Begin typing your search above and press return to search.

ఈట‌ల ఒంట‌రి పోరేనా.. క‌లిసిరాని బీజేపీ నాయ‌క‌త్వం!

By:  Tupaki Desk   |   31 July 2021 12:30 AM GMT
ఈట‌ల ఒంట‌రి పోరేనా.. క‌లిసిరాని బీజేపీ నాయ‌క‌త్వం!
X
ఉమ్మ‌డి క‌రీంన‌గ‌ర్ జిల్లాలోని హుజూరాబాద్ నియోజ‌క‌వ‌ర్గానికి త్వ‌ర‌లోనే ఉప ఎన్నిక జ‌ర‌గ‌నుంది. ఇక్క‌డి సీనియ‌ర్ నాయ‌కు డు, మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్‌.. రాజీనామాతో ఇక్క‌డ ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. అయితే.. ఇక్క‌డ ఈట‌లను ఓడించేందు కు స‌ర్వ‌స‌న్నాహాలు చేస్తున్న అధికార పార్టీతోపోల్చుకుంటే.. ఈట‌ల ప్రాతినిధ్యం వ‌హిస్తున్న బీజేపీ పార్టీ మాత్రం కేవ‌లం మాట‌ల‌కే ప‌రిమిత‌మైంది. రాజకీయంగా విమ‌ర్శ‌లు చేయ‌డానికే నాయ‌కులు ప్రాధాన్యం ఇస్తున్నార‌నే వాద‌న బీజేపీలో వినిపిస్తోంది. కేసీఆర్‌ను విమ‌ర్శించినంత మాత్రాన విజ‌యం ద‌క్కించుకోవ‌డం సాధ్య‌మేనా..? పైగా ఈట‌ల‌కు మ‌ద్ద‌తుగా ఒక్క నేత‌ను కూడా బీజేపీ రంగంలోకి దించ‌లేదు.

మ‌రోవైపు త‌న నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ట్టు కోల్పోకుండా.. అధికార పార్టీపై ప‌ట్టు సాధించేందుకు ఈట‌ల ఇప్ప‌టికే పాద‌యాత్ర ప్రారం బించారు. ఇంటింటికీ తిరుగుతున్నారు. ప్ర‌తి ఒక్క‌రినీ క‌లుస్తున్నారు. త‌ను ఎందుకు టీఆర్ ఎస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిందీ.. వివ‌రిస్తున్నారు. మంత్రిగా త‌న‌ను బ‌ర్త‌ర‌ఫ్ చేయ‌డం వెనుక కుట్ర ఉంద‌ని ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తున్నారు. అదేస‌య‌మంలో ఆయ‌న స‌తీమ‌ణి జ‌మున కూడా నియోజ‌క‌వ‌ర్గంలో ఇంటింటికీ తిరుగుతున్నారు. మ‌హిళ‌ల‌కు ప‌సుపు కుంకుమ ఇచ్చి.. త‌న భ‌ర్త‌కు అన్యాయం జ‌రిగింద‌ని.. ప్ర‌జ‌లే గెలిపించాల‌ని వేడుకుంటున్నారు. దీంతో హుజూరాబాద్‌లో ఈట‌ల కుటుంబం హ‌డావుడే క‌నిపిస్తోంది తీప్ప‌.. బీజేపీ త‌ర‌ఫున ఏఒక్క సీనియ‌ర్ నాయ‌కుడు కూడా రంగంలోకి దిగ‌లేదు.

నిజానికి ఈట‌ల గెలుపు బీజేపీకి కూడా ఎంతో ముఖ్య‌మని కేంద్ర మంత్రి కిష‌న్‌రెడ్డి ఇటీవ‌ల ప్ర‌క‌టించారు. ఆయ‌న‌ను గెలిపించు కోవ‌డం ద్వారా .. బీజేపీ పుంజుకుంటుంద‌ని అన్నారు. ఇక‌, బీజేపీ రాష్ట్ర చీఫ్ బండి సంజ‌య్ కూడా హుజూరాబాద్‌లో బీజేపీ జెండా ఎగుర‌వేస్తామ‌ని చెప్పారు. ఇక‌, మ‌హిళా ఫైర్ బ్రాండ్ డీకే అరుణ కూడా మాట‌ల తూటాలు పేలుస్తున్నారు. హుజురాబాద్ గెలుపు.. బీజేపీకి భవిష్యత్తుకు నాంది అని డీకే అరుణ అన్నారు. మోసం, అబద్దాలకు కేరాఫ్ అడ్రస్ ముఖ్యమంత్రి కేసీఆర్ అని వ్యాఖ్యానించారు. బీజేపీ వలనే దళితుబంధు పథకం తీసుకువచ్చారన్నారు. దళితులపై కేసీఆర్‌కు ప్రేముంటే రాష్ట్రమంతటా ఒకేసారి దళితబంధు అమలు చేయాలని డిమాండ్ చేశారు.

ఎన్నికల‌ కోసం ప్రభుత్వ డబ్బును ఖర్చు చేస్తున్న కేసీఆర్‌ను ప్రగతి భవన్ నుంచి తరిమికొట్టాలన్నారు. కావాల్సి‌న వారి కోసమే కోకాపేట భూములు రేట్లు పెంచారని ఆరోపించారు. అభివృద్ధి జరగాలంటే ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని ప్రజలు కోరుకుంటు న్నారన్నారు. ఓటమి భయంతోనే కేసీఆర్ దళితబంధును తీసుకొచ్చారని డీకే అరుణ విమర్శించారు. అయితే.. బీజేపీ సీనియ‌ర్లు, నాయ‌కులు ఎవ‌రైనా.. మీడియా ముందుకు వ‌చ్చి మాట్లాడుతున్నారే త‌ప్ప‌.. ఈట‌ల కుటుంబానికి నైతికంగా.. మ‌ద్ద‌తిచ్చేలా క్షేత్ర‌స్థాయిలో మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కు అడుగు పెట్ట‌లేద‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. కేవ‌లం మాట‌లు మాత్ర‌మే చాల‌వ‌ని.. కేసీఆర్ వంటి దురంధ‌రుడిని ఎదుర్కొనేందుకు ఇప్ప‌టి నుంచి ఈట‌ల‌ను బ‌లోపేతం చేయాలంటే.. సీనియ‌ర్లు రంగంలోకి దిగాల‌ని రాజ‌కీయ పండితులు సూచిస్తున్నారు. మ‌రి ఏం చేస్తారో.. చూడాలి.