వ‌చ్చింది. దాదాపు 90 శాతం మంది ప్రజాప్ర‌తినిధులు ఈట‌ల వెంటే ఉంటామ‌ని మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. దీంతో అప్ర‌మ‌త్త‌మైన అధిష్టానం.. వారిని క‌ట్ట‌డి చేసేందుకు విశ్వ‌ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టింది.

ఈ బాధ్య‌త‌ను మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్ కు అప్ప‌గించారు కేసీఆర్‌. అదే ప‌నిమీద ఉన్న గంగుల‌.. మొత్తం హుజూరాబాద్ మీద‌నే దృష్టి పెట్టారు. ఈట‌ల వెంట వెళ్తామ‌న్న నేత‌ల‌ను పిలిచి మాట్లాడుతున్న‌ట్టు స‌మాచారం. కొంత మందిని ప్ర‌లోభ‌పెడుతూ.. విన‌నివారిపై బెదిరింపుల‌కు సైతం దిగుతున్నార‌నే ఆరోప‌ణ‌లు కూడా వ‌స్తున్నాయి. ఈ విష‌య‌మై ఈట‌ల కూడా విమ‌ర్శ‌లు గుప్పించారు. ఇప్ప‌టి వ‌ర‌కు చేసిన ప‌నుల‌కు బిల్లులు ఆపేస్తామ‌ని బెదిరిస్తున్నార‌ని అన్నారు.

ఈ క్ర‌మంలో కొంద‌రు టీఆర్ఎస్ వెంట‌నే ఉన్నామంటూ ప్ర‌క‌ట‌న‌లు చేస్తున్నారు. అయితే.. అది నామ‌మాత్ర‌మేన‌ని అంటున్నారు. ఇటీవ‌ల జ‌మ్మికుంట మునిసిపాలిటీ చైర్మ‌న్, వైస్ చైర్మ‌న్ల‌తోపాటు ప‌లువురు కౌన్సిల‌ర్లు కూడా గులాబీ పార్టీలోనే ఉంటామ‌ని చెప్పారు. అయితే.. కొద్దిరోజుల్లోనే వారు యూ ట‌ర్న్ తీసుకున్నట్టు స‌మాచారం. తాము ఈట‌ల‌తోనే ఉంటామ‌ని చెప్పిన‌ట్టుగా వార్త‌లు వ‌స్తున్నాయి.

టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి ఉన్న ఈట‌ల.. నియోజ‌క‌వ‌ర్గంలో అంద‌రి త‌ల‌లో నాలుక‌లా ఉన్నారు. పైగా.. ఈ వేధింపులు కూడా రాజ‌కీయ క‌క్ష‌సాధింపులో భాగ‌మేననే విష‌యాన్ని చాలా మంది న‌మ్ముతున్నారు. దీంతోనే.. ఎన్ని విధాలుగా ప్ర‌య‌త్నించినా.. ఈట‌ల వైపు నుంచి ప‌క్క‌కు రావ‌ట్లేద‌ని అంటున్నారు. మ‌రి, కేసీఆర్ ఇంకా ఎలాంటి వ్యూహాలు ర‌చిస్తారో చూడాలి.